భక్తుల కల్పవల్లి.. ఎల్లమ్మ తల్లి | Officers who have completed arrangements for polepalli yellamma jatara | Sakshi
Sakshi News home page

భక్తుల కల్పవల్లి.. ఎల్లమ్మ తల్లి

Published Wed, Feb 7 2018 6:28 PM | Last Updated on Wed, Feb 7 2018 6:28 PM

Officers who have completed arrangements for polepalli yellamma jatara - Sakshi

విద్యుద్దీపాల వెలుగుల్లో అమ్మవారి ఆలయం

మావురాల మాతల్లిగా.. పేదింటి ఎల్లమ్మగా.. పసుపు బండారు తల్లిగా.. పేదల ఇలవేల్పుగా..  పోలెపల్లి ఎల్లమ్మ దేవత.. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. కొన్ని శతాబ్దాలుగా భక్తులు ఆరాధిస్తున్నారు. పోలెపల్లి తల్లి దర్శనానికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  బొంరాస్‌పేట మండలం శివారులోని మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం పోలెపల్లి గ్రామంలో ఎల్లమ్మమాత కొలువై ఉన్నారు. ఈనెల 8  నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున  బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.
    
బొంరాస్‌పేట(కొడంగల్‌): దేవస్థానం ఏర్పాటుకు ముందునుంచి ఓ పూర్వగాథ ప్రచారంలో ఉంది. 5 శతాబ్దాల క్రితం.. ఈ దేవస్థానం స్థలంలో రైతు గడెంపనులు చేస్తున్నారు. భూమి చదును చేసేందుకు తన గుంటకపై ఓ రాతిని ఉంచి, పనులు పూర్తిగానే సాయంత్రం ఆ రాతిని గట్టున ఉంచి వెళ్లేవారట. మరునాడు వచ్చేసరికి గట్టున ఉంచిన రాయి పొలం నడిబొడ్డున ఉండటం చూసి ఆశ్చర్యపోగా, ఇలా పలుమార్లు జరుగగా రైతు పరికించి చూశాడు. ఒకనాడు రైతుకు.. ‘మహిమగల మావురాల తల్లిని నేను. ఇక్కడే స్థిర నివాసముండి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటాను. ఆలయం నిర్మించు భక్తుడా’.. అంటూ రైతుకు కలలో వచ్చి ఎల్లమ్మ దేవత చెప్పిందట. నాడు చిన్నపాటి గుడిని ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఇంతింతై దేవస్థానంగా లక్షలాది భక్తుల పూజలందుకోవడం విశేషం.

బోనపు నైవేద్యాలు
జాతరలో ప్రత్యేకంగా బోనాలు, బ్యాండుమేళాలు, డప్పులతో, పూనకాలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. నుదుటికి పసుపు, కుంకుమ తిలకాలు, తెల్లని, పసుపురంగు వస్త్రాలు ధరించి తమ ప్రత్యేక భక్తిని చాటుకుంటారు. బారులుతీరుతూ, గుంపులు గుంపులుగా బోనాల శ్రేణులు దేవస్థానంలో సందడి చేస్తాయి. ఈజాతరలో బోనాల పూజలు ప్రత్యేకం.

షోలాపూర్‌ భక్తుల ప్రత్యేకం..
జాతర భ్రహ్మోత్సవాలకు ప్రతియేటా తెలంగాణ ప్రాంతంలోని భక్తులతోపాటు మçహారాష్ట్ర, కర్ణాటక, బీవండి, షోలాపూర్‌ తదితర ప్రాంత్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సకుటుంబంగా వచ్చి పూజల్లో, సిడే కార్యక్రమాల్లో షోలాపూర్‌ భక్తుల సేవలు, పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి.

వారంలో మూడు రోజులు..
ఆలయంలో జాతర సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి ప్రత్యే పూజలు, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

సిడే ఘట్టమే ప్రధానం..
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం సాయంత్రం జరిగే ‘సిడే’ ఘట్టం ప్రత్యేకను చాటుతోంది. ఈ ఘట్టమే మావురాల తల్లికి మకుటంగా నిలుస్తోంది. దీన్ని తిలకించి తరించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన సిడేపై తొట్లాలలో ఉంచి దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గవ్వల బండారు చల్లుతూ భక్తులు తమమొక్కులు తీర్చుకుంటారు.

జాతర  కార్యక్రమాలు
ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. గురువారం రాత్రి పల్లకీసేవ (వేంచేపు కార్యక్రమం) కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో ఊరిలో నుంచి ఆలయానికి అమ్మవారు చేరుకుంటారు. శుక్రవారం జాతర ప్రధానఘట్టమైన సిడే(రథోత్సవం) కార్యక్రమం సాయంత్రం ఉంటుంది. శనివారం ఉదయం తేరులాగే కార్యక్రమం, ఆదివారం భక్తుల ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని దేవాలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి తెలిపారు.

అమ్మవారి మహిమ..
పాపాలను రూపుమాపే ‘పసుపు బండారు’ ఎల్లమ్మ దేవత జాతరకు శాస్త్రీయ నేపథ్యం ఉందని చెప్పవచ్చు. పూర్వం వైద్యశాస్త్రం ఇంతగా అభివద్ధి చెందని కాలంలో ఆయుర్వేద వైద్యమే అందుబాటులే ఉండేది. తట్టు, మసూచి వంటి చర్మవ్యాధులకు వేపాకులు, పసుపు చికిత్సకు ఉపయోగించడం పరిపాటిగా ఉండేది. గ్రామదేవతల్లో ఒకరైన ఎల్లమ్మ ఇలాంటి వ్యాధులకు చికిత్స చేసేదనే నానుడికి ఎల్లమ్మ జాతరలో వేప ఆకులతో పూనకాలు, పసుపు బండారుతో పూజలు చేయడం అందుకు నిదర్శనం. అమ్మవారి పసుపు బండారు, వేపాకుల ధరింపుతో రోగాలు, పాపాలు తొలగిపోతాయని అమ్మవారి భక్తుల విశ్వాసం. అప్పటినుంచి పోలెపల్లి ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తున్నారు.
 
మరో జోగులాంబ దేవస్థానం
ఆలయ అభివృద్ధి కోసం గతేడాది దేవాదాయ శాఖ నుంచి రూ. 25లక్షలు మంజూరుకాగా భక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం, మండపాలు నిర్మించాం. అమ్మవారి ఆశీర్వాదంతో నా సొంత ఖర్చులతో భక్తులకు విశాలమైన ప్రాంగణంతోపాటు ఆలయ శిఖరం కొత్త హంగులతో అలంపూర్‌ జోగిలాంబను తలపించే విధంగా నిర్మించాం. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించనున్నాయి.  – ముచ్చటి వెంకటేశ్, ఆలయకమిటీ చైర్మన్,

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement