
సాక్షి, హైదరాబాద్: మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో హైకోర్టు సానుకూల ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నాంపల్లి కోర్టు ఎదుట హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ చర్యలను తీవ్రంగా పరిగణించిన 17వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. అనారోగ్యం వల్ల కోర్టుకు రాలేకపోయారంటూ ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాక ఇది చాలా చిన్న కేసంటూ రాధాకృష్ణ తరఫు న్యాయవాదుల వాదనను సైతం కోర్టు తిరస్కరించింది.
వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వనప్పుడు తామిచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాటిని గౌరవించకపోవడం ఎంత మాత్రం సరికాదంటూ వారంట్ జారీ చేసింది. అయితే పబ్లిషర్, ఎడిటర్‌తో పాటు ఇతర ఉద్యోగులు కోర్టు ఎదుట హాజరయ్యారు. వారి హాజరును నమోదు చేసుకున్న కోర్టు.. ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిస్తే, అసత్యాలతో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువుప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగానూ రాధాకృష్ణతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పబ్లిషర్, ఎడిటర్, మరో నలుగురు ఉద్యోగులు స్వయంగా కోర్టు ముందు హాజరై తీరాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై రాధాకృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు వీరి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణకు రాధాకృష్ణ సహా మిగిలిన వారందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది.
రాధాకృష్ణ హాజరు కావాల్సిందే..
రాధాకృష్ణ తప్పనిసరిగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చిచెబుతూ ఎన్‌బీడబ్ల్యూ జారీ ఉత్తర్వులకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మళ్లీ రాధాకృష్ణ న్యాయవాది కల్పించుకుని ఇది చాలా చిన్న కేసని, ఎండీకి సంబంధం లేదంటూ పదేపదే చెప్పారు. ఒక్క నిమిషం ఆగాలని చెప్పిన న్యాయమూర్తి, ఎన్‌బీడబ్ల్యూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు. విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కాగా, రాధా కృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 11న విచారణ జరపనుంది.
డాక్టర్ సర్టిఫికెట్ ఎక్కడ..?
కేసు విచారణకు రాగానే.. రాధాకృష్ణకు అనారోగ్యంగా ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ఈ మేరకు ఓ పిటిషన్‌ను న్యాయమూర్తికి అందజేశారు. దాని ని పరిశీలించిన న్యాయమూర్తి, అందులో డాక్టర్ సర్టిఫికెట్ లేకపోవడంపై ప్రశ్నించారు. ఇది చాలా చిన్న కేసని, ఎండీ హోదా లోని వారికి ఈ కేసు వర్తించదని రాధాకృష్ణ తరఫు న్యాయవాది చెప్పగానే.. అవన్నీ కేసు విచారణ సమయంలో చెప్పుకోవాలని న్యా యమూర్తి తేల్చి చెప్పారు. గతంలో ఇచ్చిం ది జ్యుడీషియల్ ఉత్తర్వులనే విషయం మీకు కూడా తెలుసుకదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో న్యాయవాది.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పగానే, ఎమ్మెల్యే ఆళ్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కల్పించుకుని.. హైకోర్టులో స్టే ఉత్తర్వులు రాలేదని గుర్తుచేశారు. దీనిపై న్యాయమూర్తి కల్పించుకుని.. హైకోర్టు స్టే ఉత్తర్వులు లేనప్పుడు గతంలో తామిచ్చిన జ్యుడీషియల్ ఉత్తర్వుల మేరకు నేటి విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. ఈ కేసు దాఖలు చేసే అర్హత ఎమ్మెల్యే ఆళ్లకు లేదని రాధాకృష్ణ న్యాయవాది చెప్పగా, ఆ విషయాలన్నీ కేసు విచారణ సమయంలో చెప్పుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment