నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని గణ్య తండాలో పూరిగుడిసెలు
నర్సాపూర్‌రూరల్ మెదక్ : గ్రామాలకు దూరంగా అడవులు, కొండలు, వాగులు, వంకలను ఆనుకొని ఉండే తండాల్లోని గిరిజనులు పక్కా ఇళ్లు లేక నేటికీ గుడిసెల్లోనే మగ్గుతున్నారు. వర్షానికి నానుతూ, ఎండకు ఎండుతూ వాటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాగానే ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనిటీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో పక్కా ఇల్లు లేని గిరిజనులకు ప్రాణం లేచి వచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోతున్నా నేటికీ గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. నర్సాపూర్ మండలంలోని పాత, కొత్త 34 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 56 వరకు తం డాలు ఉంటాయి.
ఈ తండాల్లో 80 శాతానికి పైగా గిరిజన కుటుంబాలవారు గుడిసెల్లోనే నివసించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉం డగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరు గిరిజనులకు వరమైంది. స్థాయిని బట్టి ఇళ్లు నిర్మించుకున్న ప్రతీ కుటుంబానికి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. అప్పట్లో ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నవారు శ్లాబ్ వేసుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. మరి కొంత మంది లెంటల్ లెవల్ వరకు గోడలు నిర్మించుకొని రేకులు వేసుకున్నారు.
అసలే ఆర్థికంగా లేనివారు 40 శాతం వరకు అవే గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైనా వారు ముం దుగా బేస్మెంట్ నిర్మించుకుంటే బిల్లులు ఇచ్చేవారు. కనీసం బేస్మెంట్ లెవల్‌కు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నవారే మిగిలిపోయారు. ప్రస్తుతం పూరిగుడిసెల్లో నివాసముంటున్న ప్రతీ గిరిజను డు నాలుగేళ్లుగా డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుందని కళ్లలో వొత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.
హామీ మరచిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట తాజా మాజీ సర్పంచ్ దేవసోత్ సీతారాంనాయక్‌కు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయించి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీతారాంనాయక్ పదవీకాలం ముగియడంతో తనకున్న పూరిపాకలోనే నివాసముంటున్నాడు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్దచింతకుంట గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వు అయింది. దీంతో గ్రామస్తులు తమ పంచాయతీ పరిధిలో తండాకు చెందిన నిరుపేద, మంచి వ్యక్తిగా పేరు ఉండడంతో సీతారాంనాయక్‌ను ఏకగ్రీవంగా పెద్దచింతకుంట సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ రావడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి స్థానికంగా కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి గెలుపొందడంలాంటి ఘటనలు జరిగిపోయాయి.
దీంతో ఏకగ్రీవంగా పెద్దచింతకుంట సర్పంచ్‌గా ఎన్నికైన సీతారాంనాయక్ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. సీతారాంనాయక్ పూరిగుడిసెలో నివాసముంటున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానాని బహిరంగంగానే అతడికి హామీ ఇచ్చారు. సీతారాంనాయక్ కనిపించిన ప్రతీసారి అందరిముందే ఎమ్మెల్యే నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాననే మాట పదేపదే గుర్తుచేయడానికే సరిపోయింది. అలా నాలుగేళ్లుగా అదే మాట అంటూ కాలం వెళ్లదీయడంతో సీతారాంనాయక్ సర్పంచ్ పదవీ కాలం కాస్తా ముగిసిపోయింది. ఇది ఒక సర్పంచ్‌కు ఇచ్చిన హామీ తీరు.
డబుల్ బెడ్రూం ఇళ్లు మాకే ముందు ఇవ్వాలి
ఊళ్లకు దూరంగా అడవులు, పొలాల మధ్య ఉంటం. ఇళ్లు లేకుండా పూరి గుడిసెలో నివాసం ఉండే గిరిజనులకు ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలె. చాలాసార్లు డబుల్ బెడ్రూం ఇండ్లకోసం దరఖాస్తులు ఇవ్వాలంటే తహసీల్దార్ ఆఫీస్‌ల ఇచ్చి వచ్చినం. ఇప్పటి వరకు ఏ ఒక్క తండాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినట్లు కనిపిస్తలేదు.
– రమణి, గిరిజనురాలు
‘డబుల్’పై నమ్మకం పోయింది
పూరిగుడిసెలోనే పుట్టి పెరిగిన. మే పేదోళ్లం కావడంతో కూలీనాలీ చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్లం. నా మంచితనంపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నరు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతీ రూపాయిని గ్రామ అభివృద్ధికి ఖర్చుచేసిన. పక్కా ఇల్లు లేకున్నా దిగులు చెందలేదు. చాలా సార్లు ఎమ్మెల్యే నీవు ఎంతకాలం పూరిగుడిసెలో ఉంటావు.. ఖచ్చితంగా డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని స్వయంగా చెప్పి మర్చిపోయాడు. నేను నివాసముండే పూరిగుడిసె రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్నందున ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా.
– దేవసోత్ సీతారాంనాయక్, పెద్దచింతకుంట తాజా మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment