old statue
-
పురాతన జైన విగ్రహం అపహరణ!
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పురాతన కాలానికి చెందిన జైన విగ్రహం చోరీకి గురైంది. పాత పంచాయతీ కార్యాలయం ఎదుట కూడలిలో ఉండే ఈ విగ్రహాన్ని స్థానికులు రోజూ దర్శించుకునే వారు. కాని శనివారం ఉదయం నుంచి అది కనపడకుండా పోయింది. అనేక ఏళ్లుగా అక్కడ ఉన్న విగ్రహం కనబడకుండా పోయిందనే వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించింది. ఆ విగ్రహాన్ని భారీ మొత్తానికి అమ్ముకున్నారనే ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు కొందరు జైన భక్తులు ఆ విగ్రహాన్ని తమకు ఇవ్వాలని స్థానిక పెద్దలను ఆశ్రయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున కొన్ని పూజలు చేసి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లినట్లు చెప్తున్నారు. దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. విగ్రహం చరిత్ర ఇది.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చోరీకి గురైన విగ్రహం జైన తీర్థంకరుడిదిగా భావిస్తున్నారు. దాదాపు 1400 ఏళ్ల కిందటి విగ్రహంగా చెబుతున్నారు. ఏక శిలపై దిగంబర జైన్ విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్దారు. 1015–1042 సంవత్సరాల మధ్య కళ్యాణీ చాళుక్య జయసింహ మహారాజు పటాన్ చెరును రాజధానిగా చేసుకుని పాలించాడని ఆధారాలు ఉన్నాయి. ఆ రాజు కాలంలో జైన మతం ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో పటాన్చెరులో ఏడు వందల జైన దేవాలయాలు ఉండేవని చరిత్రకారులు గ్రంథస్తం చేశారు. నేటికీ పెద్ద పెద్ద జైన విగ్రహాలు, దేవాలయాలు పటాన్చెరులో కనిపిస్తాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో కనిపించే పెద్ద జైన విగ్రహం ఇక్కడ లభించిందే. పటాన్చెరులో జైన ఆరామాలు ఉండేవని చెప్తున్నారు. ఇప్పటికీ జైన సాధువులు పటాన్‌చెరుకు వచ్చి వెళ్తుంటారు. ఆ కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాని భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై స్థానిక డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాలయ్యను వివరణ కోరగా.. ఆ విగ్రహం సంగతి తమకు తెలియదని చెప్పారు. తమ శాఖ ఆ విగ్రహాన్ని ఎక్కడికీ తరలించలేదని స్పష్టం చేశారు. దాన్ని తరలించాల్సిన అవసరం తమకు లేదన్నారు. -
మేకలమ్మగుట్టపై దిగంబర విగ్రహాలు
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామంలో ఉన్న మేకలమ్మ గుట్టపై దంపతుల దిగంబర విగ్రహాలు వెలుగు చూశాయి. జనగామ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి బుధవారం తాజాగా వీటిని గుర్తించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై కనిపించిన స్త్రీ, పురుష దిగంబర విగ్రహాలను మేకలయ్య, మేకలమ్మగా భావిస్తున్నారు. 10 శతాబ్దానికి చెందిన ఈ దంపతుల శిల్పాలు విడివిడిగా అడుగున్నర ఎత్తులో ఉన్నాయి. ఎలాంటి ఆయుధాలు, జంతువుల చిహ్నాలు లేకపోవడంతో వారు ఏ దేవతామూర్తులే చెప్పలేకపోతున్నారు. మేకలమ్మ శిల్పం మూడు ముక్కలుగా ఉండగా మధ్య భాగం కనిపించడం లేదు. ఇక్కడ రాతితో నిర్మించిన మేకలమ్మ గుడిని దశాబ్దాల క్రితం కూల్చి వేయడంతో పూర్తిగా మాయమైంది. గుడికి ఉన్న మాన్యం భూములు అన్యాక్రాంతం అయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ జాతర జరిగేదని, రెండు దశాబ్దాలుగా అటు వైపు వెళ్లే వారు లేరని తెలుస్తోంది. అరుదైన డోల్మన్ సమాధులు.. గుట్టకు తూర్పు వైపున అనేక బండలున్నాయి. అక్కడ సముద్ర మట్టానికి 1,565 అడుగుల ఎత్తులో అనేక డోల్మన్ సమాధులను నిర్మించారు. మేకలమ్మ గుడికి 100 అడుగుల దూరంలో మూడు మీటర్ల పొడవైన రెండు రాతి పలకలు, అడుగున్నర పొడవులో ఉన్న పలకలను స్వస్తిక్ ఆకారంలో అమర్చారు. ఈ నాలుగింటి మధ్య మూడు నుంచి నాలుగు అడుగుల ఖాళీ స్థలాన్ని వదిలి పై భాగాన కప్పు బండ బోర్లించారు. ఇటువంటి నిర్మాణాలు చాలు అరుదుగా ఉంటాయి. చుట్టు పక్కల ఉన్న అనేక డోల్మన్ సమాధులను కూల్చివేశారు. గుట్ట కింద ఉన్న కుంటల్లో వందల సంఖ్యలో పెలికాన్ కొంగలు వచ్చి సేదతీరుతున్నాయి. మేకలమ్మ గుట్టను పురావస్తుశాఖ అధికారులు సందర్శిస్తే మరెంతో చరిత్ర వెలుగులోకి రానుంది. ఖిలాషాపూర్ సర్వాయి పాపన్న కోట సమీపంలోని ఈ గుట్టపై మేకలమ్మ ఆలయం నిర్మిస్తే పర్యాటక ప్రాంతం కావడంతోపాటు డోల్మన్ సమాధులు రక్షించబడతాయి. సమగ్రంగా పరిశోధించాలి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మేకలమ్మ గుట్టపై దిగంబర విగ్రహాలు వెలుగుచూశాయి. ఎంతో ఘన చరిత్ర గల ఈ విగ్రహాలపై పురావస్తుశాఖ సమగ్రంగా పరిశోధించాలి. ఇక్కడి విగ్రహాలను మ్యూజియానికి తరలిస్తే గ్రామ చరిత్రకున్న ప్రాధాన్యం పోతుంది. మేకలమ్మ గుట్టను పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని ఆలయాన్ని పునరుద్ధరించాలి. డోల్మన్ సమాధులు, శిల్పాలను రక్షించడంతోపాటు ఎకో టూరిజం కింద మేకలమ్మ గుట్టను అభివృద్ధి చేయాలి. - రత్నాకర్‌రెడ్డి,ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు -
అతి పురాతన విగ్రహం ఇదే సుమా!
► తాండూరులో పురాతన వరాహస్వామి విగ్రహం ► తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురాతన విగ్రహంగా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: గర్జిస్తున్న ఉగ్రరూపం.. ఓ చేతిపై శాంతమూర్తిగా కొలువు దీరిన భూదేవి.. విజయ గర్వంతో కటి భాగంపై ఠీవిగా ఉంచిన మరో చేయి.. మరో రెండు చేతులలో శంఖచక్రాలు.. వాహనంగా ఆదిశేషుడు.. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవికి విముక్తి చేసిన తర్వాత కనిపించే వరాహస్వామి రూపమిది. ఈ రూపాన్ని అత్యంత సుందరంగా చెక్కిన పురాతన కాలం నాటి విగ్రహం తాజాగా వెలుగుచూసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పురాతనమైనదిగా పేర్కొంటున్న ఈ విగ్రహం... సుమారు ఐదు, ఆరో శతాబ్దానికి చెందినదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే గుప్తులు– వాకాటక రాజవంశాల నాటి కాలంలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని పేర్కొంటున్నారు. బాదామి చాళుక్యుల హయాంలో రూపొంది, ప్రస్తుతం జోగులాంబ గద్వాల ప్రాంతంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయ ప్రాంగణంలోని విగ్రహాలే పురాతన విగ్రహాలుగా పరిగణిస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో బౌద్ధానికి సంబంధించిన పురాతన విగ్రహాలు వెలుగు చూసినా... హిందూ దేవతల విగ్రహాలకు సంబంధించి నవబ్రహ్మ ఆలయ విగ్రహాలనే పురాతనమైనవిగా భావిస్తారు. అవి ఏడో శతాబ్దానికి చెందినవి. అంతకు పూర్వంనాటి హిందూ దేవతల విగ్రహం మాత్రం తాజాగా బయటపడిన వరాహమూర్తిదే. తాండూరుకు చేరువలో.. వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలాల అనుబంధ గ్రామం గోవిందరావుపేట. ఒకప్పుడు చేనేత పరిశ్రమకు కేంద్రంగా భాసిల్లిన ప్రాంతం. తర్వాత రూపు కోల్పోయి శిథిల గ్రామంగా మారింది. కాగ్నా నదికి ఉపనదిగా భావించే కాక్రవేణి వాగు (నది) ఒడ్డున ఉన్న ఈ గ్రామ పొలిమేరలో పూర్తిగా ధ్వంసమైన ఓ ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఆ రాళ్లకుప్ప మధ్య రాజఠీవి ఒలకబోస్తూ వరాహస్వామి విగ్రహం కనిపిస్తుంది. 