కె.చంద్రశేఖర రావు
టిఆర్ఎస్ శాసనసభ్యుల ఆశలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నీళ్లు చల్లారు. మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని, అందులో తమకూ అవకాశం ఉంటుందని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలు, ప్రాతినిధ్యంలేని జిల్లాల వారు, సామాజిక వర్గాల వారు ఎవరి అంచానాలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకు మంత్రి పదవి వస్తుందంటే, తమకు వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని కెసిర్ సంకేతాలు ఇచ్చారు. దాంతో పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఈనెల 15లోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆశించారు. వారి ఆశలు ఇప్పట్లో తీరే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గలో ప్రాతినిధ్యం లేని మహబూబ్‌నగర్‌లో మంత్రి కెటిఆర్, ఖమ్మంలో పద్మారావు స్వాతంత్ర్యదినోత్సవాలకు హాజరవుతారని ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ లేదని అందరికీ అర్ధమైపోయింది.
ప్రస్తుత స్థితిలో మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే 15 మంది రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపడితే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిఎం భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటును వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈనెల 20న కెసిఆర్ సింగపూర్ వెళ్ళనున్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత వచ్చే నెలలో దాదాపు నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత కెసిఆర్ పార్టీపై దృష్టి పెడతారు. అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించిన వారినే మంత్రివర్గంలో చేర్చుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కొద్దినెలల పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని స్పష్టమవుతోంది.
- శిసూర్య