మరో వారం రోజులు కీలకం.. | 17 People From Karimnagar Nizamuddin Visitors | Sakshi
Sakshi News home page

మరో వారం రోజులు కీలకం..

Published Wed, Apr 1 2020 10:46 AM | Last Updated on Wed, Apr 1 2020 10:46 AM

17 People From Karimnagar Nizamuddin Visitors - Sakshi

నిర్మానుష్యంగా మారిన గీతాభవన్‌ చౌరస్తా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఢిల్లీలోని నిజామొద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో ప్రార్థనలు కరోనా వ్యాధి సోకడానికి కారణమయ్యాయి. ప్రార్థించిన చోటి నుంచే ప్రాణాలు తీసే కరోనా వ్యాధి వెంటబెట్టుకు వచ్చారు. రాష్ట్రంలో మృతిచెందిన ఆరుగురు ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ నుంచి మొత్తం 1030 మంది హాజరుకాగా కరీంనగర్‌ జిల్లా నుంచి 17 మంది ప్రార్థనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారిలో ముగ్గురు హుజూరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. వీరంతా ప్రార్థనల అనంతరం రైళ్లలో తమ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు. వీరి ద్వారా రైలు ప్రయాణ సమయంలో తమతోపాటు ప్రయాణించిన వందలాది మందికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు మర్కజ్‌లో ప్రార్థనలకు హాజరైన వారు కరోనా వైరస్‌ బారిన పడి ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా నుంచి ఢిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారి గురించి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆరా తీసి వారి చిరునామాలను కనుక్కుంది. 17 మందిని ఐసోలేషన్‌కు తరలించి కరోనా పరీక్షలు చేస్తున్నారు.

అయితే ఇన్నాళ్లూ వీరు ఎవరెవరిని కలిశారు.. ఎంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారనేది పెద్ద సమస్యగా మారింది. ప్రార్థనలకు వెళ్లి వచ్చి ఐసోలేషన్‌లో ఉంటున్న అనుమానితులకు చెందిన కుటుంబ సభ్యులను మాత్రం వారి వారి ఇళ్లలోనే క్వారంటైన్‌ చేశారు. వారి సమీప బంధువులు, సన్నిహితంగా మెలిగిన వారి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వెళ్లినట్లు తెలియడం, చనిపోయిన ఆరుగురు అక్కడే ప్రార్థనలు చేసి రావడంతో ప్రార్థనల్లో పాల్గొన్నవారు అనుమానితులుగా మారారు. వీరి ద్వారా ఎంతమందికి సోకిందో ఏమో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో గత రెండు రోజుల్లో కరోనా అనుమానితులుగా ఐసోలేషన్‌కు తరలుతున్న వారు ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో ఇప్పుడు కలకలం చెలరేగుతోంది. ఇప్పటికే ఎంతో అప్రమత్తంగా ఉన్న జిల్లా యంత్రాంగం అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచుతూ.. లక్షణాలు ఉన్న వారిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రార్థనల్లో పాల్గొన్న వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించాలని అధికార యంత్రాంగం ప్రకటించింది. ఏది ఏమైనా కనిపించని శుత్రువుతో ఇటు ప్రభుత్వం అటు ప్రజలు పోరాటం చేస్తున్నారు.

ఇండోనేషియన్లకు నెగెటివ్‌ రిపోర్టు...
కరీంనగర్‌కు మత ప్రచారం కోసం వచ్చి మార్చి 16న కరోనా అనుమానితులుగా కరీంనగర్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి పది మంది ఇండోనేషియన్లను తరలించగా వారందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారు సంచరించిన ప్రాంతాలను క్వారంటైన్‌ చేసి, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. కాగా, 15 రోజుల చికిత్స అనంతరం వారికి తిరిగి పరీక్షలు నిర్వహించగా, 9 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. వీరితో సన్నిహితంగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు మాత్రం క్వారంటైన్‌ తప్పడం లేదు.

మరో వారం రోజులు కీలకం..
కరీంనగర్‌లో సోమవారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నమోదు కావడంతో పరిస్థితులు మరో వారం రోజులు కీలకంగా మారాయి. కరీంనగర్‌ జిల్లాలోకి ఇండోనేషియా దేశస్తులు మత ప్రచారం కోసం రావడంతోనే వారి ద్వారా కరోనా కలకలం మొదలైంది. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులకు కరోనా లక్షణాలు ఉండడంతో... 16న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో మూడు రోజుల వ్యవధిలో పది మంది విదేశీ బృందంతోపాటు వారికి సహాయకుడిగా పనిచేసిన స్థానిక వ్యక్తికి సైతం పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. స్థానిక వ్యక్తికి పాజిటివ్‌ తేలిన తర్వాత వారి కుటుంబ సభ్యులపై జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం స్థానిక వ్యక్తి తల్లి, సోదరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మరోమారు జిల్లా యంత్రాంగం అలర్ట్‌ అయింది. ఇప్పటి నుంచి మరో వారం రోజులపాటు పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారో వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి తోడు ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి కుటుంబసభ్యులపై ప్రత్యేకంగా దష్టి సారించారు.

పరిస్థితిపై మంత్రుల ఆరా...
కరీంనగర్‌లో మరో రెండు పాజిటివ్‌ కేసులు నమో దు కావడం, ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనలు చేసిన వారిలో 17 మంది కరీంనగర్‌కు చెందిన వారే కావడంతో ఇక్కడి పరిస్థితిపై జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారు ఎవరెవరిని కలిశారు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారెంతమంది ఉంటే అంత మందిని క్వారంటైన్‌ చేయడం లేదా పరిస్థితి తీవ్రంగా ఉంటే ఐసోలేషన్‌కు తరలించడం చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. హుటాహుటిన అధికార యంత్రాంగా న్ని అప్రమత్తం చేశారు. దీంతో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజా త రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement