నామినేషన్లకు తెర  | Nomination Process Closed In Telangana State | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు తెర 

Published Tue, Nov 20 2018 10:37 AM | Last Updated on Tue, Nov 20 2018 10:39 AM

Nomination Process Closed In Telangana State - Sakshi

సూర్యాపేటలో నామినేషన్‌ వేసి బయటికి వస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ముందస్తు ఎన్నికల్లో ఓ అంకానికి తెర పడింది.ఈనెల 12తో ప్రారంభమైన నామినేషన్ల పర్వం  జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సోమవారంతోముగిసింది. చివరి రోజు నామినేషన్లతో భారీ ర్యాలీలు, నినాదాలతోనియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు భారీగానామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. ఇక ప్రధాన పార్టీల్లో పార్టీ పరంగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తే..టికెట్‌ దక్కక రెబల్స్‌ కూడా నామినేషన్లు వేశారు. ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 115 నామినేషన్లు దాఖలయ్యాయి.  

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు నమోదయ్యాయి. సూర్యాపేట నియోజవకవర్గంలో చివరిరోజు నామినేషన్ల దాఖలు ఆయా పార్టీల శ్రేణుల ర్యాలీలు, ప్రచార హోరుతో జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు ఇష్టమైన దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్ల కేంద్రానికి కదిలారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్‌రావు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్‌ దాఖలు చేశారు. కోదాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నలమాద పద్మావతి, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిలు భారీ ర్యాలీ లతో నామినేషన్లు వేశారు.

అలాగే హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు. తుంగతుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అద్దంకి దయాకర్‌ భారీ ర్యాలీతో నామినేషన్‌ వేశారు. ఇక పలు పార్టీలనుంచే కాక, స్వతంత్రంగా చాలా మంది అభ్యర్థులు బరిలో నిలవడానికి నామినేషన్లు వేశారు. చివరి రోజు నామినేషన్లతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల కోలాహలం కనిపించింది. అన్ని పార్టీల అభ్యర్థులు శ్రేణులు కదలిరావడంతో ఉత్సాహంతో నామినేషన్లు వేసి విజయం తమదేనన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మొత్తం నామినేషన్లు:

నియోజకవర్గం    అభ్యర్థులు    నామినేషన్లు
హుజూర్‌నగర్‌  24  39
కోదాడ   27   41
సూర్యాపేట   30 58
తుంగతుర్తి  27 42
మొత్తం  108 180

   
ఏడు రోజుల్లో 108 మంది అభ్యర్థులు..180 నామినేషన్లు..
ఈ నెల 12నుంచి నామినేషన్ల ముగింపు వరకు జిల్లాలో 108 మంది అభ్యర్థులు 180 నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ల ప్రకటన కాకముందే కొంత మంది స్వతంత్రులుగా, పార్టీ పరంగా రెండు, మూడు సెట్లు నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల సంఖ్య తక్కువ, నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సోమవారం జిల్లావ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో115 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 23 నామినేషన్లు, కోదాడలో 29, సూర్యాపేటలో అత్యధికంగా 33, తుంగతుర్తిలో 30 నామినేషను వచ్చాయి..
ఇక రెబల్స్‌ బుజ్జగింపులు..
నామినేషన్ల అంకం ముగియడంతో పార్టీల తరఫున బీఫామ్‌లతో నామినేషన్లు వేసిన వారు.. ఇక రెబల్స్‌పై దృష్టి పెట్టారు. ఈనెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే ఈలోపే వారిని బుజ్జగించి బరిలో ఉండకుండా చూసేలా రాజకీయ మంతనాలకు దిగుతున్నారు. రెబల్స్‌గా వేసిన అభ్యర్థులకు వారి కుటుంబంలో దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు..?, పార్టీ పరంగా ఏ నాయకుడు చెబితే వింటారోనని బుజ్జగించేందుకు అన్ని దారులు పార్టీల అభ్యర్థులు వెతుకుతున్నారు. బుజ్జగింపులకు వినకుంటే చివరికి వారి వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా అభ్యర్థులు అంచనాల్లో మునిగారు. వారికి ఏ మండలం, గ్రామం, పట్టణంలో వారికి ఎన్ని ఓట్లు పడతాయో కూడా లెక్కలు వేయిస్తున్నారు. దీని ఆధారంగా వారు వినకుంటే వారి వెంట ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు ఎర వేసి తమ వైపునకు లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు.         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement