సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వ్యవసాయానికి సర్కార్ ఇస్తామన్న 7 గంటల ఉచిత విద్యుత్ కాగితాలకే పరిమితమైంది. కనీసం 3 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సాగుకు అందకపోవడంతో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడుపుమండిన రోజున సబ్‌స్టేషన్‌లను ముట్టడించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అరకొర విద్యుత్ సరఫరాను నిరసిస్తూ సోమవారం తూప్రాన్ మండలం నాగుపల్లి 33/11 కే.వీ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతటితో ఆగకుండా ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్భందించారు. కొల్చారం మండలంలోని వరిగుంతం సబ్‌స్టేషన్ ఎదుట అక్కడి రైతులు తమ నిరసన కొనసాగించారు. ఇలా ఇరవై రోజులుగా జిల్లాలో ఏదో ఒక చోట రైతులు కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు సబ్‌స్టేషన్‌ల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు.
ఖరీఫ్‌లో పంటనష్టాన్ని చవిచూసిన రైతులు రబీపై ఆశతో బోరుబావుల కింద వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తున్నారు. అయితే సర్కార్ వ్యవసాయానికి సరఫరా చేస్తామన్న 7 గంటల ఉచిత విద్యుత్‌లో కనీసం 3 గంటలు కూడా సక్రమంగా రాకపోవడం...అది కూడా రాత్రి వేళల్లో ఇస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటకోసారి విద్యుత్ సరఫరాలో కోత ఉంటుండడంతో తడిపిన పొలాన్నే మళ్లీ తడుపుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు లోఓల్టేజీ సమస్యతో బోరు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడంతో రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పేరుకే 7 గంటలు
జిల్లాలో వ్యవసాయానికి 7 గంటలు రెండు విడతలుగా పగటి వేళల్లో 4, రాత్రి వేళల్లో 3 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా వ్యవసాయానికి 3 నుంచి 4 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావటంలేదు. జిల్లాలో విద్యుత్ అసవరాలను తీరేం దుకు ప్రతి రోజూ 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, ప్రస్తుతం 15 మిలి యన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో ప్రతిరోజూ ఒకమిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది.దీంతో గృహ లతోపాటు వ్యవసాయానికి సైతం ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తున్నారు.
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ ఏడుగంటలు వ్యవసాయానికి సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో చెబుతున్న మాటలు ఎక్కడా అమలు నోచుకోవటం లేదు. పగటి పూట 10.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, రాత్రి వేళల్లో 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నా, వాస్తవంలో మాత్రం ఎక్కడా అది కనిపించడం లేదు. కరెంటు సక్రమంగా సరఫరా కాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామానికి చెందిన రైతు మురళి వాపోయారు.
వరి రైతుకు ఇక్కట్లు
విద్యుత్ కోతల ప్రభావం ప్రధానంగా వరి రైతులపై పడుతోంది. ఖరీఫ్‌లో వరి పంట ఆశించినస్థాయిలో దిగుబడి రాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరగటంతో రైతులు బోరుబావుల కింద వరి పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2.20 లక్షల బోరుబావులుండగా, వీటికింద అత్యధిక శాతం రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ రబీలో 60వేల హెక్టార్లలో వరి సాగవనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటిలో 30 వేల హెక్టార్లకుపైగా బోరుబావుల కింద రైతులు వరి సాగు చేస్తారని అంచనా. ప్రస్తుతం వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.
ఈ తరుణంలో విద్యుత్ కోతలు ఎడాపెడా అమలు చేస్తుండటంతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల కింద మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గోదుమ, వేరుశనగ పంటలను సాగు చేస్తున్న రైతులకు కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదు. విద్యుత్ కోతల కారణంగా ఆ పంటలకు కూడా సాగునీరందక అవి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనికితోడు కూరగాయల సాగు చేస్తున్న రైతులు సైతం విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఆలుగడ్డ, పసుపు, అల్లం పంటను భారీగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆయా పంటలకు ప్రస్తుతం సాగునీరు అవసరం.
అయితే విద్యుత్ కోతలతో ఆలు, అల్లం పంటలు సాగులో ఇబ్బందులు పడుతున్నట్లు జహీరాబాద్ రైతులు వాపోతున్నారు. ఇకనైనా ట్రాన్స్‌కో రైతుల ఇక్కట్లను గురించి వ్యవసాయానికి 7 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేసినప్పుడే పంటలసాగు పెరగటంతోపాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని లేనిపక్షంలో మరోమారు నష్టాలు చవిచూడక తప్పదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
సాగుకు సగమే
Published Mon, Jan 13 2014 11:14 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement