- తుపాన్ బాధితులకు బాసటగా సినీ తారల క్రికెట్ మ్యాచ్
- ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో..
హైదరాబాద్, న్యూస్‌లైన్: హుద్ హుద్ తుపాన్ విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు తెలుగు సినిమా తారలంతా కలసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ఈ నెల 30న హైదరాబాద్‌లో ఆటపాటలతో సందడిగా సాగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో హోరెత్తనుంది.
ఆ రోజు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ‘క్రికెట్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో నటీనటులంతా కలసి క్రికెట్ ఆడనున్నారు. టోర్నమెంట్‌లో ఆడే నాలుగు జట్లకు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘డ్రా’ పద్ధతి ద్వారా ఆయా టీముల్లో ఆడే తారలను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేశారు.
అనివార్య కారణాలతో నాగార్జున, ఎన్టీఆర్ రాలేకపోవడంతో... నాగార్జున టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని అఖిల్, ఎన్టీఆర్ టీమ్‌కి వైస్ కెప్టెన్ అయిన శ్రీకాంత్ వారి స్థానంలో హాజరయ్యారు. సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, డి.సురేశ్‌బాబు, ఎమ్మెల్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.
నాగార్జున టీమ్: అక్కినేని అఖిల్, కల్యాణ్‌రామ్, శర్వానంద్, నిఖిల్, నాగశౌర్య, సచిన్ జోషి, శివాజీరాజా, రాజీవ్ కనకాల, అల్లరి నరేశ్, సాయికుమార్. హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, మధుశాలిని, సోనియా, డిషా పాండేలు ఈ టీమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
వెంకటేశ్ టీమ్: మంచు విష్ణు, మంచు మనోజ్, నితిన్, నారా రోహిత్, సుశాంత్, నవీన్‌చంద్ర, డా.రాజశేఖర్, దాసరి అరుణ్‌కుమార్, మాదాల రవి, ఆదర్శ్. హీరోయిన్లు సమంత, లక్ష్మీ మంచు, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వినిలు ఈ టీమ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు.
ఎన్టీఆర్ టీమ్: శ్రీకాంత్, గోపీచంద్, నాని, సందీప్‌కిషన్, సాయిధర్మతేజ, తనీష్, ప్రిన్స్, తరుణ్, సమీర్, రఘు, తమన్. కథానాయికలు అనుష్క, దీక్షాసేథ్, నిఖిత, శుభ్ర అయ్యప్ప, అస్మితాసూద్‌లు ఈ టీమ్‌కి గ్లామర్ తేనున్నారు.
చరణ్ టీమ్: రవితేజ, సుధీర్‌బాబు, సుమంత్, తారకరత్న, వరుణ్‌సందేశ్, వడ్డే నవీన్, ఖయ్యూం, అజయ్. కథానాయికలు కాజల్ అగర్వాల్, చార్మి, అర్చన, పూనమ్‌కౌర్, రీతూ వర్మలు ఈ టీమ్‌లో అలరించనున్నారు.