
మామా అల్లుళ్లే సూత్రధారులు!
- ఆర్‌ఆర్‌సీ పరీక్షపత్రం లీక్, ‘హైటెక్ కాపీయింగ్’పై కదులుతున్న డొంక
- పరారీలో మామ మచ్ఛేందర్, అల్లుడు మహేందర్
- మహారాష్ట్రలోనూ ఇదే తంతు సాగించినట్లు వెల్లడి
- నిందితుల్లో తొమ్మిది మంది రైల్వే ఉద్యోగులు
- ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించిన దుకాణం సీజ్
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన ఆర్‌ఆర్‌సీ (రైల్వే నియామక విభాగం) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో డొంక కదులుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా ఈ ముఠా మహారాష్ట్రలో కూడా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నవంబర్‌లో ఆర్‌ఆర్‌సీ రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల కోసం ఐదు దఫాలుగా 3.91 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించింది.
చివరగా నవంబర్ 30న జరిగిన పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు గుట్టు రట్టు చేసి పదిమంది అభ్యర్థులు, వారికి సహకరించిన ఇరవై మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ మల్కాజ్‌గిరి ఇన్‌స్పెక్టర్ శేఖర్‌గౌడ్ సోమవారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడీషియల్ కస్టడీ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసుల విచారణలో నిందితులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
గత నెల 23న (ఆదివారం) నాలుగో దఫా పరీక్షల్లో కూడా ఇదే పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రశ్నపత్రం లీక్ చేసి అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని తేల్చింది. ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్న రైల్వే ఎలక్ట్రానిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మచ్ఛేంద్ర మౌలాలిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం మాదిరిగానే మహారాష్ట్రలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తన అల్లుడు మహేందర్‌తో కలసి ఈ మొత్తం వ్యవహారం నడిపించాడు. వీరికి రెండు పరికరాలు కీలకంగా మారాయి.
ఒకటి.. మెడలో వేసుకునే తాయెత్తు మాదిరిగా తయారు చేసిన ‘సిమ్’ కార్డులు కలిగిన అతి చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ (సెల్‌ఫోన్), రెండోది..చెవిలో పెట్టుకునే ‘వైర్‌లెస్ ఇయర్‌ఫోన్’. ఈ అత్యాధునిక పరికరాలను నిందితులు బేగంపేటలోని ఓ సెల్‌ఫోన్ దుకాణం నుంచి కొనుగోలు చేశారని తేలింది. ఈ దుకాణంపై పోలీసులు సోమవారం దాడి చేసి, సీజ్ చేశారు. ఇక్కడి నుంచి కీలక సాక్ష్యాధారాలను (సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్‌లు) పోలీసులు సేకరించారు. దుకాణం యజమాని పరారీలో ఉన్నాడు.
ఈ పరికరాలను ఢిల్లీ, ముంబాయి నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిందితుల వద్ద లభించిన 27 సిమ్‌కార్డుల వివరాలపైనా దర్యాప్తు సాగుతోంది. నిందితులను తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని మల్కాజ్‌గిరి ఏసీపీ ఎం.రవిచందన్‌రెడ్డి తెలిపారు. సూత్రధారులైన మచ్ఛేందర్, మహేందర్‌ల కోసం గాలిస్తున్నామన్నారు.
మామా అల్లుళ్ల పథకం ఇలా...
మచ్చేందర్ లాలాగూడలోని లోకోషెడ్‌లో గ్రేడ్ వన్ టెక్నీషియన్‌గా, మహేందర్ తాండూరు రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వీరు.. కొందరు రైల్వే ఉద్యోగులు, నిరుద్యోగులతో ముఠా తయారు చేశారు. ప్రశ్నపత్రం బయటకు రావడానికి మచ్ఛేందర్ పరీక్ష జరిగే రోజు పరీక్షా సెంటర్ వద్దకు తనతోపాటు అల్లుడు మహేందర్‌ను వెంటబెట్టుకెళ్లేవాడు. అక్కడి ఇన్విజిలేటర్లకు స్క్వాడ్‌గా పరిచయం చేసుకొని పరీక్ష హాల్‌లోకి వెళ్లేవాడు.
ఆ సమయంలో మహేందర్ తన ఫోన్‌లో ప్రశ్నపత్రం ఫొటో తీసి బయట ఉన్న వ్యక్తికి పంపేవాడు. ప్రశ్నపత్రం అందుకున్న వ్యక్తి దానికి జిరాక్స్ తీయించి నలుగురైదుగురు నిపుణులైన వారితో జవాబులు తయారుచేయించేవాడు.వాటిని సెల్ ఫోన్లతో పరీక్షహాల్లో అభ్యర్థులకు చేరవేసేవారు. పట్టుబడినవారిలో ఏడుగురు విద్యార్థులు, గృహిణి, ఏడుగురు రైల్వే ఉద్యో గులున్నారు. విద్యార్థుల్లో ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్, బీఈడీ చదువుతున్న వారు, రైల్వే ఉద్యోగుల్లో జూనియర్ ఇంజనీర్, ముగ్గురు లోకోషెడ్ ఉద్యోగులు, ఇద్దరు కళాసీలు, పంప్ ఆపరేటర్ ఉన్నారు.
ఆర్‌ఆర్‌సీ పరీక్షల రద్దు యోచన లేదు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడి
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌పై దక్షిణమధ్య రైల్వే అధికారికంగా స్పందించింది. నవంబర్ నెలలో 5 విడుతలుగా జరిగిన ఆర్‌ఆర్‌సీ పరీక్షలను రద్దు చేసే యోచన లేదని, 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన మాస్ కాపీయింగ్‌పై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కె.సాంబశివరావు తెలిపారు. హైటెక్ తరహాలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం తన చాంబర్‌లో ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వివిధ విభాగాల నుంచి కూడా నివేదికలను తెప్పిస్తున్నట్లు చెప్పారు.