యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతిబింబిస్తూ ప్రతి యేటా నిర్వహించే సదర్ పండుగలో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్ షా’దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సదర్ ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఈ నెల 21న ప్రభుత్వం సదర్‌ను నిర్వహించనుంది. అంతకు ముందు రోజు 20న నగరంలోని వివిధ ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరుగుతాయి. ప్రతి యేడాదిలాగే ఈ సారీ దేశంలోనే బాగా పేరుపొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు జిల్లాల్లో సైతం నిర్వహించడం గమనార్హం.
– సాక్షి, హైదరాబాద్
మంత్రి తలసాని పర్యవేక్షణ..
ఈ నెల 21న అధికారికంగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహించనున్న నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యాదవులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పాటలు, కళా ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21వ తేదీ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
షెహన్‌షా ప్రత్యేకతలు
పేరు: షెహన్‌షా
వయస్సు: నాలుగున్నర ఏళ్లు (2013లో జన్మించింది)
బరువు: 1,500 కిలోలు
మార్కెట్ ధర: సుమారు రూ.25 కోట్లు
షెహన్‌షా యజమాని: అహ్మద్ ఆలంఖాన్,
సత్తర్‌బాగ్ డెయిరీఫామ్
ఆహారం: ఉదయం, సాయంత్రం 20 లీటర్ల చొప్పున పాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు బాదం, కాజు, పిస్తా, కర్జూరా వంటి 5 కిలోల మిశ్రమ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు 100 యాపిల్స్, ఒక కిలో నల్లబెల్లం ఇవికాకుండా దాణా, సరిపడా నీళ్లు రోజుకు మూడుసార్లు స్నానం, మూడుసార్లు ఆవనూనెతో మర్దన
ఆకట్టుకోనున్న షెహన్‌షా...
ఈ సారి సదర్ ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్‌షా’కనువిందు చేయనుంది. రెండు, మూడేళ్లుగా హర్యానాకు చెందిన జాతీయస్థాయిలో విశేష గుర్తింపును పొందిన దున్నపోతు ‘యువరాజు’ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా హర్యానాకు చెందిన యువరాజుకే పుట్టిన ‘ధారా,’మరో దున్న ‘రాజు’తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ‘మహరాజ్’ను కూడా ప్రదర్శిస్తారు. అలాగే ‘షెహన్‌షా’సైతం హర్యానాకు చెందిన మరో దున్న ‘రుస్తుం’సంతతేనని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్‌లోని సత్తర్‌బాగ్‌లో ఈ దున్నను ప్రదర్శించారు. ‘‘ప్రతి సంవత్సరం హర్యానా, పంజాబ్‌ల నుంచి దున్నలను తెప్పించేవాళ్లం. కానీ మొట్టమొదటిసారి హైదరాబాద్‌కే చెందిన ముర్రా జాతి దున్న షెహన్‌షా ఈ సారి ప్రదర్శనలో పాల్గొనబోతోంది’’అని చెప్పారు హరిబాబు.
Comments
Please login to add a commentAdd a comment