పులిది కాదు.. ఆవుది..! | not a tiger that is cow | Sakshi
Sakshi News home page

పులిది కాదు.. ఆవుది..!

Published Sun, Mar 16 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

పులిది కాదు.. ఆవుది..!

పులిది కాదు.. ఆవుది..!

పులి చర్మం పట్టుబడిందంటూ ఇటు పోలీసులు, అటు అటవీశాఖాదికారులు నానా హంగామా చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చర్మాన్ని అటవీశాఖాధికారులకు అప్పగించారు. వారు కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత, ఈ చర్మం పులిదో కాదోనన్న అనుమానం రావడంతో దానిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కు పంపించారు.

అక్కడి అధికారులు పరిశీలించి, ‘ఇది పులి చర్మం కాదు. ఆవు చర్మం’ అని తేల్చారు. దానిని తిరిగి ఇక్కడి అటవీశాఖాధికారులకు పంపారు. తమ తొందరపాటుకు ఇటు పోలీసు, అటు అటవీశాఖాధికారులు నాలుక కరుచుకుంటున్నారు.

 ఈ నెల 11న చర్లలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. ఓ ద్విచక్ర వాహన చోదకుడిని అనుమానంతో అదుపులోనికి తీసుకుని విచారించారు. గన్నవరంలోని ఓ వ్యక్తి ఇంట్లో పులి చర్మం ఉందని అతని ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఎస్సై పి.సంతోష్ తన సిబ్బందితో ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంటి నుంచి, చర్మాన్ని స్వాధీనపర్చుకున్నారు. పైకి చూడ్డానికి పులి చర్మంలా ఉంది. దీనికి సంబంధించిన తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

‘ఇంకెక్కడైనా పులి చర్మాలు, పులి గోళ్లు దాచి ఉంచారా..?’ అంటూ తమదైన శైలిలో ప్రశ్నించారు. వీరి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో కేసు నమోదు చేశారు. అటవీశాఖాధికారులను పిలిపించి వారికి ఆ చర్మాన్ని అప్పగించారు. వారు దానిని తీసుకుని, ఆ తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

ఆ తరువాత, ‘ఈ చర్మం పులిదేనా..?!’ అనే అనుమానం రావడంతో, దానిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు పంపారు. అక్కడి అధికారులు దానిని పరిశీలించి, ‘ఇది పులిది కాదు.. ఆవు చర్మం’ అని ధ్రువీకరిస్తూ వెనక్కి పంపించారు. దీంతో.. పులి చర్మం పట్టుబడిందంటూ నానా హంగామా చేసిన పోలీసులు, అటవీశాఖాదికారులు నాలుక కరుచుకున్నారు. ఆవు చర్మాన్ని పులి చర్మంగా తయారుచేసి అమ్మేందుకు సిద్ధమయ్యారంటూ ఆ తొమ్మిదిమందిపై చీటింగ్ కేసు పెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement