రైతులను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో పార్లమెంట్ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. నేటి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉండగా, ఆ తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది. అభ్యర్థుల సంఖ్య 95 మించితే బ్యాలెట్ విధానం ద్వారానే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
సాక్షి, నిజామాబాద్ : తమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. బుధవారం ఒక్కరు కూడా నామినేషన్‌లను ఉపసంహరించుకోలేదు. రైతులను బరిలో నుంచి తప్పించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నామినేషన్లు వేసిన పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు, కుల సంఘాలు, రైతు సంఘాలు బుధవారం సమావేశమయ్యారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. నేటి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది.
బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఇదే స్థాయిలో ఉన్నపక్షంలో బ్యాలెట్ విధానం ద్వారా పోలింగ్ నిర్వహించడం తప్పనిసరి అవుతుంది. ఈ స్థానానికి ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 203 మంది అభ్యర్థుల నుంచి 245 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 14 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామ్మోహన్ రావు బుధవారం ప్రకటించారు. తిరస్కరణకు గురైన 14 మంది అభ్యర్థుల నామినేషన్లు మినహాయిస్తే 189 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. ఉపసంహరణకు గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది. అభ్యర్థుల సంఖ్య 95కు మించితే బ్యాలెట్ విధానం ద్వారానే పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
నేడు స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు..
బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలిన వెంటనే ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన నాలుగు పార్టీలు.. పిరమిడ్, జనసేన, బహుజన్‌ముక్తి, సమాజ్‌వాది ఫార్మర్డ్ బ్లాక్‌ల నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఏడుగురు అభ్యర్థులను మినహాయిస్తే., మిగిలిన 182 మంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రమే ఈ గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు 194 గుర్తులను గుర్తించామని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో నిజామాబాద్ స్థానానికి సరిపడా 182 గుర్తులు అందుబాటులో ఉన్నట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment