మెడికల్ కౌన్సెలింగ్ ఏదీ?
* ఎంబీబీఎస్ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని సర్కారు
* ఇప్పటికీ ఏర్పాట్లపై దృష్టిసారించని వైద్యారోగ్యశాఖ
* ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని వైనం.. ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారైనా మెడికల్ కౌన్సెలింగ్‌పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఇది తమకు సంబంధించిన అంశం కాదన్నట్లుగా వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తేదీలను, స్థలాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత తమదన్న ఆలోచన కూడా వైద్యారోగ్యశాఖకు లేకపోవడం గమనార్హం. అసలు ఓ ఉన్నతాధికారి అయితే ఇది ఉన్నత విద్యామండలి తీసుకోవాల్సిన నిర్ణయంగా చెబుతుండటం గమనార్హం. మరోవైపు మెడికల్ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించిన కళాశాలలు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించి, ఇప్పటికే సీట్లు కొనేసుకున్నవారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మొత్తంగా అటు ప్రభుత్వ సీట్లు.. ఇటు ప్రైవేటు సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌పై స్తబ్దత నెలకొంది.
ఎవరి ఆధ్వర్యంలో..
తెలంగాణలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 1,750 సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని ‘ఏ’ కేటగిరీ సీట్లలో 50 శాతాన్ని ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. ‘బీ’ కేటగిరీలో 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించారు. వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ జరిపి సీట్లు భర్తీ చేస్తారు. మిగతా 15 శాతం సీట్లను ఎన్నారై కోటా కింద ప్రైవేటు యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. ఎంసెట్ మెడికల్ విభాగానికి 92 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 14న పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు ప్రకటించారు. ఇది జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా.. వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. అసలు తెలంగాణ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశంలోనూ స్పష్టత లేదు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు రిజిస్ట్రార్‌ను కానీ, కార్యనిర్వాహక మండలిని కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. అయితే పీజీ కౌన్సెలింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని అప్పట్లో తెలంగాణ వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏపీలో జరిపితే అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌పై స్పష్టత ఇవ్వాలని.. విజయవాడలో నిర్వహించాలని భావిస్తే, అందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.