Animal Wealth
-
పశుసంపద పైపైకి
ఆత్మకూరు(పరకాల): జిల్లాలో పశుగణన పూర్తయ్యింది. 2012 సంవత్సరంలో జరిగిన గణనతో పోలిస్తే ఈసారి పశువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ గొర్రెల పథకంతో 12,832 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. దీంతో గొర్రెల సంఖ్య పెరిగింది. అలాగే మిగతా జాతి పశువులు, కోళ్ల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాలో ఆవులు, ఎద్దులు 1,13,431, గేదెలు, దున్నపోతులు 1,42,582, గొర్రెలు 7,92,050, మేకలు 1,22,208, పందులు 8,826, కుక్కలు 2,464, కుందేళ్లు 32, కోళ్లు 20,58,459, బాతులు 1,418 ఉన్నాయి. కేసీఆర్ స్కీమ్‌తో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకంతో లబ్ధిదారులకు గొర్రెలు అందాయి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు అందచేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 21గొర్రెల చొప్పున అందజేశారు. ఫలితంగా గొల్లకురుమలు ఉపాధి పొందడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకుంటున్నారు. ప్రోత్సాహకాలతో.. ప్రభుత్వం పాడిపరిశ్రమలో వివిధ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. దీంతో రైతులు పశువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. డెయిరీలకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఉత్సాహవంతులు డెయిరీలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. స్త్రీనిధి రుణాలతో.. మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాలు రూ.50వేల నుంచి లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. స్వయం ఉపాధిలో భాగంగా మహిళలు గేదెలు కొనుగోలు చేసి పాలను స్థానిక డెయిరీలకు సరఫరా చేస్తున్నారు. రోజువారీ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ వృద్ధి చెందుతోంది. పశుపోషణ వైపు యువత చూపు.. నిరుద్యోగ యువత పశుపోషణ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇంటిదగ్గరే ఉండి స్వయం ఉపాధి పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా కోళ్ల పెంపకం, పశుపెంపకం తదితర పాడి పరిశ్రమపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారాలను నెలకొల్పి కోళ్లను పెంచి ఉపాధి పొందుతున్నారు. -
షహర్ కీ ‘షెహన్షా’
యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతిబింబిస్తూ ప్రతి యేటా నిర్వహించే సదర్ పండుగలో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్ షా’దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సదర్ ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఈ నెల 21న ప్రభుత్వం సదర్‌ను నిర్వహించనుంది. అంతకు ముందు రోజు 20న నగరంలోని వివిధ ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరుగుతాయి. ప్రతి యేడాదిలాగే ఈ సారీ దేశంలోనే బాగా పేరుపొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు జిల్లాల్లో సైతం నిర్వహించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ మంత్రి తలసాని పర్యవేక్షణ.. ఈ నెల 21న అధికారికంగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహించనున్న నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యాదవులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పాటలు, కళా ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21వ తేదీ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. షెహన్షా ప్రత్యేకతలు పేరు: షెహన్షా వయస్సు: నాలుగున్నర ఏళ్లు (2013లో జన్మించింది) బరువు: 1,500 కిలోలు మార్కెట్ ధర: సుమారు రూ.25 కోట్లు షెహన్షా యజమాని: అహ్మద్ ఆలంఖాన్, సత్తర్బాగ్ డెయిరీఫామ్ ఆహారం: ఉదయం, సాయంత్రం 20 లీటర్ల చొప్పున పాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాదం, కాజు, పిస్తా, కర్జూరా వంటి 5 కిలోల మిశ్రమ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు 100 యాపిల్స్, ఒక కిలో నల్లబెల్లం ఇవికాకుండా దాణా, సరిపడా నీళ్లు రోజుకు మూడుసార్లు స్నానం, మూడుసార్లు ఆవనూనెతో మర్దన ఆకట్టుకోనున్న షెహన్షా... ఈ సారి సదర్ ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్షా’కనువిందు చేయనుంది. రెండు, మూడేళ్లుగా హర్యానాకు చెందిన జాతీయస్థాయిలో విశేష గుర్తింపును పొందిన దున్నపోతు ‘యువరాజు’ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా హర్యానాకు చెందిన యువరాజుకే పుట్టిన ‘ధారా,’మరో దున్న ‘రాజు’తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ‘మహరాజ్’ను కూడా ప్రదర్శిస్తారు. అలాగే ‘షెహన్షా’సైతం హర్యానాకు చెందిన మరో దున్న ‘రుస్తుం’సంతతేనని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్‌లోని సత్తర్‌బాగ్‌లో ఈ దున్నను ప్రదర్శించారు. ‘‘ప్రతి సంవత్సరం హర్యానా, పంజాబ్‌ల నుంచి దున్నలను తెప్పించేవాళ్లం. కానీ మొట్టమొదటిసారి హైదరాబాద్‌కే చెందిన ముర్రా జాతి దున్న షెహన్షా ఈ సారి ప్రదర్శనలో పాల్గొనబోతోంది’’అని చెప్పారు హరిబాబు. -
అద్దెకు ఎద్దు..!
* జత ఎడ్లకు నెలకు రూ.10 వేలు * కరువులో పశుపోషణ కష్టమవడంతోనే.. అంటున్న రైతులు బాల్కొండ: ఖరీఫ్‌లో విత్తనాలను విత్తేందుకు అద్దె ఎడ్ల కోసం రైతులు ముందస్తుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గురువారం జరిగిన పశువుల సంతలో క్రయ విక్రయాలకంటే అద్దె వ్యవహారాలే నడిచాయి. అధిక శాతం రైతులు అద్దె ఎడ్ల కోసం వ్యాపారులకు అడ్వాన్సు ఇచ్చారు. కరువు కాలంలో పశువులను పోషించడం కష్టంగా మారడంతో రైతులు పశు సంపదను విక్రయించుకున్నారు. అంతేగాక రైతులు ఎడ్లకు బదులుగా యంత్రాలను వినియోగిస్తున్నారు. ఖరీఫ్ లో సాగుచేసే పసుపు పంటకు ఎడ్ల అవసరం ఏర్పడుతుంది. పసుపు విత్తేందుకు ఎడ్లతో దుక్కి దున్నిస్తారు. ఇద్దరు, ముగ్గురు రైతులు కలసి రెండు ఎడ్లను నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా మూడేళ్లుగా సాగుతోంది. నిబంధనలివే: రెండు ఎడ్లను అద్దెకు తీసుకునే రైతు.. వాటి ధర మార్కెట్లో ఎంత పలుకుతుందో అంత వ్యాపారి వద్ద డబ్బు నిల్వ ఉంచాలి. ఎడ్లకు మేత ఆ రైతే చూసుకోవాలి. వ్యాపారి ఎడ్లను రైతుకు ఎలా అప్పగించాడో అలానే అప్పగించాలి. నెలకు అద్దె రూపంలో ఎడ్ల జతకు రూ.10 వేలు రైతు చెల్లించాలి. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే పసుపు, మొక్కజొన్న విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండంతో రైతులు ముందుగానే ఎడ్ల కోసం వ్యాపారులకు అడ్వాన్సులు చెల్లిస్తూ బుక్ చేసుకుంటున్నారు. ఎడ్లను పోషించాల్సిన తామే కరువు పరిస్థితుల కారణంగా అమ్ముకున్నామనీ.. ఇపుడు అవసరానికి అద్దెకు ఎడ్లను తీసుకుంటున్నామని, పనితీరాక వాటిని మళ్లీ వ్యాపారికే అప్పగించడం బాధాకరంగా ఉందని రైతులంటున్నారు.