► హెచ్‌ఐవీ బాధితులుగా పిల్లలు
► పెరుగుతున్న కేసులు
► ఔట్ రీచ్ వర్కర్లు తీసేసిన ప్రభుత్వం
విజయనగరంఫోర్ట్: పిల్లలు హెచ్‌ఐవీ బాధితులుగా మారుతున్నారు. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడం వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. హాయిగా తోటి పిల్లలతో ఆటలు ఆడుకోవాల్సిన వయసులో మహమ్మారి హెచ్‌ఐవీ వ్యాధితో అవస్థలు పడతున్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ బారిన పడిన పిల్లలు 550కు పైగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా చేయడం కోసం హెచ్‌ఐవీ సోకిన గర్భిణిని నిరంతరం పర్యవేక్షించేందుకు నియమించిన ఔట్ రీచ్ వర్కర్లును చంద్రబాబు సర్కార్ తీసేసింది. దీంతో హెచ్‌ఐవీ సోకిన గర్భిణులను పర్యవేక్షించే వారే కరువయ్యారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. జిల్లాలో 14,648 మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారు. వీరిలో పురుషులు 7204 మంది, మహిళలు 6879, పిల్లలు 565 మంది ఉన్నారు. ఇందులో ఏఆర్‌టీ కేంద్రంలో రిజిష్టర్ అయిన వారు 11,818 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,713 మంది, మహిళలు 5,536 మంది, పిల్లలు 556 మంది ఉన్నారు.
నిలిచిన ఔట్‌రీచ్ వర్కర్ సేవలు
ఏడాదిన్నర కిందట ప్రభుత్వం పీపీటీసీ( తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా చేసే కార్యక్రమం) ఔట్ రీచ్‌వర్కర్లును తొలిగించింది. హెచ్‌ఐవీ సోకిన గర్భిణినుంచి పుట్టే బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా మందులు వాడించడం , వైద్య పరీక్షలు చేయడం, హెచ్‌ఐవీ గర్భిణులను ఆస్పత్రులో చేర్పించి ప్రసవం చేయించడం వంటి విధులను పీపీటీసీ ఔట్‌రీచ్ వర్కర్లు నిర్వర్తించేవారు. వారిని తీసిసేసిన తర్వాత గర్భిణులకు పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.