బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
అమెరికాలో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆవిర్భావ సభలో ఎంపీ కవిత
రాయికల్ : బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐలంతా భాగస్వాములు కావాలని తెలంగాణ జాగృతి గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న కవిత ఆదివారం మినియా పోలిస్ నగరంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించగా హెలీకాప్టర్ ద్వారా కవితపై పూలవర్షం కురిపించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కవిత మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టేం దుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవాదులంతా ఒక్కటై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం అమెరికాలోని పలువురు ఎన్‌ఆర్‌ఐలు కవిత సమక్షంలో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో చేరారు. కార్యక్రమంలో సెల్ నాయకులు నాగేందర్ మహిపతి, భవాని రాం, నర్సారెడ్డి, జ్ఞానేశ్వర్, శ్రీధర్‌రెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.