
నేడే పోలింగ్
- తుదిఘట్టానికి చేరిన మునిసిపల్ ఎన్నికలు
- 115 వార్డుల్లో 1,390 మంది పోటీ.. 1,63,068 మంది ఓటర్లు
సాక్షి, హన్మకొండ: మునిసిపల్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు.. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలకు సంబంధించి ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. వాయిదా పడిన వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మినహా మిగతా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 116 వార్డులు ఉంన్నాయి.
జనగామలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో... మిగిలిన 115 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,390 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ ఏరాపట్లను జిల్లాయంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయగా... 169 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) అందుబాటులో ఉంచింది. 1,005 మంది ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ పూర్తికాగానే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరచనున్నారు. ఆదివారం జరిగే పోలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ ఒకటో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు.
ఓటర్ల వివరాలు
రెండు మునిసిపాలిటీలు, మూడు నగరపంచాయతీల పరిధిలో 1,63,068 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 82,265 మంది, మహిళలు 80,794 మంది ఉన్నారు. మహబూబాబాద్ మునిసిపాలిటీలో అత్యధికంగా 40,164 మంది ఓటర్లు ఉండగా... పరకాల నగర పంచాయతీలో అతి తక్కువగా 20,729 మంది ఓటర్లు ఉన్నారు.
జనగామలో పోటాపోటీ
జనగామ మునిసిపాలిటీ ఎన్నికల్లో 27 వార్డుల నుంచి అత్యధికంగా 408 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భూపాలపల్లి నగరపంచాయతీలో 20 వార్డుల నుంచి అతి తక్కువగా 171 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.