బాబు హయాంలో రైతుల్ని పిట్టల్లా కాల్చారు : హరీష్
హైదరాబాద్ : ప్రశ్నోత్తరాలు కార్యక్రమంలో విద్యుత్‌పైనే ప్రశ్నలు ఉన్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయినా విపక్ష సభ్యులు సభను అడ్డుకోవటం సరికాదన్నారు. సభ నుంచి సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్లాలన్నది ప్రతిపక్ష సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని హరీష్ రావు అన్నారు. గజ్వేల్ ఘటనలపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
చంద్రబాబు హయంలో కరెంట్ అడిగిన రైతులను పిట్టల్లా కాల్చారని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చకు తాము వెనక్కి పోవటం లేదని, సభను అడ్డుకోవటానికి టీడీపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సభా సమయాన్ని వృథా చేయాలనుకోవటం లేదన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వొద్దని హరీష్ రావు అన్నారు.