ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. సమయం మరో ఐదు రోజులే ఉండడంతో రాజకీయ పక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు మనీ, మద్యం గ్రామాలకు తరలిస్తున్నారు. పకడ్బందీగా నిఘా ఉన్నా కళ్లుగప్పి అడ్డదారుల్లో జిల్లాకు చేరవేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ.18లక్షలకు పైగా నగదు, మద్యం పట్టుబడింది.
సాక్షి, యాదాద్రి : ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మరో ఐదు రోజులే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ప్రలోభాలకు తెరలేపాయి. మనీ, మద్యం సరఫరాకు నడుంకట్టాయి. భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. సర్వేల పేరుతో గ్రామాల్లో తమ అనుచరులను దించారు. సుదూర ప్రాంతాల్లో ఉండే బంధువులను రప్పించుకొని వారితో డబ్బు పంపిణీ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే డబ్బు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా పలు మార్గాల్లో జిల్లాకు యథేచ్ఛగా నగదు, మద్యం తరలిస్తున్నారు. హైదరాబాద్ శివారున ఉండడంతో డబ్బుల మూటలు చాటుమాటున గ్రామాలకు చేరుతున్నాయి.
ఓట్ల వారీగా డబ్బుల పంపిణీ!
గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డదారులకు బార్లా తెరిచాయి. పలు చోట్ల ఇప్పటి నుంచే ఓటర్లను కలుస్తూ డబ్బుల పంపిణీ ప్రారంభించారు. గతంలో ఎన్నికలకు ఒకటి రెం డు రోజుల ముందు మాత్రమే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే వారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్డుల వారీగా తమ పార్టీ కార్యకర్తలను, వివిధ వర్గాల అనుచరులను రంగంలోకి దింపి గుట్టు చప్పుడు కాకుండా డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు స్త బ్ధతగా ఉన్న పలు నియోజకవర్గాల అభ్యర్థులు డబ్బుల కట్టలతోనే గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఒక ఎ త్తు అయితే డబ్బులు పంపిణీ కార్యక్రమం మరొక ఎత్తుగా అభ్యర్థులు భావిస్తున్నారు. ఓటుకు రూ. 500నుంచి రూ. రూ.1,000 చొప్పున ఇంట్లో ఎ న్ని ఓట్లు ఉంటే వారందరికీ డబ్బు చేరవేసేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డబ్బులు తీసుకున్న ఓటర్లు తప్పకుండా ఓట్లు వేస్తారని, దీంతో తమ గెలుపు ఖాయమని, డబ్బులు చేరవేయడమే పెద్ద పనిగా పలు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇలా అయితే జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి æ నియోజవర్గాల పరిధిలో ఓటర్లకు గడిచిన రెండు రోజులగా రూ.కోట్లలో పంపిణీ జరుగవచ్చని రాజకీయ పరిశీలకుఉ అంచనా వేస్తున్నారు. ప్రధానంగా భువనగిరి, మునుగోడు, ఆలేరులో వరుసగా మూడు స్థానాల్లో డబ్బుల పంపిణీలో నిలుస్తాయని రాజకీయ విశ్లేషణ జరుగుతోంది.
ఉపాధి కల్పించిన ఎన్నికలు
ఈ సారి ఎన్నికలు పేద, మధ్య తరగతి ప్రజలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాయి. తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో వ్యవసాయ పనులు లేకు కూలీలు ఇళ్లవద్దనే ఉంటున్నారు. ఈ సీజన్‌లో పత్తి తీయడం కోసం కూలీలకు డిమాండ్ అధికంగా ఉండేది. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో కూలీలకు చేతి నిండా పని లేకుం డా పోయింది. ఈ సమయంలో వచ్చిన ఎన్నికల ప్రచార సభలకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నా రు. ఒక్కొక్కరికి రూ.200 వరకు ఇచ్చి సభలకు తీసుకువస్తున్నారు. దీంతో కూలీల చేతినిండా ఖర్చులకు డబ్బులు వచ్చిచేరుతున్నాయి.
ఇప్పటి వరకు పట్టుబడిన నగదు రూ.17,58,610
ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. అయినా నగదు, మద్యం పట్టుబడుతోంది. మేడ్చల్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం,మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాలకు యాదాద్రి జిల్లా మీదుగా వెళ్లాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేశారు. ఆలేరు, గూడూరు, చౌటుప్పల్, తూఫ్రాన్‌పేటలో ఇప్పటి వరకు రూ.15,54,110 పట్టుకున్నారు. బీబీనగర్ మండలం గూడూరు చెక్‌పోస్టు వద్ద నవంబర్ 14వ తేదీన ఉదయం రూ.1.63లక్షలు, సాయంత్రం 1.01లక్షలు పట్టుకున్నారు. నవంబర్ 15న పోచంపల్లిలో రూ.1.04లక్షలు, నవంబర్ 17న పోచంపల్లిలో రూ.2.50లక్షలు, నవంబర్ 1న మోత్కూర్‌లో రూ.5లక్షలు, నవంబర్ 20న ఆలేరులో రూ.35,610, నవంబర్ 29న చౌటుప్పల్‌లోని తూఫ్రాన్‌పేట వద్ద రూ.4లక్షలు పట్టుకున్నారు. అదే విధంగా శుక్రవారం రాత్రి బీబీనగర్ మండలం భట్టుగూడెంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డుగుండా వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 2లక్షల 3,500 నగదు పట్టుబడింది.
Comments
Please login to add a commentAdd a comment