సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను కరీంనగర్ ఉమ్మడి ప్రజలు కట్టడి చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగం, ప్రజాప్రతినిధుల శ్రమ... ప్రజల సహకారంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు నేడో రేపో గ్రీన్‌జోన్‌గా అంతరించబోతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లగా.. రాజన్న సిరిసిల్లలో 3 పాజిటివ్ కేసులు మిగిలి ఉన్నాయి. దేశంలోనే ఒకేసారి పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా.. తొలిసారి రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంగా కరీంనగర్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇది నెలన్నర క్రితం మాట.. ఇప్పుడా మాటకు అర్థం మారిపోయింది. కరీంనగర్ అంటేనే కరోనాను కట్టడి చేస్తుందనే అభయం ఇచ్చే స్థితికి చేరింది. అధికారులు, ప్రజాప్రతినిదులు తీసుకున్న కఠిన నిర్ణయాలు కరోనాను కట్టడి చేశాయి. కనిపించని శత్రువుపై అలుపెరుగని పోరు చేపట్టి వి జయం సాధించారు. కరోనాను కట్టడి చేసిన తీరు... కరీంనగర్‌ను ప్రతీ జిల్లా రోల్‌మోడల్‌గా తీసుకునేలా చేసింది. కరోనాను నియంత్రించేందుకు కరీంనగర్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో కరోనా నియంత్రణలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కరీంనగర్ ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా మహమ్మారిని తరిమేసేందుకు పడిన శ్రమకు ఫలితం దక్కుతోంది.
దేశంలోనే తొలి రెడ్‌జోన్...
కరోనా వైరస్ ప్రపంచంలోని నలుమూలలకు అప్పుడప్పుడే పాకుతున్న తరుణంతో ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది మత ప్రచారకుల బృందంతో కరోనా తాకిడి కరీంనగర్‌లో మొదలైంది. మార్చి 16న ఇండోనేషియా బృందానికి కరోనా లక్షణాలున్నాయని గుర్తించి.. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల వ్యవధిలో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలోనే మొదటి సారిగా ఇండోనేసియన్లు బస చేసిన, ప్రార్థనల కోసం తిరిగిన ముకరంపుర ప్రాంతాన్ని మార్చి 19న రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అప్పటి నుంచి మొదలైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారితో మరింత కఠినంగా వ్యవహరించేలా చేశాయి. పెద్దపల్లి జిల్లాలో మర్కజ్ నుంచి వచ్చిన వారికి రెండు పాజిటివ్‌లు రాగా.. వారు కోలుకొని కరోనా ఫ్రీగా మారింది. జగిత్యాలలో నాలుగు పాజిటివ్ కేసుల్లో మూడు నెగెటివ్ వచ్చాయి. ఇంకా ఒకే పాజిటివ్ మిగిలింది. రాజన్న సిరిసిల్లలో మాత్రం మూడు పాజిటివ్ కేసులు ఉన్నాయి. వారు కూడా పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. నాలుగు జిల్లాల్లో పాజిటివ్ వచ్చిన ప్రాంతాలన్నీ కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి వైద్య సేవలు, నిత్యావసరాలు అందిస్తూ ప్రజలెవరూ ఇళ్ల నుంచి కదలకుండా క్వారంటైన్ చేశారు. పాజిటివ్ కేసులు తగ్గుతుండడంతో కంటైన్‌మెంట్లన్నీ ఎత్తివేశారు.
నేడో.. రేపో.. కరోనా ఫ్రీ..
కరీంనగర్ జిల్లాలో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా గాంధీ, కింగ్‌కోటి, ఫీవర్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. దశల వారీగా నెగెటివ్ వచ్చిన వారంతా డిశ్చార్జ్ అయి ఇళ్లకు చేరారు. ఇప్పటివరకు 18 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఇక మిగిలింది సాహేత్‌నగర్‌కు చెందిన వ్యక్తి మాత్రమే. అతనికి నేడో, రేపో కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చివరి వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చి కొత్త కేసులు ఏవీ నమోదు కకాపోతే... ఇక కరీంనగర్ కరోనా ఫ్రీగా అవతరించనుంది. జగిత్యాలలో సైతం ఒకే కేసు పాజిటివ్ యాక్టివ్‌గా ఉంది. ఈ రెండు జిల్లాలు రాబోయే రెండు మూడు రోజుల్లో కరోనా ఫ్రీ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లు సైతం ఖాళీ అయ్యాయి. అనుమానితులు సైతం ఎవ్వరూ లేకపోవడంతో కరోనా కట్టడి సమర్థవంతంగా జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ సమయం పూర్తయ్యేలోపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేశంలోనే సేఫ్ జిల్లాగా నిలువనుంది.
కొనసాగుతున్న స్క్రీనింగ్ పరీక్షలు...
కరోనా పాజిటివ్‌లు కొత్తగా ఏమీ బయటపడనప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ పోతోంది. ఇప్పటివరకు క్వారంటైన్ చేసిన ప్రాంతాలతోపాటు రద్దీ ఉండే ప్రాంతాలు, జిల్లాల సరిహద్దుల్లో సైతం స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో, హుజూరాబాద్‌లో 50 వైద్య బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. జగిత్యాలలో 30 బృందాలు, రాజన్న సిరిసిల్లలో 36 బృందాలు, పెద్దపల్లిలో 30 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఎలాంటి జంకూ లేకుండా పాజిటివ్‌లు వచ్చిన ప్రాంతాల్లో సైతం వెళ్లి స్క్రీనింగ్‌లు చేస్తున్నారు. అయితే స్క్రీనింగ్‌లు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి పూర్తి సహకారం అందకపోయినా ఇంటింటికి వెళ్లి వారి ఇళ్లలో ఉండే అందరికీ స్క్రీనింగ్‌లు చేస్తూ కరోనా అనుమానితులను గుర్తిస్తున్నారు. వైద్య సిబ్బంది పట్టుదలతో కరోనా పూర్తిగా కనుమరుగైపోనుంది.
కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు...
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని కంటైన్‌మెంట్ ప్రాంతాలను ఎత్తివేసినప్పటికీ లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలతోపాటు రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జనసంచారాన్ని ఇదే మాదిరిగా నియంత్రిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు సైతం భౌతిక దూరం పాటించాలని, అవసరముంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. జిల్లాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాకపోవడంతో కూరగాయలు, కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసరాలు, మందుల దుకాణాల తెరిచి ఉంచే సమయంపై ఆంక్షలను సడలించారు. కానీ వేసవి కాలం కావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించడం లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ ప్రారంభం అవుతుండడంతో అధికారులు, పోలీసులు పగడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment