ఎక్కడి వారు అక్కడికే! | No Transfer In Revenue Department In Telangana | Sakshi
Sakshi News home page

ఎక్కడి వారు అక్కడికే!

Published Mon, May 27 2019 10:18 AM | Last Updated on Mon, May 27 2019 10:18 AM

No Transfer In Revenue Department In Telangana - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఎన్నికల నేపథ్యంలో వేరే జిల్లాలకు బదిలీ అయిన మన జిల్లా తహసీల్దార్లు త్వరలోనే ఇక్కడకు రానున్నారు. అలాగే, జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు వారి వారి సొంత జిల్లాలకు వెళ్లనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తర్వాత వారు జిల్లాకు బదిలీ కానున్నారు. ఎనిమిది నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి 18 మంది తహసీల్దార్లను వేరే జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అనంతరం సొంత జిల్లాలకు పంపేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఏల్‌ఏ) కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇటు తెలంగాణ స్టేట్‌ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా సీసీఎల్‌ఏ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శిని కలిసి ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు. దీంతో పాత జిల్లాలకు తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ వారం, పది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
 
గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు జిల్లాలో మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న తహసీల్దార్లకు స్థాన చలనం కలగించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీంతో అక్టోబర్‌ 16న సీసీఎల్‌ఏ అధికారులు జిల్లాలో 18 మందిని బదిలీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వారు పాత స్థానాలకు రావాల్సి ఉండగా, అదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో వారి రాక మరింత ఆలస్యమైంది.

కుటుంబ సభ్యులకు దూరంగా... 
ఎనిమిది నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, పని ఒత్తిడితో చాలా తహసీల్దార్లు అనారోగ్యాలకు గురయ్యారు. వారి పిల్లల చదువులపై కూడా ప్రభావం చూపాయి. అయితే, ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మాత్రమే ఉంది. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరగా>ల్సి ఉండగా, ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. జూన్‌ మొదటి వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశాలున్నాయి. దీంతో ఎన్నికల కోడ్‌ పూర్తిగా తొలగి పోనుంది. కోడ్‌ ఎత్తివేసిన అనంతరమే తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని సీసీఎల్‌ఏ భావిస్తోంది.
 
బదిలీపై వెళ్లింది వీరే... 
జిల్లా నుంచి వేరే జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు మొత్తం 18 మంది తహసీల్దార్లు ఉన్నారు. వీరిలో ఆర్మూర్‌ మండలానికి చెందిన రాజేందర్, భీమ్‌గల్‌ భావయ్య, కమ్మర్‌పల్లి అర్చన, బాల్కొండ ప్రవీణ్‌కుమార్, మెండోరా జయంత్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ సుదర్శన్, సిరికొండ వీర్‌సింగ్, ధర్పల్లి రమేశ్, జక్రాన్‌పల్లి సతీశ్‌రెడ్డి, బోధన్‌ గంగాధర్, రెంజల్‌ రేణుక చవాన్, ఎడపల్లి లత, నవీపేట్‌ అనిల్‌కుమార్, వర్ని హరిబాబు, నస్రుల్లాబాద్‌ సంజయ్‌రావు, ఏర్గట్ల ముంతాజొద్దీన్, ముప్కాల్‌ విజయ్‌కుమార్, డిచ్‌పల్లి మండలం నుంచి శేఖర్‌ బదిలీపై వెళ్లారు. అయితే నిజామాబాద్‌ జిల్లా నుంచి బదిలైన వెళ్లిన వీరు కామారెడ్డితో పాటుగా మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పని చేస్తున్నారు. అయితే, త్వరలో పాత జిల్లాకే రానున్న సందర్భంగా పలువురు తహసీల్దార్లు పాత మండలాల్లో కాకుండా తమకు అనుకూలంగా ఉన్న మండలాలకు బదిలీ అయ్యేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
 
ఇక్కడి వారు అక్కడకు.. 
మన జిల్లా నుంచి 18 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సమయంలోనే హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది తహసీల్దార్లను మన జిల్లాకు కేటాయించారు. అయితే, సొంత జిల్లాలకు తహసీల్దార్లను పంనున్న సందర్భంగా మన జిల్లాకు వచ్చిన 20 మందిని వారి వారి పాత జిల్లాలకు పంపనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement