వేతనం ఇస్తేనే ఓటు | No Salaries For MPTC And ZPTC | Sakshi
Sakshi News home page

వేతనం ఇస్తేనే ఓటు

Published Wed, May 22 2019 1:53 AM | Last Updated on Wed, May 22 2019 1:53 AM

No Salaries For MPTC And ZPTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొత్త మెలిక పెట్టారు. వేతనాలు ఇస్తేనే ఓటు వేస్తామని అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 24 నెలలుగా గౌరవ వేతనాలు అందడంలేదు. పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్‌ ఈ నెల 31న జరగనుంది. ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసు కునేందుకు మూడు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెండురోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోనే ఉన్న క్యాంపులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. న్యూఢిల్లీ, సిమ్లా, బెంగళూరు, కేరళలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్యాంపులు నడుస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఒక క్యాంపుగా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజు ముందే ఓటర్లకు ఏదో రకంగా సాయం చేయడం సహజంగా జరుగుతోంది. ఈసారి మాత్రం క్యాంపులకు వెళ్లే ముందే ఓటర్లను అభ్యర్థులు ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

24 నెలలుగా అందని వేతనాలు
తెలంగాణ ఏర్పాటైన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీలకు రూ.5 వేలు, జెడ్పీటీసీలకు రూ.10 వేలు, కౌన్సిలర్లకు రూ.2,500, కార్పొరేటర్లకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఖరారు చేసింది. ఆయా స్థానిక సంస్థల నిధుల నుంచి నెలSవారీగా గౌరవ వేతనాలను చెల్లించేలా ఉత్త ర్వులు జారీ చేసింది. మొదట్లో చెల్లింపులు జరిగినా తర్వాత నిధుల కొరతతో వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 నెలలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వేతనాలు చెల్లించడంలేదు. ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి సగటున రూ.1.20 లక్షలు, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2.40 లక్షల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉంది. గౌరవ వేతనాల చెల్లింపుల కోసం ఇన్నాళ్లుగా ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత వేతనాల చెల్లింపుపై చర్యలు తీసుకుంటామని అభ్యర్థులు బుజ్జగిస్తున్నారు. పోలింగ్‌ రోజు వరకైనా ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలని ఆ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

మరో ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదల...
మైనంపల్లి హనుంతరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొదటిరోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 28తో ముగియనుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement