సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో 1,414 ఓట్లున్నాయి. ఈ వార్డులో మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇరువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుం చి బరిలో ఉన్నారు. ఒక ఓటు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పలు కుతోంది. ఈ వార్డులో గెలవాలంటే కనీసం 500 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్ల కోసం సగటున ఓటుకు రూ.7 వేలు అనుకున్నా... 500 ఓట్లకు గాను రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే..’
కోటిన్నర అయినా తగ్గేది లేదు..
బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 1, 5, 20, 23 వార్డులు జనరల్‌కు రిజర్వయ్యాయి. ఇక్కడ తీవ్ర పోటీ ఉండటంతో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడేది లేదని పదవులు ఆకాంక్షిస్తున్న వారి శిబిరాలు తేల్చి చెప్పేస్తున్నాయి.
పండుగ ఖర్చు మాదే..
నగర శివార్లలోని ఓ ‘పట్టణ’సంస్థలో ఓ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్నికైన అభ్యర్థి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ వార్డు పరిధి లోని ఓటర్లు నారాజ్ కాకుండా ఏం చేశాడో తెలుసా.. సంక్రాంతి పండుగ పిండివంటలకు సరుకులు పంపాడు. 5 లీటర్ల నూనె, 5 కిలోల గోధుమపిండి, వీటికి అదనంగా మందు బాటిల్ పంపిణీ చేశాడు. ఇటు ఐటీ హబ్‌కు సమీపంలోని పురపాలికలోని ఓ వార్డులో మాజీ సర్పంచ్ భర్త పోటీ చేస్తున్నారు. ఈయ నే టీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్న నేత.. తన అన్న కుమారుడిని బరిలో దించా డు. బీజేపీ చైర్మన్ అభ్యర్థి.. తన సోదరుడిని నిలబెట్టారు. చైర్మన్ పదవి దక్కించుకోవ డంలో కీలకం కానున్న సంఖ్యాబలాన్ని దక్కించుకునేందుకు.. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు నేతలు వెనుకాడటం లేదు. జూనియర్ ఆర్టిస్టులుండే చిత్రపురి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు సినీ పరిశ్రమకు సంబంధించిన వారే పోటీ చేస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని శివార్లలో ఓటు కోసం రూ.2 వేల నోటు, 100 పైపర్స్ ఫుల్ బాటిల్ కావాల్సిందే అనే డిమాం డ్ అప్పుడే వినిపిస్తోంది. గత ఆదివారం నుంచే కాలనీ సంక్షేమ సంఘాలకు మంచి దావత్‌లు కూడా మొదల య్యాయి. సమయానికి సంక్రాంతి పండుగ కూడా రావడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్‌పర్సన్లు కావాలనుకుంటున్న వారు కాసులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం డివిజన్‌కు రూ.కోటి, కౌన్సిలర్ గిరీకి రూ.50 లక్షలు తగ్గకుండా ఖర్చు పెడతామంటూ చేస్తున్న హడావుడితో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంక్రాంతి పండుగ సందడి ఈ నెల 22 వరకు కనిపించనుంది.
డబ్బు.. డబ్బు!
స్థానికంగా మంచి పరువు ప్రతిష్టలు తీసుకొచ్చే ‘హాట్ సీట్ల’లో గెలుపు కోసం నగర శివార్లలో హార్డ్ క్యాష్ పోగవుతోంది. శివార్లలో ఉన్న బండ్లగూడ, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, మీర్‌పేట, బడంగ్‌పేట, బోడుప్పల్ నగరపాలక సంస్థలతో పాటు పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, శంకర్‌పల్లి, మణికొండ, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పోచారం, ఘట్‌కేసర్, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు, అనివార్యత కనిపిస్తున్నాయి. ఐటీ, రియల్ రంగాలకు పట్టుగొమ్మల్లాంటి ఈ పురపాలికల్లో పెత్తనం కోసం డబ్బున్న నేతలు తహతహలాడుతుండటం, ఆర్థికంగా మంచి బలమైన వారు రంగంలో ఉండటంతో కోనసీమ పందెపు కోడి బరి అప్పుడే రాజధాని శివారు మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది. టికెట్లు తెచ్చుకునేందుకే లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేతలు, ఎన్నికల్లో గెలిచేందుకు కాసులు కురిపించడానికి, ఖరీదైన గిఫ్టులు, తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రూ.50 లక్షలకు తగ్గకుండా రూ.4 కోట్ల వరకు ఒక్కో డివిజన్, వార్డుకు ఖర్చు పెట్టాలని, ఇక మేయర్లు, చైర్‌పర్సన్ పదవులు ఇస్తామంటే ఎన్ని కోట్లయినా తగ్గేదే లేదని తేల్చి చెప్పేస్తున్నారు.
దావత్‌లు షురూ..
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో జనరల్‌కు రిజర్వయిన ఓ వార్డులో ఇప్పటికే కాసు ల వర్షం కురుస్తోంది. ఎన్నికలకు 10 రోజుల సమయముండగానే దావత్‌లు మొదలయ్యా యి. ఈ వార్డులో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచ నా. ఇంజాపూర్ మున్సిపాలిటీలోని ఓ వార్డుకు ఇద్దరు బిగ్‌షాట్స్ పోటీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి చిట్‌ఫండ్ వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బడాబాబు కాగా, మరో అభ్యర్థి పౌల్ట్రీ వ్యాపా ర దిగ్గజం. గతంలోనూ ఈ రెండు కు టుంబాల మధ్య హోరాహోరీగా స్థానిక పోరు జరగ్గా.. ఈసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లపై ‘ఇక కనకవర్షమేనని ప్రచారం జోరుగా సాగుతోంది.
నగదు ‘హవా...లా’
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న ఎన్నికల కోలాహలం ‘హవాలా’దారులు కూడా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు అవసరం కావడంతో లిక్విడ్ క్యాష్ దొరకడం గగనమైపోయింది. మనీ డిజిటలైజేషన్ కావడం, రూ.2 వేల నోట్లు మార్కెట్లో తగ్గడం, ఖర్చు బ్యాంకు అకౌంట్ ద్వారానే చేయాల్సి ఉండటంతో నగదు ఎక్కడి నుంచి తేవాలి.. ఎలా ఖర్చుపెట్టాలన్నది అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో అయితే అప్పుడే హవాలా మార్గాలను వెతకడం కూడా ప్రారంభించేశారు. కార్పొరేటర్ నుంచి మేయర్లు, చైర్‌పర్సన్లు కావాలంటే నగదు కోట్లలో కావాల్సి రావడంతో హవాలా మార్గాలను ఎంచుకునే పనిలో పడిపోయారు కొందరు అభ్యర్థులు.
Comments
Please login to add a commentAdd a comment