ఇది అంకెల గారడీ బడ్జెట్ | no use telangana budjet, D srinivas | Sakshi
Sakshi News home page

ఇది అంకెల గారడీ బడ్జెట్

Published Sat, Nov 8 2014 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

ఇది అంకెల గారడీ బడ్జెట్ - Sakshi

ఇది అంకెల గారడీ బడ్జెట్

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆదాయాన్ని అధికంగా చూపడంతో బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని శాసన మండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. ఇది వాస్తవికత లేని బడ్జెట్ అని అభివర్ణించారు. శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం బడ్జెట్‌పై జరిగిన చర్చలో తొలుత ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం కనీసం కృతజ్ఞతలు తెలపకపోవడం శోచనీయమన్నారు. తాము రాష్ట్రాన్ని ఇచ్చే నాటికే ఆర్థిక మిగులుతో తెలంగాణ బంగారు తెలంగాణగా ఉందని..ఇపుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని సవాలు విసిరారు. గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల తలసరి ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన గణాంకాలు చదివి వినిపించారు.

 

విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి రామగుండం ఎన్‌టీపీసీకి విద్యుత్‌ను తరలించి అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా చేసే అంశాన్ని సాంకేతికంగా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వాటర్‌గ్రిడ్ పథకానికి కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడంతో ఈ పథకం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. మరో రూ.23 వేల కోట్లను ఎక్కడి నుంచి సమకూరుస్తారన్నారు. ఈ పథకానికి తగిన ప్రణాళిక లేకపోవడం శోచనీయమన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు పూచీకత్తునిచ్చి రుణమాఫీ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలన్నారు.
 
 ఇన్‌పుట్ సబ్సిడీపై ఆసక్తికర చర్చ..
 
 రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదని విపక్ష నేత డి.శ్రీనివాస్ తన ప్రసంగంలో పేర్కొనడంతో..సభలో ఉన్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొక్కిపెట్టిన రూ.450 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను మంజూరు చేసిన ఘనత తమదేనన్నారు. ఎర్రజొన్న రైతులకు సంబంధించిన రూ.11.92 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మండలి సోమవారానికి వాయిదాపడింది.
 
 ఇది ప్రజల బడ్జెట్...
 తెలంగాణ తొలి బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మండలిలో సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతురుణాల మాఫీ, కల్యాణ లక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్య, వాటర్‌గ్రిడ్, యాదగిరిగుట్ట అభివృద్ధి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు.
 
 కేజీ టు పీజీపై రగడ
 
 ‘‘గత ఎన్నికల్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అత్యంత ప్రాచుర్యం పొందిన నినాదం. ప్రతి ఎన్నికల సభలో ఈ నినాదాన్ని అధికార పార్టీ బలంగా వినిపించింది. బడ్జెట్‌లో ఈ పథకానికి నామమాత్రంగా రూ.25 కోట్లు కేటాయించారు. ఇంత ప్రాచుర్యం పొందిన పథకానికి కేటాయింపులు  ఇంతేనా ? ఈ పథకాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన వ్యాఖ్య అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ‘గాలికి వదిలేయడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు..ఆంధ్ర ప్రభుత్వం అంతకన్నా కాదు’ అని విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఈ వ్యాఖ్యను తిప్పికొట్టడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా సభలో అన్‌పార్లమెంటరీ భాషను వినియోగిస్తే పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఇరుపక్షాలను శాంతపరిచారు.
 
 ఆ ఎమ్మెల్సీలను ఏపార్టీవారిగా గుర్తిస్తారు?
 
 ఇదిలా ఉండగా.. శుక్రవారం సభ ప్రారంభం కాగానే  తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలను ఏ పార్టీ సభ్యులుగా గుర్తిస్తారో చెప్పిన తరువాతే ప్రశ్నోత్తరాలను ప్రారంభించాలని కాంగ్రెస్‌పక్ష నేత డి.శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుపట్టగా.. టీడీపీ సభ్యులు కూడా మద్దతు పలికారు. ఏ నిబంధన ప్రకారం ఈ ప్రశ్నను లేవనెత్తారనే విషయాన్ని స్పష్టం చేస్తే దీనిపై స్పందిస్తామని మంత్రి కె.తారక రామారావు బదులిచ్చారు. సభ్యులు పార్టీలు మారడం ఈ రోజు కొత్త కాదని, గతంలో చాలా సార్లు జరిగినదేనని స్పష్టం చేశారు. సభలో విపక్షాల ప్రశ్నించే అధికారాన్ని అధికార పక్షం అడ్డుకుంటోందని విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో వాతావరణం వేడెక్కింది. ఈ అం శంపైనే దాదాపు 15 నిమిషాల పాటు వాదోపవాదాలు జరిగాయి. ‘టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై విచారణ చేస్తున్నాం.. సభలో వారు అడిగే ప్రశ్నలను పార్టీలతో ప్రమేయం లేకుండా సభ్యులు వ్యక్తిగతంగా అడిగిన ప్రశ్నలుగానే గుర్తిస్తాం, సభ సజావుగా సాగేందుకు సహకరిం చాలి’ అని చైర్మన్ స్వామిగౌడ్ విజ్ఞప్తి చేయడం తో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.
 
 కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు
 ఉపముఖ్యమంత్రి రాజయ్య
 
 రాష్ట్రంలో కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య స్పష్టం చేశారు. పాల కల్తీపై తనిఖీల కోసం త్వరలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ రసాయనాన్ని కలిపి సింథటిక్ పాలను విక్రయిస్తున్న ప్రైవేటు పాల వ్యాపార సంస్థలపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వి.భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి,  యాదవరెడ్డిలు లేవనెత్తిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సింథటిక్ పాల వ్యాపారం జరుగుతున్నట్లు  ఆరోపణలున్నాయని, ప్రధానంగా హెరిటేజ్ సంస్థ పాలల్లో ఫార్మాలిన్ కలిపినట్లు నిర్ధారణ కావడంతో ఈ బ్రాండు పాలను నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం జీవోసైతం జారీ చేసిం దని యాదవరెడ్డి సభ దృష్టికి తీసుకు రాగా.. కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్ సభ్యులు సైతం కల్తీ పాలపై ఆందోళన వ్యక్తంచేశారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని పత్రికల్లో మాత్రమే చూశామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా సింథటిక్ పాలను పట్టుకున్నట్లు సమాచారం లేదని మంత్రి రాజయ్య సమాధానమిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement