హుజూరాబాద్ : హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంత వాసులను ఊరిస్తూ వస్తున్న ఆర్డీవో ఆఫీస్ కలగానే మిగిలేలా ఉంది. హుజూరాబాద్‌కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించింది. హుజూరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తగా టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే హుజూరాబాద్‌కు ‘రెవెన్యూ’ హోదా కల్పించారు. కోర్టు జోక్యంతో హుజూరాబాద్ డివిజన్ రద్దు కాగా, ఇప్పుడు గందరగోళంగా తయారైంది.
హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాలు గతేడాది వరకు కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కిందనే ఉండేవి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాలకు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ సౌకర్యంగా ఉంటుందని అంతా భావించారు. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని అంతా భావించగా, గత ఎన్నికలకు ముందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేసి హుజూరాబాద్‌ను అందులో కలిపింది. ఈ విషయమై హుజూరాబాద్‌లో ఆగ్రహావేశాలు, ఆందోళనలు పెల్లుబికాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌కు ఆర్డీవో యోగాన్ని కల్పించారు. అనుకున్నదే తడవుగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలోనే ఆర్డీవో ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఆర్డీవోకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. తహశీల్దార్‌ను అడ్మినిస్ట్రేటివ్ అధికారి(ఏవో)గా నియమించారు. గతేడాది ఆగస్టు 14న అప్పటి జేసీ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. శాశ్వత కార్యాలయంగా పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేసి మరమ్మతు సైతం చేయించారు. అయితే హుజూరాబాద్‌కు ఆర్డీవో హోదా రావడంతో హుస్నాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి.
హైకోర్టు తీర్పుతో గప్‌చుప్
హుజూరాబాద్‌కు ఆర్డీవో హోదాను రద్దు చేయాలని, ముందుగా విడుదల చేసిన జీవోను అమలు చేయూలని హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజుల తర్వాత హైకోర్టు హుజూరాబాద్‌కు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడి ఆర్డీవో కార్యాలయాన్ని కరీంనగర్‌కు తరలించారు. ఏవోను ఎల్కతుర్తి తహశీల్దార్‌గా బదిలీ చేశారు.
ఇప్పటికైనా నెరవేరేనా?
కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట, ఎల్కతుర్తి, కమలాపూర్, వీణవంక, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాల నుంచి దాదాపు 50 కిలోమీటర్లకు పైగా దూరంలో కరీంనగర్ ఉంటుంది. దూరం తగ్గడానికే స్థానికంగా డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ హుజూరాబాద్, హుస్నాబాద్ పట్టణాల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో ప్రభుత్వమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. భౌగోళికంగా, రవాణాపరంగా, అన్ని మండలాల ప్రజల అభిప్రాయాలు పరిగణించి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నెలరోజుల మురిపెం!
Published Mon, Feb 9 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement