బట్వాడా రాక.. బతుకు బండి సాగక.. | no sallery's since three months for tobbaco labour's | Sakshi
Sakshi News home page

బట్వాడా రాక.. బతుకు బండి సాగక..

Published Wed, Dec 28 2016 3:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

బట్వాడా రాక.. బతుకు బండి సాగక..

బట్వాడా రాక.. బతుకు బండి సాగక..

మూడు నెలలుగా బీడీ కార్మికులకు వేతనాల్లేవు
పెద్ద నోట్ల రద్దుతో చితుకుతున్న బతుకులు
పూట గడవడమే కష్టమవుతోందంటున్న కార్మికులు..

బీడీలు చుడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలి పేరు తాటికొండ పుష్పవ్వ. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. భర్తతో కలసి కోటగల్లిలో నివాసముంటున్న ఈ వృద్ధురాలు రోజుకు పావుషేరు (250) బీడీలు చేస్తుంది. ప్రతినెలా సుమారు రూ.రెండు వేల బట్వాడా వస్తుంది. కానీ, మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వచ్చే రెండు వేలను బ్యాంకులో వేస్తే ప్రతినెలా రెండు మూడు రోజులు బీడీలు చేయడం మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తోంది.


సాక్షి, నిజామాబాద్‌ : పెద్ద నోట్ల రద్దు బీడీ కార్మికుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని చుట్టిన బీడీల కష్టం చేతికందక పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా మూడు నెలలుగా బీడీ కార్మికులకు బట్వాడా (వేతనం) నిలిచిపోవడంతో బీడీ కార్మిక కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. వేతనాలు అందక బతుకు బండిని నడిపేదెలా అని వారు వాపోతున్నారు. తక్షణం తమకు వేతనాలు అందకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీడీ పరిశ్రమపై ప్రభావం..
నిజామాబాద్‌ కేంద్రంగా బీడీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉండగా, ఒక్క నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోనే సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. అలాగే.. జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల బీడీ కార్మికులున్నారు. పెద్ద, చిన్న కంపెనీలు కలిపి అత్యధికంగా నిజామాబాద్‌లో 82 బీడీ కంపెనీలుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 400 వరకు ఉంటాయి. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేస్తూ నవంబర్‌ 8వ తేదీన తీసుకున్న నిర్ణయం బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. అక్టోబర్‌ నుంచి వారికి వేతనాలు అందలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రతినెలా 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కార్మికులకు బట్వాడా ఇస్తుంటాయి. ఒక్కో కంపెనీ నెలలో ఒక్కో వారంలో వేతనాలు ఇస్తుంది. అయితే అక్టోబర్‌ మాసం నుంచి వేతనాలు నిలిచిపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

‘కష్టం’ ఖాతాల్లోకి..
ఇకపై బీడీ కార్మికులు ప్రతినెలా చెల్లించే బట్వాడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. అయితే చాలా మంది కార్మికులకు బ్యాంకు ఖాతాలు లేవు. ఖాతాల వివరాలు ఇచ్చిన కార్మికులకు కూడా ఇప్పటికీ వేతనాలు జమ కాలేదని కార్మికులు వాపోతున్నారు. బ్యాంకు ఖాతాలో జమ చేస్తే వాటిని డ్రా చేసుకునేందుకు ప్రతినెలా రెండు, మూడు రోజులు పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. ఎప్పటిలాగే నగదు రూపంలోనే బట్వాడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

భారీ ధర్నా..
తమకు ప్రతినెలా ఇచ్చే బట్వాడా బ్యాంకులో కాకుండా, నగదు రూపంలో చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సుమారు పది వేల మంది బీడీ కార్మికులు నిజామాబాద్‌ నగరంలో భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీడీ కార్మికులు కలెక్టరేట్‌ను దిగ్బంధించారు.


ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజామాబాద్‌లోని ఆర్‌ఎన్‌ చాండక్‌ బీడీ కార్ఖానా. సుమారు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు వెయ్యి బీడీలు చుడితే నెలకు రూ.మూడు నుంచి రూ.నాలుగు వేల వేతనం వస్తుంది. ప్రతినెలా 7వ తేదీలోగా వేతనాలు ఇస్తారు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వీరికి యాజమాన్యం అక్టోబర్‌ నుంచి బట్వాడా నిలిపివేసింది. బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికీ తమకు అందలేదని కార్మికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement