mptc zptc
-
‘కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయాడని చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఆయన ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని హితవు పలికారు. కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇకనైనా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో బహిష్కరణ నాటకం మొదలు పెట్టారని మండిపడ్డారు.టీడీపీ నేతలకు సిగ్గు, శరం లేదని బహిష్కరణ చేసిన వాళ్లు బీఫాంతో నామినేషన్ ఎలా వేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే భారీ విజయం సాధించామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం సాధిస్తుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. -
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు -
పరిషత్ పీఠాలు ఎవరివో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఎంపీపీ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలతోపాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. శనివారం జెడ్పీ కోఆప్టెడ్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారులు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినందున ఎస్ఈసీ ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఫలితాలను మండలాల్లో, జెడ్పీల ఫలితాలను జిల్లాల్లో వెంటనే వెలువరిస్తారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునే విధానం ఉండేది. అయితే, ఫలితాల వెల్లడి తర్వాత బేరసారాల నివారణ చర్యల్లో భాగంగా పరిషత్ పదవుల ఎన్నికకు ఎక్కువ వ్యవధి లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడంతో ఈ ఆనవాయితీ మారింది. ఎంపీ టీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేయకుం డానే ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఇలా ప్రమాణం చేయకుం డానే అధ్యక్ష, చైర్పర్సన్లను ఎన్నుకోవడం పంచాయతీరాజ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల ప్రక్రియ ఇలా... ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతి మండలానికీ సదరు మండల ఎంపీడీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు వస్తే మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికలన్నీ కోరం ఉంటేనే నిర్వహిస్తారు. సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే వీటిని నిర్వహిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి చేతులు ఎత్తే పద్ధతిలో సభ్యులతో ఓట్లు వేయిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారిని ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు. ఒకవేళ బరిలో ఉన్నవారందరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తారు. కోఆప్టెడ్ పూర్తి కాకపోతే అధ్యక్ష ఎన్నికలు ఉండవు... ఒకవేళ ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తి కాకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే ఈ ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ప్రకటిస్తుంది. కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అవకాశం లేదు. అయితే కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తయి ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక పూర్తి కాకపోతే మరో తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుంది. స్ఈసీ నిర్ణయించిన తేదీన నిర్వహించే ఎన్నికలకు కోరం లేకపోయినా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవచ్చు. కాగా, తాము నియమించిన విప్‌లను మార్చే అవకాశం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కల్పించారు. అయితే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు ప్రిసైడింగ్ అధికారులకు ఆ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తున్నట్టు గతంలో ఇచ్చిన వ్యక్తే మరోసారి లేఖ ఇవ్వాలి. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందితే అందుకు అనుమతిస్తారు. జులైలోనే బాధ్యతల స్వీకరణ... పాత పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియనందున కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, శుక్రవారం ఎన్నికయ్యే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శనివారం ఎన్నికయ్యే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవీకాలం వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల పదవీ కాలం జూలై 3 వరకు, జెడ్పీటీసీల పదవీకాలం జులై 4 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల తర్వాతే కొత్త పరిషత్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత కొత్త జెడ్పీ చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేతనం ఇస్తేనే ఓటు
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొత్త మెలిక పెట్టారు. వేతనాలు ఇస్తేనే ఓటు వేస్తామని అధికార టీఆర్ఎస్ అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 24 నెలలుగా గౌరవ వేతనాలు అందడంలేదు. పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 31న జరగనుంది. ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసు కునేందుకు మూడు జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెండురోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోనే ఉన్న క్యాంపులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. న్యూఢిల్లీ, సిమ్లా, బెంగళూరు, కేరళలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ క్యాంపులు నడుస్తున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఒక క్యాంపుగా ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు ముందే ఓటర్లకు ఏదో రకంగా సాయం చేయడం సహజంగా జరుగుతోంది. ఈసారి మాత్రం క్యాంపులకు వెళ్లే ముందే ఓటర్లను అభ్యర్థులు ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. 24 నెలలుగా అందని వేతనాలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీలకు రూ.5 వేలు, జెడ్పీటీసీలకు రూ.10 వేలు, కౌన్సిలర్లకు రూ.2,500, కార్పొరేటర్లకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఖరారు చేసింది. ఆయా స్థానిక సంస్థల నిధుల నుంచి నెలSవారీగా గౌరవ వేతనాలను చెల్లించేలా ఉత్త ర్వులు జారీ చేసింది. మొదట్లో చెల్లింపులు జరిగినా తర్వాత నిధుల కొరతతో వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 నెలలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వేతనాలు చెల్లించడంలేదు. ఒక్కో ఎంపీటీసీ సభ్యుడికి సగటున రూ.1.20 లక్షలు, జెడ్పీటీసీ సభ్యుడికి రూ.2.40 లక్షల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉంది. గౌరవ వేతనాల చెల్లింపుల కోసం ఇన్నాళ్లుగా ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత వేతనాల చెల్లింపుపై చర్యలు తీసుకుంటామని అభ్యర్థులు బుజ్జగిస్తున్నారు. పోలింగ్ రోజు వరకైనా ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలని ఆ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. మరో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... మైనంపల్లి హనుంతరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 28తో ముగియనుంది. -
గులాబీల గుండెల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రెండు నెలల క్రితం ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించినప్పుడే ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడింది. టికెట్టు దక్కిన ఆనందంతోపాటే అసమ్మతి పోటు కూడా ఆ రోజు నుంచే మొదలైంది. రోజులు గడిచే కొద్దీ అదే సద్దుమణుగుతుందని భావించిన అభ్యర్థులకు సీన్ రివర్స్ అయింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తిరుగుబావుటాలు ఎగురవేశారు. పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ రాథోడ్ రమేష్ కాంగ్రెస్ పంచన చేరి టికెట్టు కోసం ప్రయత్నిస్తుండగా, సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. చెన్నూరులో సీటు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోసం ఏకంగా ఆత్మాహుతే జరిగింది. ఓదెలు తరువాత కేసీఆర్ హామీతో చల్లబడ్డా, ఇక్కడ మరో మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరేందుకు విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాతే ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే నియోజకవర్గానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. మిగతా నియోజకవర్గాలలో పార్టీలు మారకపోయినా... సొంతింట్లోనే కుంపటి పెడుతున్నారు. మునిసిపాలిటీ పాలకవర్గాల షాక్ నిర్మల్ మునిసిపాలిటీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కౌన్సిలర్లతో కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరడంతో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తేరుకోలేని పరిస్థితి. నిర్మల్ నియోజకవర్గంలో మునిసిపాలిటీ ఓట్లే కీలకం కాగా, కౌన్సిలర్ల తోపాటు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం మింగుడుపడని అంశం. దీన్ని సరిచేసేందుకు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్లో చేర్పించే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌తోపాటు సుమారు 20 మందికి పైగా కౌన్సిలర్లది అదే తీరు. వీరెవరూ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ఏ మాత్రం సహకరించడం లేదు. వేమనపల్లి జెడ్పీటీసీతోపాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు టీఆర్ఎస్కు దూరంగానే ఉంటున్నారు. ఇక్కడ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన మద్దతుదారులు కూడా దూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల మునిసిపాలిటీ పాలక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.దివాకర్‌రావుకు ఎలాంటి సహకారం లభించడం లేదు. ఇటీవల పాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మునిసిపల్ చైర్పర్సన్ వసుంధరతోపాటు పలువురు కౌన్సిలర్లు కూడా దూరదూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ ఏకంగా బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. చెన్నూరులో దూరదూరంగా నాయకులు పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు శాసనసభ అభ్యర్థి బాల్క సుమన్ గ్రామ గ్రామాన ప్రచారం సాగిస్తున్నప్పటికీ, పార్టీ నాయకుల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. కోటపల్లి, చెన్నూరు మండలాలల్లో ప్రభావం చూపగల జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఆయన మద్దతుదారులు టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా దీపావళి తరువాత కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇక్కడ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను నమ్ముకున్నా, పాత తరం నాయకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మందమర్రిలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఎఫెక్ట్ కనిపిస్తోంది. మండలాల్లో బూత్‌ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలను అప్పగించడం లేదని చాలా మంది దూరంగా ఉంటున్నారు. కేవలం యూత్‌ను నమ్ముకొనే రాజకీయం చేస్తామంటే చెన్నూరులో సాధ్యం కాదని ఆయన వెంట ఉండే నాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. బోథ్‌లో బాపూరావుకు నగేష్ తలనొప్పి బోథ్ సీటు ఆశించి భంగపడ్డ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇక్కడ అభ్యర్థి బాపూరావుకు ఏమాత్రం సహకరించడం లేదు. బాపూరావుతోపాటు ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న వెంట పర్యటించిన నగేష్ సొంత నియోజకవర్గం బోథ్‌లో దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు మద్దతుదారులెవరూ బాపూరావు వెంట నడవడం లేదు. ముథోల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి మద్దతుదారులు విఠల్‌రెడ్డికి సహకారం అందించడం లేదు. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మికి కూడా అసమ్మతి వెంటాడుతోంది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు టీఆర్ఎస్ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అ«భ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏకపక్షంగా ఉంటుందని భావించిన ఎన్నికలు హోరాహోరీగా మారిపోతున్న తరుణంలో సొంతపార్టీలోని కుంపట్లు పుట్టిముంచుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైతే అసంతృప్తి వాదులను పార్టీలోకి లాక్కోవాలనే ఆలోచనతో కొందరు నాయకులున్నారు. -
కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఘర్షణ
టీడీపీ నాయకుడి మృతి, మరో ముగ్గురికి గాయాలు చిలుకూరు, న్యూస్‌లైన్ : తొలి విడత జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడు మృతిచెందగా, అదే పార్టీకి చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో శనివారం రాత్రి కాంగ్రెస్, టీడీపీ నాయకులు మద్యం, డబ్బు పంచుతుండగా ఒకరికొకరు ఎదురుపడడంతో ఘర్షణకు దిగారు. అది కొద్దిసేపటికి తీవ్రస్థాయికి చేరి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పలువురు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మండవ సీతయ్య (55) తీవ్రంగా, ఎలుగూరి వీరస్వామి, బాదె అనిల్, రాముల స్వల్పంగా గాయపడ్డారు. సీతయ్యను చిక్సిత నిమిత్తం కోదాడ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి కారు అక్కడ ఉండడంతో టీడీపీ వర్గీయులు ఆయన కారు ధ్వంసం చేశారు. మృతుడి కుమారుడు కోటయ్య అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన చిట్టేటి వెంకటేశ్వర్లు, వాస్తురేఖ నాగేశ్వరరావు, మండవ గురునాథం, మండవ నాగార్జున్, రామినేని తులసీరాం, చిట్టేటి బాలకృష్ణ, పనస రాము, తిరుగుమళ్ల సత్యం, తిరుగుమళ్ల సైదులుతో పాటు పలువురిపై హత్య కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మండాది రామాంజనేయులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ చిరంజీవులు, ఎన్నికల జిల్లా పరిశీలకురాలు ప్రియదర్శిని, అడిషనల్ ఎస్పీ రమారాజేశ్వరి గ్రామాన్ని సందర్శించారు. పోలింగ్ ప్రశాంతగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తొలి ప్రచారానికి నేడు తెర
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ :జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో తెర పడనుంది. గత నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లతో మమేకం అవటంలో తొలినుంచి ముందంజలో ఉన్న వైఎస్ఆర్సీపీ మరింత ఉత్సాహంతో సాగుతోంది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి పర్యటనకు విశేష ప్రజాదరణ లభిస్తుండడంతో అభ్యర్థులు, నాయకులు మరింత ఆత్మస్థైర్యం తో దూసుకుపోతున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్రలోభాల రాజకీయంపై ఆధారపడుతున్నారు. తాయిలాలతో ఓటర్లను లోబరుచుకోవాలని చూస్తున్నారు. గార మండలంలో మద్యం పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. కొందరు అభ్యర్థులు మహిళలకు చీరలు పంచి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నా ఫలితం లేకపోతోంది. దీంతో డీలా పడిన టీడీపీ శ్రేణులు ఎలాగోలా ఓటర్లను మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లపాటు అందించిన దారుణ పాలనను ఇప్పటికీ మరిచిపోని ప్రజలు ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలను నమ్మడం లేదు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను పటిష్టంగా అమలు చేయడం ఒక్క వైఎస్ఆర్ సీపీకే సాధ్యమని గట్టి గా విశ్వసిస్తున్న ప్రజలు ఆ పార్టీని అధికారంలో కి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు తొలి విడతలో ఈ నెల 6న పోలింగ్ జరగనున్న శ్రీకాకుళం, గార, పోలాకి, జలుమూరు, సారవకోట, రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి 18 మండలాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ నరసన్నపేట జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 17 మండలాల్లో 1042 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ మండలాల పరిధిలో 7,92,214 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,98,927 మంది పురుషులు, 3,96,280 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఇతరులు. పురుషులు, మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. 1139 మంది పోలింగ్ అధికారులు, 1150 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 3,518 మంది ఓపీవోలను నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా వీడియో తీయించనున్నారు.