
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) నిధుల కటకటతో సతమతమవుతోంది. ఈ ప్రభావం వివిధ అభివృద్ధి పనులపై పడుతోంది.ఆర్‌అండ్ బీ నిధులను ‘రైతుబంధు’పథకానికి మళ్లించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను నిధుల కోసం బ్యాంకుల వద్ద అప్పు తీసుకోమని సూచించింది. ఆ యత్నానికి ముందస్తు ఎన్నికలు బ్రేకులు వేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగడంతో వారు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వారి చుట్టూ తిరుగుతున్నారు.
కొత్త పనులు ప్రారంభించినా...
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్ల నిధులు సకాలంలోనే వస్తాయని భావించిన ఆ శాఖ అధికారులు ఏప్రిల్‌లో ఆర్థిక సంవత్సరం మొదలవగానే.. పాత బిల్లులతోపాటు కొత్త పనుల అప్పగింతకు ముందుకెళ్లారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రూ.20వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. అదే సమయంలో ఆర్‌అండ్ బీకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆర్‌అండ్‌బీకి నిధులురావని, రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నించమని అధికారులకు సలహా ఇచ్చింది. దీనికోసం అధికారులు ప్రయత్నిస్తే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 4 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈలోగా ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రుణం మంజూరుకు బ్యాంకులు వెనకంజవేశాయి.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అక్టోబరు తొలి వారంలోనే తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రూ.5,600 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు వారు పనులు మొదలు పెట్టినా, నవంబరు ఆరంభం వరకూ నిధులు అందలేదు. ఈ విషయమై వారు పలుమార్లు సీఎస్, మంత్రి తుమ్మల, కేటీఆర్‌ల వద్ద చర్చలు జరిపినా పురోగతి రాలేదు. దీంతో వారు రెండోసారి సమ్మె యోచన చేశారు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు.
సీఎం పేషీ నుంచే ఆదేశాలు..!
వాస్తవానికి అక్టోబరులో ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వంతో పలుమార్లు సమావేశమయ్యారు. బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని, ప్రభుత్వమూ నిధులు ఇవ్వకపోతే.. పరిస్థితి ఇబ్బందికరమని తేల్చిచెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. చివరికి నవంబరు తొలి వారంలో నిధులు రావడం లేదంటూ సీఎం పేషీ నుంచి ఆర్ అండ్ బీ అధికారుల నెత్తిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ అండ్ బీ శాఖకు రావాల్సిన నిధులను ‘రైతు బంధు ’పథకానికి బదిలీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇలా రోడ్లుభవనాల శాఖ చెల్లింపులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిలో పడింది. ఆశ్రయించిన బ్యాంకులూ ఎన్నికల నేపథ్యంలో వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వివిధ అభివృద్ధిపనులపై ప్రభావం చూపుతోంది.పనులు చేసిన కాంట్రాక్టర్లూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment