ఎన్నారైలకు చెరువుల దత్తత! | NRI to the adoption of the pond! | Sakshi
Sakshi News home page

ఎన్నారైలకు చెరువుల దత్తత!

Published Tue, Oct 21 2014 1:17 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

NRI to the adoption of the pond!

పునరుద్ధరణ కోసం సహకారం తీసుకోవాలని టీ సర్కార్ నిర్ణయం
ఆర్థిక సహకారం కోసం విజ్ఞప్తి చేయనున్న సీఎం కేసీఆర్!
 

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యమ స్థాయిలో చేపట్టదలచిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎన్నారైలు సంపూర్ణ సహకారం అందించిన తరహాలో చెరువుల పునరుద్ధరణకూ తోడ్పడాల్సిం దిగా కోరాలని భావిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎవరైనా ఎన్నారైలు ముందుకొస్తే... వారికి చెరువులను దత్తత ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో చెరువుల అభివృద్ధిపై ఇప్పటికే పాలనాపరమైన ఏర్పాట్లను పూర్తిచేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం తొలివిడతలో పునరుద్ధరించే చెరువుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీనిని వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేసి, ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తోంది.
 
‘భాగస్వామ్యం’పై కసరత్తు

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అందరి భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్నారైల సహకారాన్ని తీసుకోవాలని.. వారు కోరిన చెరువులను దత్తతకు ఇచ్చి, ప్రభుత్వపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. పునరుద్ధరణ కింద చేపట్టే కట్టల పటిష్టం, పూడికతీత, ప్రధాన చెరువుల కాల్వల కింద ముళ్లపొదల తొలగింపు వంటి కార్యక్రమాలకు... మానవ వనరులతో పాటు జేసీబీలు, ట్రాక్టర్లు, పారలు, తట్టలు, గడ్డపారలు వంటివి భారీగా అవసరమవుతాయి. జేసీబీలు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చుతో పాటు మిగతా సామగ్రి కొనుగోలుకు నిధులు అవసరం. అయితే వీటిల్లో ఏ పనికోసం ఎన్నారైల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. చెరువుల పునరుద్ధరణకు ఎన్నారైల మద్దతు కోరుతూ.. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ మొదలవడానికి ముందే ‘మన ఊరు-మన చెరువు’ పేరిట పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వేగంగా టెండర్ల ప్రక్రియ

చెరువుల పునరుద్ధరణ కింద ఇచ్చే పనులకు టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా టెండర్ ప్రకటన వచ్చాక  పద్నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లు దరఖాస్తులు సమర్పించాలి. దీనిని ఏడు రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టెండర్ల మదింపును కూడా ఒక్క రోజులోనే పూర్తిచేయాలని భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement