గాంధీ ఆస్పత్రి/నల్లకుంట: సాధారణ జ్వరం, జలుబు లక్షణాలు కన్పిస్తే చాలు కరోనాగా అనుమానిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చైనాకు వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఐదు కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, ఫీవర్ ఆస్పత్రిలో నాలుగు కేసులు నమోదయ్యాయి.
అనుమానిత బాధితులు వీరే...
చైనా నుంచి వచ్చిన షాపూర్‌నగర్‌కు చెందిన మహిళ (29), ఆమె సోదరి (24), కొచ్చిన్ నుంచి వచ్చిన బొల్లారానికి చెందిన యువతి (20), షాంగై నుంచి వచ్చిన ఖమ్మం జిల్లావాసి (28), వియత్నాం నుంచి వచ్చిన మౌలాలివాసి (60) గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇక బీజింగ్ నుంచి వచ్చిన గచ్చిబౌలికి చెందిన ఇద్దరు యువకులు (30, 32), ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు (32), కంచన్‌బాగ్‌కు చెందిన యువకుడు (27)లను నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. వీరి నుంచి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయంలోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తొమ్మిది అనుమానిత కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే నాలుగు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరో ఐదు రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 25 అనుమానిత కేసులు నమోదు కాగా, వీరిలో 21 మందిలో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరో నాలుగు రిపోర్టులు రావాల్సి ఉంది.
పెరిగిన ఎన్95 మాస్క్ ధర
ప్రమాదకరమైన స్వైన్‌ఫ్లూ.. కరోనా వైరస్‌లు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులతో పాటు ఆయా రోగులకు సహాయంగా వచ్చిన బంధువులు సైతం వ్యక్తిగత భద్రతపై దృష్టి సారించారు. ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సలు అందించే వైద్య సిబ్బందితో పాటు లిఫ్ట్‌బోయ్‌లకు, అనుమానిత రోగులకు వైద్య ఆరోగ్యశాఖ ఈ మాస్కులను సరఫరా చేస్తుంది. రోగులకు సహాయంగా వచ్చిన బంధువులు వీటిని స్వయంగా సమకూర్చుకోవాల్సి వస్తుంది. కరోనా, ఫ్లూ వైరస్‌లు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మాస్క్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
మామూలు రోజుల్లో సాధారణ మాస్క్ రూ.5కు లభించగా, ఎన్95 మాస్క్ రూ.90కి లభించే ఈ మాస్క్...ప్రస్తుతం రూ.250 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. కాగా తాజాగా గాంధీలో మూడు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇదే లక్షణాలతో మరో ముగ్గురు అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా, స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వచ్చే అనుమానిత రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఆస్పత్రి అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆయన గాంధీ ఐసోలేషన్, ఎక్యూట్ మెడికల్ కేర్ వార్డు, ఐసీయూలను పరిశీలించారు.
‘కరోనా’ వదంతులు నమ్మొద్దు: ఈటల
హుజూరాబాద్: ‘కరోనా వ్యాధికి సంబంధించిన వదంతులు నమ్మకండి. రాష్ట్రంలో ఇప్ప టివరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రా జేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ ‘నెలరోజుల నుంచి కరోనా వైరస్ భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశాం’అని చెప్పారు. ఇప్పటివరకు చైనా నుంచి 52 మంది వచ్చారని. ఇందులో 25 మందికి పుణేలో, 25 మందికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేరకంగా ఉంటాయని, ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకో వాలని సూచించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఒక ప్రత్యేక అధికారితో పాటు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment