ఊరికో నర్సరీ | Nursery To Each Village | Sakshi
Sakshi News home page

ఊరికో నర్సరీ

Published Fri, Aug 10 2018 1:41 PM | Last Updated on Fri, Aug 10 2018 1:41 PM

Nursery To Each Village - Sakshi

జిల్లాలో ఓ నర్సరీలో పెంచుతున్న మొక్కలు

సాక్షి, సిరిసిల్ల :  హరితహారం కార్యక్రమం నిరాటంకంగా సాగేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈమేరకు స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కొత్త పంచాయతీరాజ్‌ జట్టంలో నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంప కం, రక్షణ తదితర అంశాలను చేర్చింది. ఈ నెల 2 నుంచి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి రావడంతో ఈమేరకు గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు అధికారులు  ప్రణాళికలు రూపొందించారు.

గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, భూములు, రైతుల నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేం దుకు అవసరమైన మొక్కలు గ్రామ నర్సరీలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం 261 గ్రామ పంచాయతీల్లో 220 గ్రామ పం చాయతీల్లో నర్సరీల ద్వారా మొక్కలు పెం చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.   

స్థానికంగా ఉపయోగపడే మొక్కలతో..స్థానికంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా పండ్ల జాతుల మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండే మొక్కలు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనువుగా పెరిగే మొక్కలనే ఈ నర్సరీల్లో పెంపకానికి ఎంచుకుంటారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా మరిన్ని నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. 

ఒక్కో నర్సరీలో 20వేల నుంచి లక్ష వరకు మొక్కలు..

గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీల్లో స్థానికంగా ఉన్న స్థలం, నాటడానికి అవసరమయ్యే మొక్కలను బట్టి కనీసం 20 వేల నుంచి లక్ష వరకు వివిధ జాతుల మొక్కలను పెంచనున్నారు. ఈ నర్సరీలకు గ్రామాల్లో స్థల సేకరణే కీలకంగా మారనుంది. ఈనెల 15 లోగా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

నర్సరీలకు అవసరమైన స్థలం, ఫెన్సింగ్, బోరు మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని అక్టోబర్‌ నాటికి నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా  అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా మొక్కల పెంచేందుకు అవసరమైన విత్తన బ్యాగులను ఏర్పాటు చేసేందుకు బెడ్స్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాలిథిన్‌ బ్యాగుల్లో మట్టిని నింపి వాటిలో పండ్ల విత్తనాలు, టేక్‌ స్టంప్స్‌ నాటి అక్టోబర్‌ ఆఖరుకల్లా సిద్ధం చేయాల్సి ఉంది. 

స్థల సేకరణే ప్రధానం..

గ్రామాల్లో ఏర్పాటు చేసే నర్సరీలను ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ సమన్వయంతో నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు స్థల సేకరణయే ప్రధాన సవాల్‌గా మారింది. ప్రభుత్వ భూముల్లో కాకుండా ఎవరైనా జాబ్‌కార్డు ఉన్న ప్రైవేటు వ్యక్తులు స్థలం సమకూర్చితే వారికే నర్సరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ కూలీలను వినియోగించుకునేందుకు ప్రభుత్వ వీలు కల్పించింది.  

నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల సంరక్షణకు గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ కమిటీతో కూడిన హరితసైన్యాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచుతోపాటు ఔత్సాహికులైన రైతులు, యువకులు ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. నర్సరీలు, మొక్కల సంరక్షణ బాధ్యతలు వీరు చూసుకోవాల్సి ఉంటుంది. నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వమే చూసుకుంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement