సాక్షి, మంచిర్యాల : ‘బండ’ బాదుడుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. గృహ సిలిండర్ ఒక్కో దానిపై రూ.5 చొప్పున పెంచాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు మౌఖిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.17,13,500 భారం తప్పినట్లయింది. కేంద్ర ప్రభుత్వం గద్దెనెక్కి నెల కూడా గడవకముందే పెద్ద ఎత్తున రైలు చార్జీలు పెంచడంతో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థితిగతుల రీత్యా కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే దాదాపు 14 శాతానికిగా ైరె ల్వే చార్జీలను పెంచారు.
దీనిపై రాజకీయ పార్టీలతోపాటు ప్రజల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ తోపాటు పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఉంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ త్వరలో ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న ప్రభుత్వం రెండు మూడు నెలలపాటు పెంపును వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కారణాలు ఏవైనప్పటికీ ఈ నిర్ణయం ఉపశమన నాన్ని కలిగిస్తుందని గ్యాస్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నమోదిత వంటగ్యాస్ వినియోగదారులు 3,42,700 మంది ఉన్నారు. సిలిండర్‌పై రూ.5 చొప్పున పెంచి వసూలు చేస్తే నెలకు రూ.17,13,500 భారం సదరు లబ్ధిదారులపై పడేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ భారం తప్పినట్లయింది.
సిలిండర్‌పై వడ్డింపు వాయిదా!
Published Fri, Jun 27 2014 12:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement