
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో పురాతన కాలానికి చెందిన జైన విగ్రహం చోరీకి గురైంది. పాత పంచాయతీ కార్యాలయం ఎదుట కూడలిలో ఉండే ఈ విగ్రహాన్ని స్థానికులు రోజూ దర్శించుకునే వారు. కాని శనివారం ఉదయం నుంచి అది కనపడకుండా పోయింది. అనేక ఏళ్లుగా అక్కడ ఉన్న విగ్రహం కనబడకుండా పోయిందనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. ఆ విగ్రహాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారనే ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు కొందరు జైన భక్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని స్థానిక పెద్దలను ఆశ్రయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున కొన్ని పూజలు చేసి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
విగ్రహం చరిత్ర ఇది..
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చోరీకి గురైన విగ్రహం జైన తీర్థంకరుడిదిగా భావిస్తున్నారు. దాదాపు 1400 ఏళ్ల కిందటి విగ్రహంగా చెబుతున్నారు. ఏక శిలపై దిగంబర జైన్ విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దారు. 1015–1042 సంవత్సరాల మధ్య కళ్యాణీ చాళుక్య జయసింహ మహారాజు పటాన్ చెరును రాజధానిగా చేసుకుని పాలించాడని ఆధారాలు ఉన్నాయి. ఆ రాజు కాలంలో జైన మతం ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో పటాన్‌చెరులో ఏడు వందల జైన దేవాలయాలు ఉండేవని చరిత్రకారులు గ్రంథస్తం చేశారు.
నేటికీ పెద్ద పెద్ద జైన విగ్రహాలు, దేవాలయాలు పటాన్‌చెరులో కనిపిస్తాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కనిపించే పెద్ద జైన విగ్రహం ఇక్కడ లభించిందే. పటాన్‌చెరులో జైన ఆరామాలు ఉండేవని చెప్తున్నారు. ఇప్పటికీ జైన సాధువులు పటాన్‌చెరుకు వచ్చి వెళ్తుంటారు. ఆ కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాని భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాలయ్యను వివరణ కోరగా.. ఆ విగ్రహం సంగతి తమకు తెలియదని చెప్పారు. తమ శాఖ ఆ విగ్రహాన్ని ఎక్కడికీ తరలించలేదని స్పష్టం చేశారు. దాన్ని తరలించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment