భూసార పరీక్షలా.. అవెక్కడా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూసార పరీక్ష నిర్వహణ ఓ ‘ఫార్స్’గా మారింది. మట్టి నమూనాలపై చర్చలు.. ఆర్భాటపు ప్రకటనలతోనే వ్యవసాయ శాఖ అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. ఈ సీజన్‌లో రైతులకు మట్టి నమూ నా పరీక్షల ఫలితాలు అందనేలేదు. సాంప్రదాయక పద్ధతితోనే విత్తనం చేయడానికి సిద్ధపడ్డారు.
నారాయణఖేడ్, సిద్దిపేట, గజ్వేల్, జోగిపేట నియోజకవర్గాల్లో కనీసం 100 మంది రైతుల చొప్పున ‘మీ పొలంలో భూసార పరీక్షలు చేయించారా? వాటి ఫలితాలు మీకు అందాయా?’ అని అడిగితే వారిలో దాదాపు మూడొంతుల మంది భూసార పరీక్షలు అంటే ఏమిటని అడగడం గమనార్హం. సుమారు 500 మంది రైతుల నుంచి సమాచారం సేకరించగా కేవలం ముగ్గురు మాత్రం మట్టి నమూనాలు సేకరించారని, వాటి ఫలితాలు మాత్రం ఇంకా రాలేదని చెప్పారు.
రూ. కోట్లు ఖర్చు చేసినా...
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల భూముల్లో మట్టి నమూనాలు తీసి.. వాటిని పరీక్ష చేసి భూసార నాణ్యత, భూ రసాయనాల వివరాలను పరిశీలించి భూమి ఏఏ పంటలు వేయడానికి అనుకూలమో. ఎలాంటి ఎరువులు, రసాయనిక మందులు ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తూ ఆ ఫలితాలను రైతుకు అందిస్తే... వాటి ఆధారంగా రైతులు తమ భూముల్లో పంటలు వేసుకుంటానికి అవకాశం ఉంటుంది.
మట్టి నమూనాల సేకరణ- విశ్లేషణ కోసం ప్రభుత్వం ఏటా రూ. కోటికి పైగా ఖర్చు చేస్తోంది. రూ. కోట్లకు కోట్లు కరిగిపోతున్నాయి. కానీ వాటి ఫలితాలు మాత్రం రైతుల చేరువలోకి రావడం లేదు. ఒకటి, అర మంది రైతులకు అడపాదడపా ఫలితాలు వచ్చినా అవి అదను దాటిపోయిన తరువాత అంటే రైతు విత్తనం వేసుకొని, అవి మొలకెత్తిన తరువాత భూసార ఫలితాలను అందిస్తున్నారు. ఇలా ఇవ్వడం వలన ఏమిటీ ప్రయోజనం అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతా తప్పుడు సమాచారం
ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 5.64 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా సన్న, చిన్నకారు, మోతుబరి రైతులను కలుపుకుంటే దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎకరం భూమి ఉన్న రైతు దగ్గర నుంచి మొదలుకుని వంద ఎకరాల ఆసామి వరకు ఉన్నారు. ప్రతి రైతు పొలంలో మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది. సగటున జిల్లాలో కనీసం 3 లక్షల మట్టి నమూనాలు సేకరించాలి. కానీ అంత సామర్థ్యం మనకు లేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సీజన్ కోసం కేవలం 6,310 మట్టి నమూనాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వాటిలో 5,669 నమూనాలు సేకరించి, విశ్లేషణ చేసి వాటి ఫలితాలను రైతులకు అందించినట్టు నివేదికల్లో పొందు పరిచారు. క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం వ్యవసాయ అధికారుల నివేదికలు వాస్తవ విరుద్ధమని తేలింది. జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ పట్టణాల్లో భూసార పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. సంగారెడ్డి ప్రయోగశాలకు రోజుకు కనీసం 50 నుంచి 60, మెదక్, సిద్దిపేట ప్రయోగశాలలకు రోజుకు 30 చొప్పున మట్టి నమూనాలు పరీక్షించే సామర్థ్యం ఉంది. దాదాపు ఏప్రిల్ మూడో వారం నుంచి మట్టి నమూనాలు సేకరించడానికి అనుకూలమైన సమయం.
ఈలెక్కన ఏప్రిల్ 20 నుంచి జూన్ 17 తేదీ వరకు తీసుకుంటే వ్యవసాయ అధికారులు మూడు భూసార పరీక్ష కేంద్రాల నుంచి రోజుకు 120 చొప్పున మట్టి నమూనాల విశ్లేషణ చేసినా 27 రోజుల్లో 3240 నమూనాలు మాత్రమే పూర్తి అవుతున్నాయి. మరి వ్యవసాయ అధికారులు మాత్రం 5,669 నమూనాలు విశ్లేషించినట్లు తప్పుడు సమాచారం నివేదికలో పొందు పరిచి డీఆర్‌సీ ముందు పెట్టడంపై రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చే స్తున్నాయి.