గెలుపు వీరులెవరు? | Political Parties Searching Winning Candidates In Municipal Elections | Sakshi
Sakshi News home page

గెలుపు వీరులెవరు?

Published Tue, Jan 7 2020 2:25 AM | Last Updated on Tue, Jan 7 2020 2:25 AM

Political Parties Searching Winning Candidates In Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు మొదలుపెట్టాయి. వార్డులు, చైర్మన్లు, మేయర్ల స్థానాల రిజర్వేషన్లు కూడా ఖరారు కావడం, రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కోసం పరుగులు పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొనగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి కూడా ఆశావహులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అలాగే బీజేపీ, టీజేఎస్, వామపక్షాలు, టీడీపీ, ఇతర పార్టీలు కూడా దొరికిన చోట్ల అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే వచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల గడువున్న నేపథ్యంలో బుధవారం నాటికి అన్ని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ ఆచితూచి...
మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కూడా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట్ల, ఇద్దరు కీలక నేతలు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే పార్టీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో సామాజిక, ఆర్థిక అంశాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థిని ఎంపిక చేశాక సమస్యలు రాకూడదనే కోణంలో గులాబీ నేతలు దృష్టి సారించారు. పోటీ ఎక్కువైతే అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంటుందని, అందువల్ల అసమ్మతి రాకుండా సమన్వయంతో వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక గురువారం వరకు జరిగే కొనసాగుతుందని సమాచారం. ఇక మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లు ఎవరనే విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇన్‌చార్జులతో ఇబ్బంది లేకుండా..
ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్న నేతలతోపాటు అధికార పార్టీలో లేని తటస్థులు, ఆ పార్టీలో టికెట్లపై ఆశలు లేనివారు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. బీజేపీ ప్రాబల్యం కొంత కనిపిస్తున్న చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక సజావుగానే జరిగే అవకాశాలున్నా మిగిలిన చోట్ల పోటీ ఉండటంతో జాగ్రత్తగా ఎంపిక కసరత్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షుల సమన్వయంతో స్థానిక నేతలు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అయితే టీఆర్‌ఎస్‌ టికెట్లు రాని అసంతృప్తులకు గాలం వేసే కోణంలో కాంగ్రెస్‌ కసరత్తు కొనసాగుతోంది.

ఎంపీలున్న చోట్ల ఎక్కువగానే..
బీజేపీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఆశావహులు ముందుకొస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓట్లు పడతాయనే ఆశతో ఆ పార్టీ టికెట్ల కోసం కూడా డిమాండ్‌ కనిపిస్తోంది. అయితే లోక్‌సభ సభ్యులున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమలనాథులకు మంచి డిమాండే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీలు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపిక ప్రారంభించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఎదుర్కొని దీటుగా నిలబడేందుకు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

బరిలో ఎంఐఎం సైతం...
ఎంఐఎం కూడా మున్సిపల్‌ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాలతోపాటు ఆయా జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో వీలున్న ప్రతిచోటా అభ్యర్థులను నిలబెట్టే ప్రక్రియలో నిమగ్నమైంది. వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలు కూడా తమకు వీలున్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి. మొత్తంమీద బుధవారం రాత్రికల్లా అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యే అవకాశముందని ఆయా పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement