పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎం.చంద్రశేఖర్‌రావు
నూజివీడు : హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టార్గెటెడ్ ఇంటర్‌వెన్షన్) జాయింట్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ బేస్‌డ్ హెచ్‌ఐవీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పట్టణంలోని స్నేహా రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, లారీడ్రైవర్లు, వలసదారులు, డ్రగ్స్‌కు బానిసలు తదితర వారిని గుర్తించి వారి ఏరియాల్లోనే ఉండి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఇటీవల హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఒకే జీవిత భాగస్వామితో సంబంధం పెట్టుకోవాలే గాని, విచ్చలవిడిగా సంబంధాలు కొనసాగించకూడదని స్పష్టం చేశారు. 92 స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌ఐవీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో టీవీఎస్‌ఎన్ శాస్త్రి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్.నరేంద్రసింగ్, రైడ్స్ సేవా సంస్థ డైరెక్టర్ బసవరాజు నగేష్, హెచ్‌ఐవీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి కిరణ్‌కుమార్, లింకేజెస్ ప్రోగ్రామ్ సీనియర్ అధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment