పరిగి: పంటలు నష్టపోయి ఏడాది కావస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో స్పష్టత రావటంలేదు. 2009 నుంచి గత సంవత్సరం వరకు ఉన్న పెండింగ్ నిధులతోపాటు 2013 సంవత్సరంలో జరిగిన అపార పంట నష్టానికి సంబంధించి జిల్లాకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.31 కోట్లు వచ్చాయని నాయకులు హడావిడి చేస్తుండగా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కేంద్రం నిబంధనల మేరకు హెక్టారుకు రూ.10 వేలు ఇవ్వాలని ఉండగా రాష్ట్ర నిబంధనలు ఎలా ఉన్నాయనే విషయంపై అధికారుల్లోనూ స్పష్టత లేదు.
ఇన్‌పుట్ సబ్సిడీని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో వేశామని ప్రభుత్వం చెబుతుండగా జిల్లా ఖాతాలోకి మాత్రం ఇంకా డబ్బులు రాలేదని అధికారులు అంటున్నారు. మరో పక్క వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయి అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలు ఇవ్వడంతో రైతులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మరో 15 రోజుల వరకు ఏమీ చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది లెహర్, ఫైలిన్, హెలెన్ రూపంలో మూడు తుపాన్లు విరుచుకుపడి రైతులను అతలాకుతలం చేయగా ఏయే తుపాన్లకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నారనే విషయంలోనూ అధికారులు స్పష్టతనివ్వటంలేదు.
తప్పని ఎదురుచూపులు..
పంటలకు నష్టం వాటిల్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిహారం అందించకుండా ప్రభుత్వం రైతులతో పరిహాసమాడుతోంది. 2013 అక్టోబర్‌లో ఫైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలతోపాటు రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం అందించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అటు ఈ సం వత్సరం వ్యవసాయ పంటరుణాలు అందక.. ఇటు గతఏడాది నష్టపోయిన పంట లకు పరిహారమూ అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎట్టకేలకు రెవెన్యూ, వ్యవసాయ, అర్థగణాంక శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు తయారు చేశారు. వీటిని ప్రభుత్వానికి పంపి కూడా ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ పరిహారం మాత్రం రైతులకు అందలేదు.
7,497 హెక్టార్లలో పంట నష్టం..
ఫైలిన్ తుపాన్ ప్రభావంతో పరిగి వ్యవసాయ డివిజన్‌లో జరిగిన పంటల నష్టం వివరాలతో కూడిన నివేదికలు అప్పట్లో పై అధికారులకు స్థానిక అధికారులు అందజేశారు. పరిగి మండలంలో వరి 120 హెక్టార్లు, మొక్కజొన్న 1520 హెక్టార్లు, పత్తి 1800 హెక్టార్లు, దోమ మండలంలో వరి 380 హెక్టార్లు, మొక్కజొన్న 900 హెక్టార్లు, కుల్కచర్ల మండలంలో వరి 1083 హెక్టార్లు, గండేడ్ మండలంలో వరి 1694 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అంటే మొత్తం వ్యవసాయ డివిజన్‌లో 7497 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది.
గతంలోలా సమస్యలు తలెత్తకుండా సర్వే వివరాలు, నష్టంపోయిన రైతుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించారు కూడా. ఆ వెంటనే పంటనష్టం పరిహారం అందజేస్తామని పలుమార్లు చెబుతూ వచ్చిన గత ప్రభుత్వం ఎన్నికలు వచ్చే నాటికి ఆ విషయం మరిచిపోయింది. తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పంట నష్టం పరిహారం ఊసెత్తకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి పంటనష్టానికి పరిహారం. ఇన్‌పుట్‌సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇన్‌పుట్ ఎప్పుడు?
Published Sun, Sep 21 2014 12:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement