అపరిశుభ్రత ఇక కను‘మరుగు’
- మహా సంకల్పానికి శ్రీకారం..
- రూపు మారనున్న నవాబుపేట
- 72 గంటల్లో 243 మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం
- ముమ్మరంగా ప్రారంభమైన పనులు
- పనుల్ని పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌రావు
హత్నూర: జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న ఆ గ్రామంలో ఎటుచూసినా అధికారులు.. ముమ్మరంగా పనులు.. మహా సంకల్పంలో నిమగ్నమైన గ్రామస్తులు.. వారిని ఉత్సాహపరుస్తూ మంత్రి హరీశ్‌రావు.. జిల్లాలో ఇప్పుడు నవాబుపేట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతిష్టాత్మకంగా 72 గంటల్లో 243 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి హత్నూర మండలంలోని నవాబుపేట గ్రామం నడుం బిగించింది. అదే సమయంలో ఇంకుడుగుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టుకుంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు 46 మండలాల ఎంపీడీఓలు, ఏఓలు.. అందరూ నవాబుపేటలోనే మకాం వేశారు. వీరంతా గ్రామంలోనే ఉండి నిర్మాణం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో ఎంపీడీఓృబందానికి 6 చొప్పున మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణ బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. ఈ టార్గెట్‌ను పూర్తిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక, గ్రామస్తులు తమ ఇంటి వద్దే ఉంటూ మరుగుదొడ్ల నిర్మాణంలో నిమగ్నమయ్యారు. 72 గంటల తరువాత నవాబుపేట వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా గుర్తింపు పొందనుంది.
311 ఇళ్లు.. 68 మరుగుదొడ్లు
నవాబుపేట గ్రామంలో 311 ఇళ్లు ఉన్నాయి. వీరిలో 68 కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు మరుగుదొడ్లు ఉన్నాయి. 243 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం విచారకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, పార్టీ ప్రముఖులు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు.
నిర్మాణం పనుల్లో తానూ తాపీ పట్టారు. లక్ష్యసాధన దిశగా గ్రామస్తులను, అధికారులను ఉత్సాహపరిచారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో జిల్లా యంత్రాంగాన్ని మొత్తం మోహరించి ప్రతిష్టాత్మకంగా లక్ష్యాన్ని చేపట్టామని మంత్రి చెప్పారు. ఈ రోజు (గురువారం) నుంచి 72 గంటల్లో.. అంటే మూడు రోజుల్లో వంద శాతం మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే మరుగుదొడ్లను వాడుకోవాలని ప్రజలకు సూచించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, ఇంకుడుగుంత నిర్మాణానికి రూ.4500 ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లక్ష్యాన్ని సాధిస్తే గ్రామానికి ఏది కావాలిస్తే అది సమకూరుస్తానని మంత్రి హామీనిచ్చారు.