- లక్షలాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేసిన అభ్యర్థులు
- ఓటర్లు ఎక్కువగా ఉంటే బంగారు ఆభరణాల పంపిణీ
- చైర్‌పర్సన్ అభ్యర్థుల ఖర్చు కోటిన్నర ?
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు తమ వార్డు పరిధిలో లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు ఏ మాత్రం వెనకాడకుండా పోటీపడుతూ డబ్బులు పంపిణీ చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.1000 నుంచి 2000 పైనే ఓటర్లకు ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రతి అభ్యర్థి రూ.5 లక్షలకు పైనే వార్డులో ఖర్చు చేసినట్లు సమాచారం.
చైర్‌పర్సన్ అభ్యర్థుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడంతో నీళ్లలాగా డబ్బులను అభ్యర్థులు ఖర్చు చేశారు. కొన్ని పార్టీల అభ్యర్థులు పోటీ ఎక్కువగా ఉన్న వార్డుల్లో డబ్బులతోపాటు వస్తువులను కూడా పంపిణీ చేశారు. ఒకే కుటుంబంలో ఓట్లుగా ఎక్కువగా ఉంటే ఇన్వర్టర్లు, వెండి నాణాలు, బంగారు ఆభరణాలు, ఇతరత్ర విలువైన వస్తువులను పంపిణీ చేసినట్లు సమాచారం. చీరలు, ఇతరత్రా వస్తువులను కూడా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.
చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ఉన్న వారు ఒక్కొక్కరు సుమారు కోటిన్నరకు పైగా అభ్యర్థులకు, ఇతరత్రా ఖర్చులు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండడంతో వారిని ముందుగానే తమవైపు మళ్లించుకునేందుకు వివిధ పార్టీల నాయకులు వారికి పెట్టుబడి కూడా పెడుతున్నారు.
ఒకటో వార్డులో చీరలు పంపిణీ చేస్తూ సీపీఎం నాయకుడు అరెస్టు కాగా, 23వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు మహబూబ్ అలీ డబ్బులు పంపిణీ చేస్తూ 8 వేల నగదుతో పోలీసులకు చిక్కాడు. 11వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వంగ ప్రమీళ కుమారుడు అశోక్ శుక్రవారం రాత్రి డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడగా అతడి వద్ద నుంచి 29 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానుకోటలో విచ్చలవిడిగా డబ్బులు, వస్తువులు పంపిణీ చేశారనడానికి అవే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఏ పార్టీకి పూర్తి మెజారీటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులక, అలాగే ఇతర పార్టీల్లో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులకు కూడా చైర్‌పర్సన్ అభ్యర్థులు పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఎన్నికల పుణ్యమా అని ప్రతి ఇంటికి వేలాది రూపాయలు అందాయి. ఇవేగాక మద్యం కూడా పంపిణీ చేశారు. వైన్స్‌షాపులు కూడా మూసివేయడంతో మద్యం కొరత, ఇతరత్రా సమస్యలు అభ్యర్థులకు ఎదురయ్యాయి. డబ్బులు ఇచ్చిన అభ్యర్థికల్లా ఓటేస్తానని మాట ఇచ్చిన ఓటరు చివరికి ఏ మీట నొక్కుతాడో వేచిచూడాలి.