3.25 అడుగుల ఎత్తు, 2.6 అడుగుల వెడల్పున్న ఈ విగ్రహం గుప్తుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. అప్పట్లో బౌద్ధ విగ్రహాలను అత్యంత సుందరంగా రూపొందించిన దాఖలాలున్నాయి. గుప్తుల కాలంలో ఐదో శతాబ్దంలో బౌద్ధం నుంచి హైందవ సంప్రదాయం వైపు తిరిగి అడుగులు పడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే మహావిష్ణువు దశావతారాల విగ్రహాలను విరివిగా రూపొందించి ప్రతిష్టించారు. గుప్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి విగ్రహాలు వెలుగు చూశాయి కూడా. అదే సమయంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన వాకాటక రాజులు గుప్తులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. గోవిందరావుపేటలో కనిపించిన వరాహస్వామి విగ్రహం కూడా గుప్తుల ఏలుబడి ప్రాంతం నుంచి వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. విగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వ టీచర్ తాండూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీరేశం తొలుత ఈ పురాతన విగ్రహాన్ని గుర్తించారు. చాలాకాలంగా ఆ ప్రాంతానికి చెందినవారు దీనిని చూస్తున్నా.. దీని ప్రత్యేకతపై అవగాహన లేకపోవటంతో సాధారణ విగ్రహంగానే భావిస్తున్నారు. పురాతనకాలం నాటి విగ్రహాలపై ఉన్న కాస్త అవగాహనతో వీరేశం దానిని గుర్తించి ‘సాక్షి’దృష్టికి తెచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పురావస్తు శాఖలో పనిచేసిన నైపుణ్యం, పలు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవమున్న రిటైర్డ్ అధికారి రంగాచార్యులు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి గుప్తుల కాలానికి చెందినదిగా తేల్చారు. కచ్చితంగా పురాతన విగ్రహమే.. ‘‘ఉదయగిరి, మహాబలిపురం తదితర ప్రాంతాల్లో గుప్తులు, పల్లవుల కాలంలో రూపొందిన వరాహస్వామి విగ్రహాలలో ఉండే లక్షణాలు ఈ విగ్రహంలో ఉన్నాయి. నునుపుగా చెక్కిన తీరు, చిన్నచిన్న అంశాలు కూడా స్పష్టంగా చెక్కిన విధానం, అందంగా మలిచిన రూపు.. ఇవన్నీ గుప్తుల కాలం నాటి ప్రత్యేకతలే. అక్కడి నుంచే వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ప్రాచీన విగ్రహాల్లో ఇదే అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పరిశోధన చేస్తే మరిన్ని శిల్పాలు వెలుగు చూసే అవకాశముంది. అతి ప్రాచీనమైన ఈ విగ్రహాన్ని వెంటనే పరిరక్షించాల్సి ఉంది..’’ – రంగాచార్యులు, పురావస్తుశాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నా చిన్నప్పుడు ఇక్కడ జాతర సాగేది.. ‘‘నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో జాతర సాగేదన్న విషయం కాస్త అస్పష్టంగా గుర్తుంది. తర్వాత క్రమంగా ఈ ప్రాంతం పాడుబడ్డట్టయింది. ఆలయం ధ్వంసమైంది. ఉపాధి కోసం స్థానికులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లటంతో ఆలయం రాతికుప్పగా మారింది. అడపాదడపా నేనే అక్కడ దీపం వెలిగిస్తున్నా..’’ – ఆలయ సమీపంలో ఉండే ఎనభై ఏళ్ల వృద్ధుడు పోగుల కంటప్ప