మా ఊరెళ్లిపోతాం..! | Non-state teachers who request the government for four years for transfers | Sakshi
Sakshi News home page

మా ఊరెళ్లిపోతాం..!

Published Tue, Aug 7 2018 3:21 AM | Last Updated on Tue, Aug 7 2018 10:13 AM

Non-state teachers who request the government for four years for transfers - Sakshi

రామకృష్ణది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సీతానగరం మండలం బుక్కుపేట. 2008 డీఎస్సీలో ఓపెన్‌ కేటగిరీలో నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించారు. రాష్ట్ర విభజన జరగడంతో సరికొత్త సమస్య వచ్చిపడింది. వారికున్న ఇద్దరు పిల్లల్ని ఇక్కడ చదివిస్తే సొంత రాష్ట్రంలో స్థానికేతరులు అయ్యే అవకాశం ఉండటంతో విజయనగరంలో ప్రత్యేకంగా హాస్టల్‌లో పెట్టి చదివిస్తున్నారు. తెలంగాణలో చదివితే స్థానికత వచ్చినప్పటికీ.. అక్కడ బీసీగా పరిగణించే కులం ఇక్కడ ఓసీలోకి రానుంది.

శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన రవిరాజ్‌ 2006 డీఎస్సీలో మెదక్‌ జిల్లాలో ఓపెన్‌ కోటాలో ఉద్యోగం సాధించారు. అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం ఉంటుందని ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం లేదు. ఇటీవల రవిరాజ్‌ తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణ చికిత్స అవసరం కావడంతో ఆయన్ని జిల్లా కేంద్రంలోని ఒక ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. చికిత్స అనంతరం రూ.2.40 లక్షలు బిల్లు అవడంతో బంధువుల వద్ద అప్పు తెచ్చి చెల్లించారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకుంటే మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తించకపోవడంతో తలపట్టుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఓపెన్‌ కేటగిరీలో కొలువులు సాధించిన స్థానికేతర ఉద్యోగులకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో పలువురు అభ్యర్థులు తెలంగాణ జిల్లాల్లో టీచర్‌ కొలువులు దక్కించుకున్నారు. అంతర్‌ జిల్లా బదిలీలో లేక ప్రత్యేక కేటగిరీ కింద ఏనాటికైనా సొంత జిల్లాకు బదిలీ కావచ్చనే ధీమాతో ఉద్యోగాల్లో చేరారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో పరిస్థితి తారుమారైంది. అంతర్‌ జిల్లా బదిలీలకు అవకాశం లేకపోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ఇక్కడే ఉంటే స్థానికత ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని, ఉద్యోగుల సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
 
రిజర్వేషన్లలో తేడా.. 
విద్యాశాఖలో ఉపాధ్యాయ కేటగిరీలో దాదాపు వెయ్యి మంది టీచర్లు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వీరు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రంలో నివసిస్తున్నారు. పిల్లలతో సహా ఇక్కడే నివసించే అవకాశం ఉన్నప్పటికీ.. రిజర్వేషన్లలో వ్యత్యాసం వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు.. తెలంగాణలో ఓసీ కేటగిరీ కింద ఉన్నాయి. దీంతో రిజర్వేషన్ల కోసం సొంత రాష్ట్రంలో ప్రత్యేకంగా చదివించాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల విద్యను కనీసం ఏడేళ్ల పాటు ఒకేచోట చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తారు. అందువల్ల ఇప్పటికే నాలుగైదేళ్లు పొరుగు రాష్ట్రంలో చదివిన వా రిని మిగతా తరగతులు కూడా అక్కడ చదివించాల్సి వస్తోంది. అనంతరం అక్కడే కాలేజీ విద్య చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్నత విద్యనైనా ఇక్క డ చదవాలని వస్తే అప్పుడు స్థానికేతరులగా పరిగణి స్తూ సీట్ల కేటాయింపులో ఇబ్బందులు వస్తున్నాయి. 

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌లో సమస్యలు 
మరోవైపు ఉద్యోగులకు కీలకమైన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగుల తల్లిదండ్రులు వారి వృత్తిని నమ్ముకుని సొంత రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా తెలంగాణ పరిధిలోని ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఏపీలోని ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే అందుకు సంబంధించి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద బిల్లుల చెల్లింపులకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోంది. 

నాలుగేళ్లుగా పోరాటం 
తెలంగాణలో పనిచేస్తున్న స్థానికేతర టీచర్లు సొంత రాష్ట్రానికి పంపించాలంటూ దాదాపు నాలుగేళ్లుగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించారు. వాస్తవానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరిస్తేనే వారి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారిని రిలీవ్‌ చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు. ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళితే తప్ప ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టదు. దీంతో నాలుగేళ్లుగా తమ వినతికి మోక్షం కలగలేదంటూ నాన్‌లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆనంద్‌ కుమార్, మోహనరావు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement