hiv cases
-
హెచ్ఐవీ దాచి పెళ్లి.. ఆపై భార్యతో..
ముంబై : తనకు వచ్చిన రోగాన్ని దాచి తనతో పాటు తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. తనకు హెచ్ఐవీ సోకిందన్న నిజాన్ని దాచి.. ఆమె నూరేళ్ల జీవితంతో ఆడుకున్నాడు. చివరకు నిజం తెలుసుకొని నిలదీసిన భార్యపై నిందలు మోపారు. కోడలు వల్లనే తమ కుమారుడికి ఈ పాడురోగం సోకిందంటూ అత్త, మామలు దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ కుమారుడిని వెనుకేసుకొస్తూ నిజాన్ని కప్పిపుచ్చారు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. థానే జిల్లాలోని డోంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(31) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కామోథేకు చెందిన ఓ యువతి(26)ని 2016లో వివాహం చేసుకున్నాడు. కాగా, అంతకు ముందే అతనికి హెచ్ఐవీ సోకింది. ఈ విషయం అతని కుటుంబీకులకు కూడా తెలుసు. ఈ దారుణ విషయాన్ని కప్పిపుచ్చి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చిన ఓ బంధువు.. మందులు వాడుతున్నావా అని అడగడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. మందులు ఎందుకు... ? ఏమైందని అని అడుగగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. అత్తమామలను నిలదీయగా క్షయ వ్యాది సోకిందని, మందులు వాడితే తగ్గిపోతుందని నచ్చజెప్పారు. ఓ రోజు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్ల ద్వారా అతనికి హెచ్ఐవీ సోకిందని తెలుసుకుంది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి మరో ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా.. తిరిగి ఆమెపైనే నిందలు వేశారు. ‘ నీ వల్లనే మా కుమారుడికి హెచ్ఐవీ సోకింది’ అంటూ తిరిగి ఆమెనే నిందించారు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు యువతి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
హెచ్ఐవీ కేసులు ఎక్కువగా నమోదు
నూజివీడు : హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టార్గెటెడ్ ఇంటర్వెన్షన్) జాయింట్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ బేస్డ్ హెచ్ఐవీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పట్టణంలోని స్నేహా రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, లారీడ్రైవర్లు, వలసదారులు, డ్రగ్స్‌కు బానిసలు తదితర వారిని గుర్తించి వారి ఏరియాల్లోనే ఉండి హెచ్ఐవీ స్క్రీనింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఒకే జీవిత భాగస్వామితో సంబంధం పెట్టుకోవాలే గాని, విచ్చలవిడిగా సంబంధాలు కొనసాగించకూడదని స్పష్టం చేశారు. 92 స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో టీవీఎస్ఎన్ శాస్త్రి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్.నరేంద్రసింగ్, రైడ్స్ సేవా సంస్థ డైరెక్టర్ బసవరాజు నగేష్, హెచ్ఐవీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి కిరణ్‌కుమార్, లింకేజెస్ ప్రోగ్రామ్ సీనియర్ అధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పాపం పసివాళ్లు..!
► హెచ్ఐవీ బాధితులుగా పిల్లలు ► పెరుగుతున్న కేసులు ► ఔట్ రీచ్ వర్కర్లు తీసేసిన ప్రభుత్వం విజయనగరంఫోర్ట్: పిల్లలు హెచ్ఐవీ బాధితులుగా మారుతున్నారు. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడం వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. హాయిగా తోటి పిల్లలతో ఆటలు ఆడుకోవాల్సిన వయసులో మహమ్మారి హెచ్ఐవీ వ్యాధితో అవస్థలు పడతున్నారు. జిల్లాలో హెచ్ఐవీ బారిన పడిన పిల్లలు 550కు పైగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల్లినుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా చేయడం కోసం హెచ్ఐవీ సోకిన గర్భిణిని నిరంతరం పర్యవేక్షించేందుకు నియమించిన ఔట్ రీచ్ వర్కర్లును చంద్రబాబు సర్కార్ తీసేసింది. దీంతో హెచ్ఐవీ సోకిన గర్భిణులను పర్యవేక్షించే వారే కరువయ్యారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. జిల్లాలో 14,648 మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారు. వీరిలో పురుషులు 7204 మంది, మహిళలు 6879, పిల్లలు 565 మంది ఉన్నారు. ఇందులో ఏఆర్టీ కేంద్రంలో రిజిష్టర్ అయిన వారు 11,818 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,713 మంది, మహిళలు 5,536 మంది, పిల్లలు 556 మంది ఉన్నారు. నిలిచిన ఔట్రీచ్ వర్కర్ సేవలు ఏడాదిన్నర కిందట ప్రభుత్వం పీపీటీసీ( తల్లినుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా చేసే కార్యక్రమం) ఔట్ రీచ్‌వర్కర్లును తొలిగించింది. హెచ్ఐవీ సోకిన గర్భిణినుంచి పుట్టే బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా మందులు వాడించడం , వైద్య పరీక్షలు చేయడం, హెచ్ఐవీ గర్భిణులను ఆస్పత్రులో చేర్పించి ప్రసవం చేయించడం వంటి విధులను పీపీటీసీ ఔట్రీచ్ వర్కర్లు నిర్వర్తించేవారు. వారిని తీసిసేసిన తర్వాత గర్భిణులకు పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
తగ్గిన హెచ్ఐవీ కేసులు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హెచ్ఐవీ కేసుల సంఖ్య 1.14 శాతానికి తగ్గింది. గురువారం ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్లతో పాటు మొత్తం 105 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింకుడ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నారుు. వీటి ద్వారా ఎరుుడ్‌స పాజిటీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సెలింగ్, వ్యక్తిగత కౌన్సెలింగ్‌లను నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 13 ప్రై వేటు ఆస్పత్రుల్లో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్లలో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటీవ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్, సూర్యాపేటలోని ఏఆర్టీ సెంటర్లకు పంపిస్తారు. ఏఆర్టీ సెంటర్లోని వైధ్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలను నిర్వహించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను చేసి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. వేలాది మంది హెచ్ఐవీ పాజిటీవ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సెలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. వలస కార్మికులు, లారీ డ్రైవర్లు అధికంగా ఉండే మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో కేసుల నమోదు అధికంగా ఉంటుంది. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమంతో పాటు నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్చంద సంస్థలు, జిల్లా ఎరుుడ్‌స నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు. హెచ్ఐవీ బాధితులకు పెన్షన్లు జిల్లా వ్యాప్తంగా 1371 మంది హెచ్ఐవీ బాధితులకు పెన్షన్లను అందజేస్తున్నారు. మరో 1200 మందికి పెన్షన్ల కోసం ప్రతిపాదనలను పంపించారు. 1721 మందికి ఉచిత బస్‌పాస్‌లను ప్రభుత్వం అందజేసింది. 2012 నుంచి మమత ప్లస్ 2012 సంవత్సరం నుంచి హెచ్ఐవీ ఉన్న ప్రతి గర్భిణికి మమత ప్లస్ అనే కార్యక్రమం ద్వారా పుట్టే ప్రతి చిన్నారికి హెచ్ఐవీ రాకుండా కొత్తగా మం దులను ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ ప్రపంచ ఎరుుడ్‌స దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నారు. స్థానిక జిల్లా కేంద్రలోని గడియారం సెంటర్‌నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వరకు ర్యాలీని నిర్వహిస్తారు. ర్యాలీని ఉదయం 9 గంటలకు గడియారం సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రారంభిస్తారు. అనంతరం ఆస్పత్రిలో సమావేశం నిర్వహిస్తారు. ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. నర్సింగ్ విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. -
30 ఏళ్ల క్రితం దేశం షాక్ తిన్నది!
సరిగ్గా 36 ఏళ్ల కిందట 1986 జూన్ నెలలో ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లోకి సైతం అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ ప్రవేశించిందని వెల్లడికావడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. మహిళా డాక్టర్ అయిన సునీతి సోలోమన్ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా కనుగొని దేశమంతటా కలకలం రేపారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిగా ఉన్న ఆమె ఓ పరిశోధక ప్రాజెక్టులో భాగంగా 100 మంది సెక్స్ వర్కర్లను పరీక్షించారు. మద్రాస్‌లోని ఓ చిన్న ప్రాథమిక ల్యాబ్‌లో ఆమె నిర్వహించిన పరీక్షలు మున్ముందు దేశానికి వైద్యపరంగా పెను సవాలు విసురుతాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. డాక్టర్ సునీతి 100 మంది సెక్స్‌వర్కర్లను పరీక్షించగా అందులో ఆరుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. హెచ్ఐవీ వైరస్ భారత్‌లోకి ప్రవేశించిందని తెలియడం అదే తొలిసారి. ఈ పరీక్షలే మున్ముందు దేశానికి ఎదురవుతున్న పెను వైద్య సవాల్‌ను వెల్లడించడమే కాకుండా.. ఇందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటాయి. షాక్ గురయ్యారు! 'పరీక్షల్లో ఏదో వెల్లడి అవుతుందని అనుకోవద్దని ఆమె ముందే తన నేతృత్వంలోని పరిశోధక విద్యార్థులకు చెప్పారు. తమ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పూర్తిగా నెగిటివ్ ఫలితాలు వస్తాయని ఆమె ఆశించారు. కానీ పాజిటివ్ ఫలితాలు రావడం ఆమెను షాక్‌కు గురిచేసింది' అని డాక్టర్ సునీతి తనయుడు డాక్టర్ సునీల్ సోలోమన్ గుర్తుచేసుకున్నారు. 'ప్రభుత్వం ఈ పరీక్షల ఫలితాలను అంగీకరించడానికి ఒప్పుకోలేదు. పాశ్చాత్య దేశాల కన్న ఉన్నత సంప్రదాయాలు అనుసరించే భారత్ వంటి దేశంలో ఇలాంటి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదని అప్పట్లో ప్రభుత్వం భావించింది. కానీ పరీక్ష నమూనాలను వాషింగ్టన్ పంపి.. అక్కడ కూడా పాజిటివ్‌గానే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది' అని సునీల్ తెలిపారు. ఇప్పటికీ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి ముప్పు భారత్‌ను వేధిస్తూనే ఉంది. సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం వంటి అవసరాన్ని, లైంగిక విద్య ఆవశ్యకతను ఇది చాటుతోంది. -
మందూలేదు.. నివారణా లేదు!
నివారణే తప్ప మందుల్లేని మహమ్మారి హెచ్ఐవీ. అలాంటి ఈ వ్యాధికి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మందులూ అందుబాటులో లేవు... నివారణకు తోడ్పడే చర్యలకూ దిక్కులేదు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పుకొంటున్నా... కోట్ల కొలదీ నిధులు వెచ్చిస్తున్నా... ఫలితం మాత్రం శూన్యం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెచ్ఐవీ చాపకింద నీరులా వ్యాపిస్తూ లక్షలాది మందిని పీల్చిపిప్పి చేస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి దారుణ పనితీరే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది హెచ్ఐవీ రోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉండడం గమనార్హం. - హైదరాబాద్, సాక్షి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హెచ్ఐవీ కేసులు భారీగా పెరుగుతున్నట్టు ఇటీవల వివిధ సంస్థల పరిశోధనల్లో వెల్లడైంది. ఇరు రాష్ట్రాల్లో కలిపి ఏటా 25 వేల కొత్త హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది. వాస్తవానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కలిపి ఐదు లక్షల మందికిపైనే హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. వీళ్లలో 4.26 లక్షల మంది మాత్రమే ఏఆర్టీ కేంద్రాల్లో పేర్లు నమోదుచేసుకున్నారు. ఇక దేశంలోని మొత్తం ఎయిడ్స్ (హెచ్ఐవీ ముదిరి ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది) బాధితుల్లో దాదాపు 20 శాతం మంది ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నారు. మరోవైపు హెచ్ఐవీతో బాధపడుతున్న గర్భిణులు దేశం మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన గర్భిణులు ఏపీలోని కడప జిల్లాలో, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక హెచ్ఐవీ బాధితుల్లో దాదాపు 80 శాతం మందికి టీబీ కూడా సోకుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఏటా 600 మంది పైనే హెచ్ఐవీతో మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్జీవోల అక్రమాలు.. హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలకు ఓవైపు నిధులు సరిగా అందకపోతుండగా... మరోవైపు కోట్లాది రూపాయల ఏపీ శాక్స్ నిధులను ఎన్జీవోల నిర్వాహకులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ నిధులకు లెక్కల్లేవు. పనులకు వివరాల్లేవు. నకిలీ హెచ్ఐవీ రోగుల పేర్లతో రికార్డులను నింపేసి నిధులను కాజేసినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి సుమారు 173 ఎన్జీవోలకు రూ. 33 కోట్లు ఇచ్చారు. ఆ సొమ్మంతా ఖర్చయినట్లు ఎన్జీవోలు చెబుతుండగా... కనీసం రూ. 10 కోట్ల పనులైనా కాలేదని ఆడిట్లో బయటపడింది. ఈ లెక్కన గత నాలుగేళ్లలో సుమారు రూ. 80 కోట్లకు పైనే దుర్వినియోగం జరిగి ఉంటుందని అంచనా. ప్రకాశం, చిత్తూరు, నిజామాబాద్, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో హెచ్ఐవీ పరీక్షలు చేసినట్టు రికార్డుల్లో ఉండగా... వారి చిరునామాలకు వెళ్లి చూస్తే అసలు అలాంటి పేరున్న వ్యక్తులే లేరని తేల డం గమనార్హం. కానీ ఈ నివేదికలను పైస్థాయి అధికారులు తొక్కిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యం.. నిధుల లేమి.. రెండు రాష్ట్రాల్లోనూ హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ, ప్రజలకు అవగాహన కలిగించడం, మందుల పంపిణీ తదితర పనులు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కొంతకాలంగా చాపచుట్టేశాయి. హెచ్ఐవీ విభాగంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్లకు నెలల తరబడి జీతాలు సరిగా అందడం లేదు. నాకో (జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి) నుంచి అందాల్సిన నిధులు సరిగా రాకపోవడం, వచ్చిన నిధులు దుర్వినియోగం కావడం కూడా హెచ్ఐవీ కేసులు పెరగడానికి కారణమవుతోంది. నాకో నుంచి రాష్ట్రానికి ఏటా సుమారు రూ. 80 కోట్లకు పైగా నిధులు వచ్చేవి. కానీ ఈ ఏడాది రూ. 30 కోట్లు కూడా రాలేదని సమాచారం. ఇక ఎయిడ్స్‌పై అవగాహనకు పనిచేస్తున్న రెడ్‌రిబ్బన్ క్లబ్‌లు, సురక్ష క్లినిక్స్, మొబైల్ ఐసీటీసీలు సరిగా పనిచేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి.. మొత్తం హెచ్ఐవీ బాధితులు 5,00,000+ ఏఆర్టీలో నమోదుచేసుకున్నవారు 4,26,000 (వీరిలో కొందరు ఇప్పటికే మరణించారు) పురుష బాధితులు 1,09,598 మహిళా బాధితులు 1,93,134 చిన్నారులు 31,591 హిజ్రాలు 599 జిల్లాల జనాభాలో బాధితుల శాతం మహబూబ్‌నగర్ 1.38 ప్రకాశం 1.34 కరీంనగర్ 1.25 తూ. గోదావరి 0.83 గుంటూరు 0.83 వైఎస్సార్ జిల్లా 0.75 వరంగల్ 0.75 శ్రీకాకుళం 0.63 విశాఖపట్నం 0.63 కర్నూలు 0.58 చిత్తూరు 0.53 ఖమ్మం 0.50 నిజామాబాద్ 0.50 రంగారెడ్డి 0.50 -
పాక్‌లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరుగుతుంది. పాక్‌లోని సింధు ప్రావెన్స్లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. సింధూ ప్రావెన్స్లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 994 మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారని ఆయన చెప్పారు. వ్యాధిగ్రస్తుల్లో 905 మంది మగవారు, 83 మంది మహిళలు, మిగిలిన ఆరుగురి చిన్నారులేనని... వారిలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని వివరించారు. ఈ ఆరుగురి వయస్సు ఏడేళ్లలోపేనని చెప్పారు. 2003 నుంచి ఇప్పటి వరకు ఏయిడ్స్ వ్యాధితో 265 మంది మరణించారని... ఈ ఒక్క ఏడాదే 29 మంది కన్నుమూశారని అలీ షా విశదీకరించారు. ఈ మేరకు శుక్రవారం మీడియా వెల్లడించింది.