సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు/ ఔట్‌సోర్సింగ్ అధ్యాపకుల వేతనాలను 75 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వన్‌టైమ్ బెనిఫిట్ కింద ఈ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టుల అధ్యాపకుల వేతనాల పెంపు, రెగ్యులర్ నియామకాల నిబంధనలపై వైస్ చాన్స్‌లర్ల కమిటీ చేసిన సిఫారసులకు ఆమోదం తెలి పింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆమోదం లభించగానే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇక ఏటా 3 శాతం
ప్రస్తుతం వర్సిటీల్లో 2 కేటగిరీల కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. నెట్/సెట్/పీహెచ్‌డీ/ఎంటెక్ వంటి ఉన్నత అర్హతలు ఉన్నవారు ఒక కేటగిరీకాగా.. ఈ అర్హతలు లేనివారు మరో కేటగిరీగా ఉన్నారు. ఉన్నత అర్హతలు లేని వారికి నెలకు రూ.21,600 వేతనం ఇస్తుండగా... ఆయా అర్హతలున్న వారికి రూ. 24,840 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ వేతనాలు 75 శాతం పెరుగుతాయి.
దీనితోపాటు ఏటా 3 శాతం చొప్పున వేతనాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నెట్/సెట్/పీహెచ్‌డీ/ఎంటెక్ అర్హతలు లేనివారి వేతనం రూ.21,600 నుంచి 75 శాతం పెంపుతో రూ.37,800కి పెరుగుతుంది. దీనికి మొదటి ఏడాది 3 శాతం పెంపు కలుపుకొని.. ఇక నుంచి వారికి రూ.38,930 వేతనంగా అందనుంది. ఇక ఆయా అర్హతలున్న వారి వేతనం రూ.24,840 నుంచి రూ.43,470కి పెరుగుతుంది.
దీనికి తొలిఏడాది 3 శాతం పెంపు కలపగా... ఇకనుంచి నెలకు రూ.44,770 వేతనంగా అందుతుంది. అలా ఇప్పటి నుంచి వచ్చే 35 ఏళ్ల వరకు వారికి చెల్లించే వేతనాల వివరాలను వీసీల కమిటీ లెక్కగట్టి ప్రభుత్వానికి అందజేసింది. దాని ప్రకారం 35 ఏళ్ల తర్వాత ఆయా అర్హతలు లేనివారి వేతనం రూ.77,350కు, అర్హతలున్న వారి వేతనం రూ. 88,970కు చేరుతుంది.
పోస్టుల భర్తీ నిబంధనలకు ఓకే..
వర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో రెగ్యులర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటివరకు కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్దతిన పనిచేసిన వారికి, వారి అనుభవాన్ని బట్టి అదనపు పాయింట్లు (నియామకాల్లో వెయిటేజీ) లభించనున్నాయి. ఇక 1:10 రేషియోలో ఇంటర్వ్యూల విధానానికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment