విశ్వనగరానికి...రోడ్ మ్యాప్
- రూ.10 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి
- తొలి దశలో రూ.150 కోట్ల వ్యయం
- అనుమతి కోసం సర్కారుకు జీహెచ్‌ఎంసీ లేఖ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను విశ్వనగరంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్...ఇందులో భాగంగా నగరంలోని రహదారులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలివిడతగా 30-40 కి.మీ.ల మేర రహదారులను తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.150 కోట్లతో పనులకు సిద్ధమయ్యారు. పరిపాలనపరమైన అనుమతులు ఇవ్వాల్సిందిగా శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు.
రూ.10 వేల కోట్లతో రహదారులు
నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ నగరాల తరహాలోరహదారుల నిర్మాణంతో పాటే కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,ల ఇరువైపులా పచ్చదనం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు, పబ్లిక్ టాయ్‌లెట్లు, బస్‌షెల్టర్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌లో బస్సులు ప్రయాణించే ప్రధాన రహదారులు 1100 కి.మీ. ఉన్నాయి. ఇందులో వెయ్యి కిలోమీటర్ల పనులకు అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ పనులకు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
టెండర్ దక్కించుకునే సంస్థలు కనీసం ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి సైతం ఈ అంశానికి ప్రాధాన్యమివ్వడంతో ఏ మార్గాల్లో పనులు చేయాలో గుర్తించే పనిలో పడ్డారు. ఈ పనులకు కన్సల్టెంట్స్ సేవలను తీసుకోనున్నారు. ఏ మార్గంలో ఎలాంటి డిజైన్ ఉపయుక్తమో కన్సల్టెంట్స్ తమ నివేదికతోపాటు అందజేస్తారు. పనుల పూర్తికి మూడేళ్లు పడుతుందని అంచనా. డక్టింగ్‌లో ఏర్పాటు చేసే కేబుళ్లకు కేబుల్ సంస్థల నుంచి చార్జీలు వసూలు చేస్తారు.
నాలాల అభివృద్ధికి మరో రూ. 10వేల కోట్లు
రహదారులతో పాటు మరో రూ. 10 వేల కోట్లతో నాలాల ఆధునీకరణ పనులు చేపడతామని క్రెడాయ్ ప్రాపర్టీషోలో కేసీఆర్ హామీ ఇచ్చారు. నాలాల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చవుతాయని కన్సల్టెంట్స్ సంస్థలు గతంలో నివేదించాయి. దాదాపు 1500 కిలోమీటర్ల మేర నాలాల ఆధునికీకరణ పనులు జరగాల్సి ఉంది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా మంజూరైన రూ.266 కోట్లు కూడా జీహెచ్ ఎంసీ ఖర్చు చేయలేకపోయింది. భూసేకరణ ఇబ్బందులతో ఈ పనులు ముందుకు కదల్లేదు. వీటినీ జాతీయ/అంతర్జాతీయ సంస్థలకు అప్పగించనున్నట్లు సమాచారం.