
నిజాం చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
నిజాం నవాబు వాస్తవ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హిందూ దేవాలయాలకు నిధులిచ్చారు : ఎంపీ అసదుద్దీన్
సిటీబ్యూరో: నిజాం నవాబు వాస్తవ చరి త్రను పాఠ్యాంశంగా చేర్చాలని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుందర్‌లాల్ కమిటీ రిపోర్టును హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మంగళవారం సీనియర్ జర్నలిస్టు ఎం.ఎ మజీద్ ఉర్దూలో అనువదించిన ‘నా శవ పేటికపై ఉత్సవాలా..!’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల కోసం నిజాం నవాబుల వాస్తవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
నిజాం నవాబు సెక్యులర్‌వాదని, మిగతా ప్రాంతాల కంటే దక్కన్ హైదరాబాద్‌లోనే మతసామరస్యం వెల్లివిరిసిందని అన్నారు. ఈ విషయాలను పండిత్ సుందర్‌లాల్ కమిటీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. హిందూ దేవాలయాల నిర్మాణాలకు, నిర్వహణకు ప్రతి ఏటా నిధులు కూడా అందించిన ఘనత నిజాం నవాబులకే దక్కుతుందన్నారు. హిందూ సమాజంలో దేవదాసీ వ్యవస్థను నిజాం నవాబులే అంతమొందించారని అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు నాటి హిందూ మహాసభ.. నిజాం నవాబుకు కృతజ్ఞతలు తెలిపిందని గుర్తు చేశారు. తామీర్-ఏ-మిల్లత్ అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్ ఖురేషీ, కెప్టెన్ పాండురంగారెడ్డి, సత్యనారాయణ, విరాహత్ అలీ, మజీద్ తదితరులు పాల్గొన్నారు.