- ఇచ్చోడలో వ్యవసాయానికి 24గంటలు విద్యుత్
- బడా రైతులతో విద్యుత్ అధికారుల కుమ్మక్కు
ఆదిలాబాద్ : వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరిగ్గా సరఫరా కాక కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. విడతల వారీగా సరఫరాలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెలియని పరిస్థితుల్లో బోర్లు, బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాత్రి వేళల్లో కరెంటు సరఫరా చేస్తే చీకట్లో రైతులు పడే కష్టాలు వర్ణణాతీతం. ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడికి చేరుతున్నారు. సాగు కోసం రైతులు ఇన్ని కష్టాలు పడుతుండగా.. ఓ మండలంలో మాత్రం బడా రైతులకు కరెంటు కష్టమంటేనే తెలియదు. ఆ భూస్వాములు పంట పొలాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతుండడమే అందుకు కారణం. ఈ బడా రైతులతో విద్యుత్ శాఖాధికారులు కుమ్ముక్కు కావడంతో ఎన్నో సంవత్సరాలుగా వ్యవహారం సాఫీగా సాగిపోతోంది. విద్యుత్ శాఖలో ఇది ఒక కొత్త రకం దోపిడీ. ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో అధికారులకే తెలియాలి.
పంటలకు 24 గంటలు సరఫరా..
ఆదిలాబాద్ డివిజన్‌లోని ఇచ్చోడ 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని ఇచ్చోడ సెక్షన్‌లో విద్యుత్ దుర్వినియోగం, అక్రమం కొన్నేళ్లుగా యథేచ్చగా సాగుతోంది. ఇచ్చోడ ప్రాంతంలోని కొంతమంది బడా రైతులు విద్యుత్ శాఖాధికారులను మచ్చిక చేసుకుని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు అందజేస్తూ కరెంటు సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకుంటున్నారు. కాసుల కక్కుర్తిలో మునిగిపోయిన అధికారులు తమ స్వార్థం కోసం కరెంటు దోపిడీకి పాల్పడుతూ సర్కారుకు కన్నం పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ఈ వ్యవహారంలో కరెంటు సార్లు జేబులు నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తుండటంతో ఆ బడా రైతుల పంటలకు ఢోకాా లేకుండా పోయింది.
ఇచ్చోడ 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో ఐదు ఫీడర్లు ఉండగా, అందులో ఇచ్చోడ టౌన్ ఫీడర్‌పై 24 గంటల విద్యుత్ గృహాలకు సరఫరా అవుతుంది. బోరిగామ, జామిడి, గిర్నూర్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కరెంటు సరఫరా అవుతుంది. ఇండస్ట్రీయల్ ఫీడర్ ద్వారా ఇచ్చోడ మండల కేంద్రంతోపాటు అడెగామ-కె, అడెగామ-బి తదితర గ్రామాల పరిశ్రమలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. కాగా ఇచ్చోడ టౌన్ ఫీడర్ నుంచి ఇచ్చోడలోని పలు పంట పొలాల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అగ్రికల్చర్ ఫీడర్ పైనే వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా జరగాలి. ఇక్కడ ఇచ్చోడ పట్టణానికి విద్యుత్ సరఫరా చేసే టౌన్ ఫీడర్‌పై వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కొనసాగిస్తుండడంతో 24 గంటలు కరెంటుతో బడా రైతులు అక్రమంగా ప్రయోజనం పొందుతున్నారు. టౌన్ ఫీడర్‌పై ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రత్యేక వ్యవసాయ విద్యుత్ ఫీడర్ ఏర్పాటు చేసి ఆ కనెక్షన్లను బదిలీ చేయాలి. లేనిపక్షంలో ఇప్పటికే దగ్గరలో ఉన్న బోరిగామ, జామిడి, గిర్నూర్ వ్యవసాయ ఫీడర్లకు మార్చాలి.
అలా చేయకుండా కాసుల కక్కుర్తితో వారు బైఫర్‌గేషన్ చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ విషయంలో పలుమార్లు విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇతర గ్రామాలకు చెందిన రైతులు ఆ రైతులకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తూ తమకు 5గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని పలుమార్లు అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ కనెక్షన్లను మార్చకపోవడం గమనార్హం. వ్యవసాయ కనెక్షన్లను బైఫర్‌గేషన్ చేసేందుకు అంచనాలు వేసి ప్రతిపాదనలు రూపొందించి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ ఆ పనులు జరగకుండా లోలోపలనే వాటిని ప్రారంభం కాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులకు తెలియదట..
ఈ విషయంలో విద్యుత్ శాఖ ఆదిలాబాద్ సర్కిల్ ఎస్‌ఈ అశోక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. అప్పటికప్పుడే ఆదిలాబాద్ డీఈ గోపికృష్ణను ఫోన్‌లో సంప్రదించి ఈ విషయంపై తెలియజేయాలని ఆదేశించారు. డీఈ గోపికృష్ణను ‘సాక్షి’ వివరణ కోరగా దీనిపై విచారణ చేపడతామని పేర్కొన్నారు. ఇచ్చోడ ఏఈని ఈ విషయంలో సంప్రదించేందుకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ కలవలేదు. కాగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అధికారులు కప్పిపుచ్చుతున్నారా.. లేనిపక్షంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ వినియోగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారన్న విమర్శ వ్యక్తమవుతోంది. ఈ విషయంలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టడమే కాకుండా ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాలని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
కరెంటు దందా..!
Published Thu, Sep 24 2015 4:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
Advertisement
Advertisement