హుద్‌హుద్‌ హామీలు..నీటి మీద రాతలు | Cyclone victims angry over Chandrababu fake promises | Sakshi
Sakshi News home page

హుద్‌హుద్‌ హామీలు..నీటి మీద రాతలు

Published Mon, Oct 15 2018 3:34 AM | Last Updated on Mon, Oct 15 2018 3:58 AM

Cyclone victims angry over Chandrababu fake promises - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై ప్రకృతి పగ బట్టినట్టుగా నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్‌ విలయం విశాఖ నగరాన్ని అతలాకుతలం చేయగా, నేడు తిత్లీ తుపాన్‌ సిక్కోలు జిల్లాను కన్నీటి సంద్రంగా మార్చింది. ఇలాంటి పెనువిపత్తులు, సంక్షోభ సమయాల్లో అభాగ్యులను ఆదుకోవాల్సిన పాలకులు కేవలం ప్రచారం కోసం పాకులాడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా తిత్లీ దెబ్బకు శ్రీకాకుళం విలవిల్లాడుతుంటే ఈ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ప్రచారయావ ఏవగింపు కలిగిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కంటే  చంద్రబాబు ఒక్కడే ఉండి అంతా తానే ఉద్ధరిస్తున్నట్టుగా కలరింగ్‌ ఇస్తుండడం, హడావుడి చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్‌ బారిన పడ్డ విశాఖపట్నంలో మకాం వేసిన చంద్రబాబు అప్పట్లో ఎన్నో హామీలు గుప్పించారు. కానీ, నేటికీ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు శ్రీకాకుళంలోనూ ముఖ్యమంత్రి అలాంటి హామీలే గుప్పిస్తున్నారు.  

ప్రచారం కోసం బాబు ప్రయాస 
2014 అక్టోబర్‌ 12న హుద్‌హుద్‌ తుపాన్‌ సంభవించింది. మరుసటి రోజు విశాఖపట్నం చేరుకున్న సీఎం చంద్రబాబు ఐదు రోజులపాటు ఇక్కడే  మకాం వేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతూ నానా హంగామా చేశారు. మొత్తం కేబినెట్‌ మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సహా ఉన్నతాధికారులందరినీ విశాఖకు రప్పించి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వార్డుకో మంత్రి... సందుకో ఉన్నతాధికారి... వారు చేసిన పని తక్కువ.. పెత్తనం ఎక్కువ. సీఎం మెప్పు కోసం మంత్రులు, అధికారులు చేసిన విన్యాసాలు బాధితులను తీవ్ర ఇక్కట్ల పాల్జేశాయి. ప్రచారం కోసం రోజూ ఉదయం, సాయంత్రం సమీక్షలు.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల పేరిట సీఎం హంగామా చేయగా.. వారి వెనుక ఫైళ్లు పట్టుకుని అధికారులు పరుగులు పెట్టడంతో  క్షేత్రస్థాయిలో పునరావాస చర్యల్లో పాల్గొనే సిబ్బందితోపాటు బాధితులు నరకం చూశారు. 

నిర్మించిన ఇల్లు అరకొరే.. 
హుద్‌హుద్‌ దెబ్బకు ఉత్తరాంధ్రలో మొత్తం 2,00,673 ఇళ్లు దెబ్బతిన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. గాలుల తీవ్రతకు 49,363 పూరిపాకలు ఎగిరిపోయాయని లెక్కగట్టింది. దాతల సహకారంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి రూ.560 కోట్ల అంచనా వ్యయంతో 10,000 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించింది. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి 8404 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. నాలుగేళ్లయినా ఇప్పటి వరకు అర్బన్‌ ప్రాంతంలో 2,866, గ్రామీణ ప్రాంతాల్లో 978 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇవన్నీ సాక్షాత్తూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలే. 

నేటికీ శిథిలమైన రోడ్లే 
హుద్‌హుద్‌ దెబ్బకు ఉత్తరాంధ్రలో 12,330 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, వీటిలో ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,880 కి.మీ., పంచాయతీరాజ్‌ రోడ్లు 2,274 కిలోమీటర్లు, గ్రామ పంచాయతీ రోడ్లు 4,831 కిలోమీటర్లు, మున్సిపల్, కార్పొరేషన్‌ రోడ్లు 1,345 కిలోమీటర్ల మేర దెబ్బతినగా.. రూ.6,138.56 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి రూ.150.18 కోట్లతో పంచాయతీరాజ్‌లో 129 రోడ్లు, రూ.280 కోట్లతో ఆర్‌అండ్‌బీలో 20 రోడ్లు, రూ.200 కోట్లతో జీవీఎంసీలో దెబ్బతిన్న రోడ్లు వేయాలని, డ్రైనేజీలు పునర్‌నిర్మించాలని ప్రతిపాదించగా, నాలుగేళ్ల తర్వాత ఇప్పటికీ శిథిలమైన రహదారులే దర్శనమిస్తున్నాయి. 

అటకెక్కిన బీచ్‌ కోత నివారణ 
హుద్‌హుద్‌ సమయంలో సుమారు 100 అడుగుల మేర తీరంలోకి సముద్రం చొచ్చుకు వచ్చింది. దీంతో తీరం వెంబడి ఆర్కే బీచ్‌ సహా మొత్తం బీచ్‌లన్నీ కోతకు గురయ్యాయి. తీరప్రాంత పరిరక్షణ కోసం రూ.150 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేసిన ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. 

విద్యుత్‌ రంగానికి సాయం శూన్యం 
హుద్‌హుద్‌ విలయంలో అన్నింటి కంటే ఎక్కువగా నష్టపోయింది విద్యుత్‌ రంగమే. ఎపీఈపీడీసీఎల్‌కు రూ.700.62 కోట్లు, ఎపీ ట్రాన్స్‌కోకు రూ.247.50 కోట్లు, ఆర్‌ఎస్‌సీవోకు రూ.72.78 కోట్లు, ఇతర విద్యుత్‌ రంగాలకు రూ.269.19 కోట్లు... మొత్తం రూ.1290.08 కోట్ల నష్టం  వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. కానీ, ప్రభుత్వం అందజేసిన సాయం శూన్యం. ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టు కింద ఒక్క విశాఖ పరిధిలోనే అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థ కోసం రూ.720 కోట్లతో తలపెట్టిన పనులు ఇటీవలే మొదలయ్యాయి. 

వీధి దీపాలకూ దిక్కులేదు
విశాఖ కార్పొరేషన్‌తోపాటు ఉత్తరాంధ్ర పట్టణ ప్రాంతాల్లో హుద్‌హుద్‌ వల్ల 40,614 వీధి లైట్లు, పంచాయతీల్లో 2.5 లక్షల వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేవలం విశాఖ నగర మాత్రమే ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు  చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

నేటికీ శిథిల భవనాల్లోనే పాలన
హుద్‌హుద్‌ ధాటికి విశాఖ కలెక్టరేట్‌తో సహా వివిధ శాఖలకు చెందిన వందలాది భవనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 53 భవనాలు, పంచాయతీరాజ్‌కు చెందిన 375, గ్రామ పంచాయతీ భవనాలు 1,108, మున్సిపల్‌ బిల్డింగ్స్‌ 24,138 ఇరిగేషన్‌ భవనాలు 51, ప్రాధమిక విద్యాశాఖకి చెందిన 1,667, సోషల్‌ వెల్పేర్‌కు చెందిన 156, బీసీ వెల్ఫేర్‌కు చెందిన 117, ట్రైబల్‌ వెల్ఫేర్‌కు చెందిన 455, ఇంటర్మీడియట్‌ కళాశాలల భవనాలు 38 దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా పైసా కూడా విదల్చలేదు. 

విశాఖకు ఇచ్చిన హామీలన్నీ గాలికే.. 
హుద్‌హుద్‌ తుపాన్‌ వల్ల విశాఖపట్నం అతలాకుతలమైపోయినా సీఎం మాత్రం నాలుగేళ్లుగా  హామీలతోనే కాలం గడిపేశారు. నగరంలోని అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థతోపాటు రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు. 10,000 మంది ఉద్యోగులు పనిచేసేలా ఐటీ టౌన్‌షిప్‌ నిర్మిస్తామని, మెట్రో రైల్‌ ప్రాజెక్టు తీసుకొస్తామని, విశాఖను లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని, భీమిలి నుంచి విశాఖ పోర్టు వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని, రూ.44 కోట్లతో బీచ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని, విశాఖలో బర్డ్స్‌ పార్కు, బొటానికల్‌ గార్డెన్, ఓషన్‌ రివర్, బీచ్‌ రిసార్ట్స్, సైన్స్‌ సిటీలు నిర్మిస్తామని, అరకు, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్, ఇంటర్నేషన్‌ కన్వెన్షన్‌ సెంటర్, ఎగ్జిబిషన్‌ సెంటర్, ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ వంటివి ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టుకు అదనంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును తీసుకొస్తామని, విశాఖలో ప్రస్తుతం రెండు పోర్టులకు అదనంగా మరో డీప్‌వాటర్‌ పోర్టును తీసుకొస్తామంటూ నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చిన పాపాన పోలేదు. 

