మందూలేదు.. నివారణా లేదు! | No medicine still not found to control HIV virus | Sakshi
Sakshi News home page

మందూలేదు.. నివారణా లేదు!

Published Wed, Feb 18 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

మందూలేదు.. నివారణా లేదు!

మందూలేదు.. నివారణా లేదు!

నివారణే తప్ప మందుల్లేని మహమ్మారి హెచ్‌ఐవీ. అలాంటి ఈ వ్యాధికి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మందులూ అందుబాటులో లేవు... నివారణకు తోడ్పడే చర్యలకూ దిక్కులేదు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పుకొంటున్నా... కోట్ల కొలదీ నిధులు వెచ్చిస్తున్నా... ఫలితం మాత్రం శూన్యం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాపిస్తూ లక్షలాది మందిని పీల్చిపిప్పి చేస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి దారుణ పనితీరే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది హెచ్‌ఐవీ రోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉండడం గమనార్హం.
 - హైదరాబాద్, సాక్షి
 
 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హెచ్‌ఐవీ కేసులు భారీగా పెరుగుతున్నట్టు ఇటీవల వివిధ సంస్థల పరిశోధనల్లో వెల్లడైంది. ఇరు రాష్ట్రాల్లో కలిపి ఏటా 25 వేల కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది. వాస్తవానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కలిపి ఐదు లక్షల మందికిపైనే హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. వీళ్లలో 4.26 లక్షల మంది మాత్రమే ఏఆర్‌టీ కేంద్రాల్లో పేర్లు నమోదుచేసుకున్నారు. ఇక దేశంలోని మొత్తం ఎయిడ్స్ (హెచ్‌ఐవీ ముదిరి ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది) బాధితుల్లో దాదాపు 20 శాతం మంది ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నారు. మరోవైపు హెచ్‌ఐవీతో బాధపడుతున్న గర్భిణులు దేశం మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. ముఖ్యంగా హెచ్‌ఐవీ సోకిన గర్భిణులు ఏపీలోని కడప జిల్లాలో, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక హెచ్‌ఐవీ బాధితుల్లో దాదాపు 80 శాతం మందికి టీబీ కూడా సోకుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఏటా 600 మంది పైనే హెచ్‌ఐవీతో మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది.
 
 ఎన్జీవోల అక్రమాలు..
 హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలకు ఓవైపు నిధులు సరిగా అందకపోతుండగా... మరోవైపు కోట్లాది రూపాయల ఏపీ శాక్స్ నిధులను ఎన్జీవోల నిర్వాహకులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ నిధులకు లెక్కల్లేవు. పనులకు వివరాల్లేవు. నకిలీ హెచ్‌ఐవీ రోగుల పేర్లతో రికార్డులను నింపేసి నిధులను కాజేసినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి సుమారు 173 ఎన్జీవోలకు రూ. 33 కోట్లు ఇచ్చారు. ఆ సొమ్మంతా ఖర్చయినట్లు ఎన్జీవోలు చెబుతుండగా... కనీసం రూ. 10 కోట్ల పనులైనా కాలేదని ఆడిట్‌లో బయటపడింది. ఈ లెక్కన గత నాలుగేళ్లలో సుమారు రూ. 80 కోట్లకు పైనే దుర్వినియోగం జరిగి ఉంటుందని అంచనా. ప్రకాశం, చిత్తూరు, నిజామాబాద్, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేసినట్టు రికార్డుల్లో ఉండగా... వారి చిరునామాలకు వెళ్లి చూస్తే అసలు అలాంటి పేరున్న వ్యక్తులే లేరని తేల డం గమనార్హం. కానీ ఈ నివేదికలను పైస్థాయి అధికారులు తొక్కిపెట్టినట్లు ఆరోపణలున్నాయి.
 
 నిర్లక్ష్యం.. నిధుల లేమి..
 రెండు రాష్ట్రాల్లోనూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ, ప్రజలకు అవగాహన కలిగించడం, మందుల పంపిణీ తదితర పనులు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కొంతకాలంగా చాపచుట్టేశాయి. హెచ్‌ఐవీ విభాగంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్లకు నెలల తరబడి జీతాలు సరిగా అందడం లేదు. నాకో (జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి) నుంచి అందాల్సిన నిధులు సరిగా రాకపోవడం, వచ్చిన నిధులు దుర్వినియోగం కావడం కూడా హెచ్‌ఐవీ కేసులు పెరగడానికి కారణమవుతోంది. నాకో నుంచి రాష్ట్రానికి ఏటా సుమారు రూ. 80 కోట్లకు పైగా నిధులు వచ్చేవి. కానీ ఈ ఏడాది రూ. 30 కోట్లు కూడా రాలేదని సమాచారం. ఇక ఎయిడ్స్‌పై అవగాహనకు పనిచేస్తున్న రెడ్‌రిబ్బన్ క్లబ్‌లు, సురక్ష క్లినిక్స్, మొబైల్ ఐసీటీసీలు సరిగా పనిచేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది.
 
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి..
 మొత్తం హెచ్‌ఐవీ బాధితులు 5,00,000+
 ఏఆర్‌టీలో నమోదుచేసుకున్నవారు 4,26,000 (వీరిలో కొందరు ఇప్పటికే మరణించారు)
 పురుష బాధితులు    1,09,598
మహిళా బాధితులు    1,93,134
 చిన్నారులు    31,591
 హిజ్రాలు    599
 
 జిల్లాల జనాభాలో బాధితుల శాతం
 మహబూబ్‌నగర్     1.38
 ప్రకాశం    1.34
 కరీంనగర్     1.25
 తూ. గోదావరి    0.83
 గుంటూరు    0.83
 వైఎస్సార్ జిల్లా     0.75
 వరంగల్    0.75
 శ్రీకాకుళం     0.63
 విశాఖపట్నం    0.63
 కర్నూలు    0.58
 చిత్తూరు     0.53
 ఖమ్మం    0.50
 నిజామాబాద్    0.50
 రంగారెడ్డి     0.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement