అతి పురాతన విగ్రహం ఇదే సుమా!
► తాండూరులో పురాతన వరాహస్వామి విగ్రహం
► తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురాతన విగ్రహంగా నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: గర్జిస్తున్న ఉగ్రరూపం.. ఓ చేతిపై శాంతమూర్తిగా కొలువు దీరిన భూదేవి.. విజయ గర్వంతో కటి భాగంపై ఠీవిగా ఉంచిన మరో చేయి.. మరో రెండు చేతులలో శంఖచక్రాలు.. వాహనంగా ఆదిశేషుడు.. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవికి విముక్తి చేసిన తర్వాత కనిపించే వరాహస్వామి రూపమిది. ఈ రూపాన్ని అత్యంత సుందరంగా చెక్కిన పురాతన కాలం నాటి విగ్రహం తాజాగా వెలుగుచూసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పురాతనమైనదిగా పేర్కొంటున్న ఈ విగ్రహం... సుమారు ఐదు, ఆరో శతాబ్దానికి చెందినదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే గుప్తులు– వాకాటక రాజవంశాల నాటి కాలంలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని పేర్కొంటున్నారు.
బాదామి చాళుక్యుల హయాంలో రూపొంది, ప్రస్తుతం జోగులాంబ గద్వాల ప్రాంతంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయ ప్రాంగణంలోని విగ్రహాలే పురాతన విగ్రహాలుగా పరిగణిస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో బౌద్ధానికి సంబంధించిన పురాతన విగ్రహాలు వెలుగు చూసినా... హిందూ దేవతల విగ్రహాలకు సంబంధించి నవబ్రహ్మ ఆలయ విగ్రహాలనే పురాతనమైనవిగా భావిస్తారు. అవి ఏడో శతాబ్దానికి చెందినవి. అంతకు పూర్వంనాటి హిందూ దేవతల విగ్రహం మాత్రం తాజాగా బయటపడిన వరాహమూర్తిదే.
తాండూరుకు చేరువలో..
వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలాల అనుబంధ గ్రామం గోవిందరావుపేట. ఒకప్పుడు చేనేత పరిశ్రమకు కేంద్రంగా భాసిల్లిన ప్రాంతం. తర్వాత రూపు కోల్పోయి శిథిల గ్రామంగా మారింది. కాగ్నా నదికి ఉపనదిగా భావించే కాక్రవేణి వాగు (నది) ఒడ్డున ఉన్న ఈ గ్రామ పొలిమేరలో పూర్తిగా ధ్వంసమైన ఓ ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఆ రాళ్లకుప్ప మధ్య రాజఠీవి ఒలకబోస్తూ వరాహస్వామి విగ్రహం కనిపిస్తుంది. 3.25 అడుగుల ఎత్తు, 2.6 అడుగుల వెడల్పున్న ఈ విగ్రహం గుప్తుల కాలం నాటిదిగా భావిస్తున్నారు.
అప్పట్లో బౌద్ధ విగ్రహాలను అత్యంత సుందరంగా రూపొందించిన దాఖలాలున్నాయి. గుప్తుల కాలంలో ఐదో శతాబ్దంలో బౌద్ధం నుంచి హైందవ సంప్రదాయం వైపు తిరిగి అడుగులు పడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే మహావిష్ణువు దశావతారాల విగ్రహాలను విరివిగా రూపొందించి ప్రతిష్టించారు. గుప్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి విగ్రహాలు వెలుగు చూశాయి కూడా. అదే సమయంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన వాకాటక రాజులు గుప్తులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. గోవిందరావుపేటలో కనిపించిన వరాహస్వామి విగ్రహం కూడా గుప్తుల ఏలుబడి ప్రాంతం నుంచి వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
విగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వ టీచర్
తాండూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీరేశం తొలుత ఈ పురాతన విగ్రహాన్ని గుర్తించారు. చాలాకాలంగా ఆ ప్రాంతానికి చెందినవారు దీనిని చూస్తున్నా.. దీని ప్రత్యేకతపై అవగాహన లేకపోవటంతో సాధారణ విగ్రహంగానే భావిస్తున్నారు. పురాతనకాలం నాటి విగ్రహాలపై ఉన్న కాస్త అవగాహనతో వీరేశం దానిని గుర్తించి ‘సాక్షి’దృష్టికి తెచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పురావస్తు శాఖలో పనిచేసిన నైపుణ్యం, పలు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవమున్న రిటైర్డ్ అధికారి రంగాచార్యులు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి గుప్తుల కాలానికి చెందినదిగా తేల్చారు.
కచ్చితంగా పురాతన విగ్రహమే..
‘‘ఉదయగిరి, మహాబలిపురం తదితర ప్రాంతాల్లో గుప్తులు, పల్లవుల కాలంలో రూపొందిన వరాహస్వామి విగ్రహాలలో ఉండే లక్షణాలు ఈ విగ్రహంలో ఉన్నాయి. నునుపుగా చెక్కిన తీరు, చిన్నచిన్న అంశాలు కూడా స్పష్టంగా చెక్కిన విధానం, అందంగా మలిచిన రూపు.. ఇవన్నీ గుప్తుల కాలం నాటి ప్రత్యేకతలే. అక్కడి నుంచే వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ప్రాచీన విగ్రహాల్లో ఇదే అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పరిశోధన చేస్తే మరిన్ని శిల్పాలు వెలుగు చూసే అవకాశముంది. అతి ప్రాచీనమైన ఈ విగ్రహాన్ని వెంటనే పరిరక్షించాల్సి ఉంది..’’ – రంగాచార్యులు, పురావస్తుశాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్
నా చిన్నప్పుడు ఇక్కడ జాతర సాగేది..
‘‘నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో జాతర సాగేదన్న విషయం కాస్త అస్పష్టంగా గుర్తుంది. తర్వాత క్రమంగా ఈ ప్రాంతం పాడుబడ్డట్టయింది. ఆలయం ధ్వంసమైంది. ఉపాధి కోసం స్థానికులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లటంతో ఆలయం రాతికుప్పగా మారింది. అడపాదడపా నేనే అక్కడ దీపం వెలిగిస్తున్నా..’’ – ఆలయ సమీపంలో ఉండే ఎనభై ఏళ్ల వృద్ధుడు పోగుల కంటప్ప