 పరిహారం కాదు.. పరిహాసం 
‘‘నేను స్వయంగా హుద్‌హుద్‌ తుపాన్‌ పీడిత ప్రాంతాల్లో పర్యటించాను. సర్వం కోల్పోయి చెల్లాచెదురై, బోరున విలపిస్తున్న బాధిత కుటుంబాలను చూసి చలించిపోయాను. పేద కుటుంబాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కట్టుబట్టులతో వీధి పాలైన కుటుంబాలను, పంటలను కోల్పోయి రోదిస్తున్న రైతన్నలను చూసి ఆవేదన చెందాను. తుపాన్‌ బాధితులకు అండగా నిలుస్తాం. తుపాన్‌ బారినపడి నష్టపోయిన వారందరినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. తుపాన్‌ బాధితులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని భారీగా పెంచాం. వీలైనంత వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’’ 
- 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్‌ తుపాన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇదీ. అయితే, బాధితులకు మాత్రం ఎలాంటి ఊరట దక్కలేదు. ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా, పదుల సంఖ్యలో ఎకరాల్లోని పంటలకు కూడా పరిహారం ఇప్పటికీ అందలేదని బాధిత రైతులు చెప్పారు. ఇక చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు గాను ప్రభుత్వం నుంచి అరకొరగా కూడా సాయం అందలేదు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇస్తామన్న పరిహారం ఎవరి పరమైందో తెలియదు. దానికి లెక్కాపత్రం లేదు. ఇక హుద్‌హుద్‌ వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ చేనేత కార్మికులు, మత్స్యకారులు సైతం ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా సాయం అందక బోరుమంటున్నారు. 

తిత్లీలోనూ అదే తీరు 
హుద్‌హుద్‌ మాదిరిగానే ఇప్పుడు తిత్లీ తుపాన్‌ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి వల్ల బాధితులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. తిత్లీ తుపాన్‌ ముందురోజు అమరావతిలో అర్ధరాత్రి మూడుసార్లు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులను హడావుడి పెట్టించిన చంద్రబాబు తుపాన్‌ తీరం దాటిన 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లారు. గత మూడురోజులుగా ఆయన సాగిస్తున్న ప్రచార విన్యాసాలు అన్నీఇన్నీ కావు. బాధితులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. పంటలను నష్టపోయిన రైతన్నలకు ఏ మేరకు నష్టపరిహారం చెల్లిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ధ్వంసమైన పంటలు, తోటలను అధికారులు పరిశీలించిన తర్వాతే పరిహారం నిర్ణయిస్తామని చెప్పారు. ఆ పరిశీలన ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పశువుల పాకలు, పూరిల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, పూర్తిగా దెబ్బతింటే సాధారణ గృహాలకు రూ.1.50 లక్షలు, ఎస్సీలకు రూ.2 లక్షలు, ఎస్టీలకు రూ.2.50 లక్షలిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే.. ఆ పరిహారంతో గోడలు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఒక్కో ఆవు, గేదెకు రూ.10 వేలు, మేక, గొర్రెకు రూ.5 వేలు మాత్రమే పరిహారం ప్రకటించారు. కొన్ని ఆవులు, గేదెల విలువ రూ. 25 వేలకు పైగానే ఉండగా ప్రభుత్వం మాత్రం రూ.10 వేలు మాత్రమే ఇస్తామనడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 

- హుద్‌హుద్‌ తుపాన్‌ తీవ్రతకు విశాఖ కలెక్టరేట్‌లోని ట్రెజరీ, సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. కానీ, నాలుగేళ్లయినా పునరుద్ధరించలేదు. కూలేందుకు సిద్దంగా ఉన్న సీలింగ్‌ కిందనే 70 మంది ట్రెజరీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ శిథిల భవనం విశాఖ జిల్లాలోని పెందుర్తి మండల పరిషత్‌ కార్యాలయం. 2014లో హుద్‌హుద్‌ తుపాన్‌ ధాటికి దెబ్బతిని ఇలా తయారైంది. నాలుగేళ్లయినా ఇప్పటికీ అలాగే ఉంది. అద్దె భవనాల్లో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.లక్షలు ఖర్చు చేస్తున్న అధికారులు ఈ భవనాన్ని మాత్రం పునరుద్ధరించడం లేదు.

విశాఖ జిల్లా అరకు మండలంలోని చిట్టంగొంది, మొదలస, పాలమానివలస పల్లెల్లోని 39 కుటుంబాల గిరిజనులు హుద్‌హుద్‌ విలయంలో ఇళ్లు కోల్పోయారు. వారికి నందివలస గ్రామంలో ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దాంతో ఆ గిరిపుత్రులు నందివలసకు మకాం మార్చారు. కానీ, నేటికీ ఆ ఇళ్లు పునాదుల దశ దాటకపోవడంతో తాత్కాలిక షెడ్లలోనే నివాసముంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement