గీసుకొండ(పరకాల) : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా రెండో రోజైన సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు భక్తులు లక్ష్మీనర్సింహ స్వామి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్వామి వారిని దర్శించుకోగా అధికారులు, అర్చకులు, స్వాగతం పలికి పూజలు చేయించారు. కాగా, పోలీసులు జాతరలో రాజకీయ ప్రభలను నిషేధించినట్లు ప్రకటించినా వివిధ పార్టీల నాయకులు పలు ప్రాంతాల నుంచి జాతరకు తరలించారు. ఇక తెలంగాణ జాగృతితో పాటు కొమ్మాల సర్పంచ్ జూలూరి సంధ్య– కేదారి దంపతులు రెండు ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీటి సరఫరా చేశారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, కొమ్మాల ఆలయం వారు సంయుక్తంగా రథశాల వద్ద భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ నెల 16వ తేదీన స్వామి వారి రథ్సోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ కమల, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబు తెలిపారు. ఈస్ట్ డివిజన్ డీసీపీ ఇస్మాయిల్, మామునూరు ఏసీపీ శోభన్‌కుమార్, గీసుకొండ సీఐ ప్రభాకర్‌రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ బాబురెడ్డి పాల్గొన్నారు.
భారీగా తరలిన దేవుని బండ్లు, ప్రభబండ్లు
దుగ్గొండి(నర్సంపేట): దేవుడి బండ్లు, చక్రపుబండ్లు, గుర్రపు బాణాలు, ఏనుగ బాణాలు, మేక పోతుల బండ్లు, పాలారాపు బండ్లు ఇలా అందమైన అలంకరణలో ప్రభ బండ్లు గ్రామగ్రామాన సందడి చేశాయి. పలు గ్రామాల నుంచి అలంకరణలో ఉన్న బండ్లతో భక్తులు కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి సన్నిధికి బయలుదేరారు. కాగా, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభబండ్లను గిర్నిబావిలో సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. టీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు ఆకుల శ్రీనివాస్, శానబోయిన రాజ్‌కుమార్, కాట్ల భద్రయ్య, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఆరె జైపాల్‌రెడ్డి, గుడిపెల్లి జనార్దన్‌రెడ్డి, నాతి వెంకటేశ్వర్లు ఉన్నారు.
కాగా, కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో 2004 నుండి రాజకీయ ప్రభలపై పోలీసులు నిషేధం విధించడంతో జాతర వెలవెలబోయింది. ఈసారి ఆంక్షలు విధించినా పార్టీల ఆధ్వర్యంలో భారీ రాజకీయ ప్రభలను ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు రాజకీయ ప్రభలను పోటాపోటీగా తరలించారు. కాంగ్రెస్ ప్రభలను మండల పార్టీ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అయితే అనుమతి లేకపోవడంతో గిర్నిబావిలో ఎస్సై భాస్కర్‌రెడ్డి రెండు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు పార్టీల జెండాలు తీసివేసి అనుమతించారు.